English | Telugu
వివాదంపై హైపర్ ఆది క్లారిఫికేషన్!
Updated : Jun 15, 2021
'జబర్దస్త్' కమెడియన్ హైపర్ ఆదిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు సోమవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. హైపర్ ఆది తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచాడని.. క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ ఫెడరేషన్ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో ఆది వివాదంలో చిక్కుకున్నాడు. దీనిపై స్పందించిన ఆయన తను ఎక్కడా తెలంగాణ సంస్కృతిని కించపరచలేదని.. స్క్రిప్ట్ తను రాసింది కాదని.. తను కేవలం ఆర్టిస్ట్ మాత్రమేనని అన్నాడు.
తెలంగాణ ప్రజలు ప్రతిష్ఠాత్మకంగా భావించే బతుకమ్మ పండగ నేపథ్యంలో ఆది ఇటీవల చేసిన స్కిట్ ఇప్పుడు వివాదాలను తీసుకొచ్చింది. ఆదివారం నాడు జరిగిన ఓ షోలో ఈ స్కిట్ ప్రసారమైంది. అందులో "ఉయ్యాలో ఉయ్యాలో.." అంటూ బతుకమ్మ పాట పాడుతూ కమెడియన్లు అందరూ చుట్టూ తిరిగే దృశ్యం ఉంది. బతుకమ్మ పాట మీద కామెడీ చేస్తూ ఈ సన్నివేశాలను నడిపించారు. ఇది తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్లకు ఆగ్రహం తెప్పించింది.
తెలంగాణ గ్రామదేవతల పండుగలను, ఇక్కడి ప్రజల యాస భాషలను కించపరిచేలా ఈ స్కిట్ ఉందని, హైపర్ ఆదితో పాటు ఈ స్కిట్ రైటర్, దీన్ని ప్రొడ్యూస్ చేసిన మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ మీద చర్యలు చేపట్టాలని కోరుతూ హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు నమోదైనట్లు తెలియగానే సదరు ఎపిసోడ్‌ను నిర్వాహకులు యూట్యూబ్ నుంచి తొలగించారు.