English | Telugu
ఇంద్రజలో అద్భుతమైన సింగర్! కమెడియన్స్ స్టాండింగ్ ఒవేషన్!!
Updated : Nov 1, 2021
ఇంద్రజ చక్కని నటి. ఆ విషయం తను నటించిన ప్రతి సినిమా ద్వారా ఆమె నిరూపించారు. అందచందాలు, అభినయ సామర్థ్యం కలిగిన తక్కువ మంది తారల్లో ఆమె ఒకరు. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ అభినయంతోటే ఆమె మంచి పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు బుల్లితెరపైనా ఆమె తన ముద్రను వేస్తున్నారు. రోజా గైర్హాజరీతో కొద్ది కాలం జబర్దస్త్ జడ్జిగా వ్యవహరించిన ఆమెను, ఆ తర్వాత వివిధ షోలలో సెలబ్రిటీ జడ్జిగా కొనసాగిస్తూ వస్తోంది మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్.
అలాంటి షోలలో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఒకటి. రానున్న ఎపిసోడ్‌లో ఇంద్రజలోని మరో కోణాన్ని మనం చూడబోతున్నాం. ఆ షో లేటెస్ట్ ప్రోమోలో ఇంద్రజ సింగర్ అవతారం ఎత్తారు. 'జీన్స్' సినిమాలో ఎ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ సమకూర్చగా సూపర్ పాపులర్ అయిన "కన్నులతో చూసేవీ గురువా కనులకు సొంతమవునా" పాటను ఆమె రాగయుక్తంగా, తాళబద్ధంగా, గతి తప్పకుండా పాడిన వైనం అందరినీ మెస్మరైజ్ చేసింది. ఈ ఎపిసోడ్‌కు స్పెషల్ గెస్ట్‌గా వచ్చిన సీనియర్ నటి సుధ కళ్లయితే చెమ్మగిల్లాయి. ఇంద్రజ పాడటం పూర్తయ్యాక లేచి నిల్చొని, చప్పట్లతో తన ఆనందాతిరేకాన్ని ఆమె వ్యక్తం చేశారు.
వారే కాదు, ఆ షోలో పాల్గొన్న కమెడియన్స్.. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, రోహిణి, ఇమ్మానియేల్‌తో పాటు సింగర్ ధనుంజయ్ కూడా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. నిజంగా ఇంద్రజలో చాలా చక్కని సింగర్ ఉందనే విషయం ఇప్పుడందరికీ తెలిసింది.
ఈ నెల 7 మాటల మాంత్రికులు త్రివిక్రమ్ పుట్టినరోజు. వచ్చే ఎపిసోడ్ అదే రోజు ప్రసారం కానున్న సందర్భంగా త్రివిక్రమ్‌కు నీరాజనాలు అర్పిస్తూ కొన్ని పర్ఫార్మెన్స్‌లు చేశారు.