English | Telugu
దేత్తడి హారిక గురించి మీకు తెలీని విషయాలు.. ఆమె పెళ్లెప్పుడంటే...
Updated : Jul 9, 2021
'దేత్తడి' హారిక ఇప్పుడొక సెలబ్రిటీ. యాంకర్‌గా ఉన్నప్పుడు కంటే బిగ్ బాస్ షోకి వెళ్లాకే ఆమెకు ఆ సెలబ్రిటీ హోదా వచ్చింది. హారిక ఎలా ఎదుగుతూ వచ్చిందనేది ఆసక్తికరం. చిన్నప్పుడు మంచిగా పాటలు పాడుతోందని హారిక రెండున్నరేళ్ల వయసులోనే ఉండగా సంగీతం నేర్పించాలని చూశారు ఇంట్లోవాళ్లు. సెకండ్ క్లాస్‌లోకి వచ్చేదాకా నేర్చుకుంది కానీ హై పిచ్‌లో పాడుతుంటే హారికకు తలనొప్పి వచ్చేసేది. దాంతో ఏడ్చేసేది హారిక. ఇది చూసి సంగీతం టీచర్ తిట్టేది. అందువల్లనేమో ఆమెకు సంగీతం మీద ఆసక్తిపోయింది. సంగీతం క్లాసులకు వెళ్తుంటే తలనొప్పి రావడం చూసి, తలకు ఏమైనా అవుతుందేమోనని భయపడి, సంగీతం మాన్పించేశారు వాళ్లమ్మ జ్యోతి. ఆమె భర్త నుంచి విడిపోయారు. పిల్లలిద్దర్నీ తనే పెంచి పెద్దచేశారు.
హారిక తల్లి కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. వారికి ఇద్దరు పిల్లలు.. వంశీ కార్తీక్, అలేఖ్య హారిక. వంశీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. హారిక బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు ఆమె తరపున సోషల్ మీడియాలో మంచి ప్రాపగాండా చేశాడు. హారిక హైదరాబాద్‌లోనే పెరిగింది. డాన్స్ మీద అసక్తి చిన్నప్పట్నుంచే ఉంది. తను హిమాయత్‌నగర్‌లోని హార్వర్డ్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకుంది. డాన్స్ కాంపిటిషన్స్‌లో పార్టిసిపేట్ చేసేది. డాన్స్ కోసం క్లాసులకు కూడా బంకు కొట్టేసేది. హారిక చదువుకున్న స్కూల్లోనే ఆమె తల్లి టీచర్‌గా చేయడం గమనార్హం. ఆమె ఎం.ఏ. పొలిటికల్ సైన్స్ చదువుకున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఉద్యోగం రావడంతో ఆమె టీచర్ పని వదిలేశారు. హారిక సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో చదువుకున్నాక, కొంత కాలం అమెజాన్‌లో ఉద్యోగం చేసింది.
హారికకు ఊరికే ఇంట్లో కూర్చోవాలంటే ఆమె చేతకాదు. ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తుండాలనే మనస్తత్వం ఆమెది. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకొనే ఉద్దేశం ఆమెకు లేదు. ప్రస్తుతం ఆమె దృష్టంతా పనిమీదే. ఇటీవలే ఒక వెబ్ సిరీస్ చేసింది. కెరీర్‌లో సంతృప్తి చెందాక ఆమెకు పెళ్లి చేస్తామని వాళ్లమ్మ చెప్పారు. ఒకసారి తాను ఒకరితో ప్రేమలో ఉన్నాననీ, నాలుగేళ్ల తర్వాత అతనితో బ్రేకప్ అయ్యిందనీ బిగ్ బాస్ హౌస్‌లో ఉండగా బయటపెట్టి సంచలనం సృష్టించింది హారిక. ఆ విషయం తొలిసారి వాళ్లకు ఆమె చెప్పింది ఆ ప్లాట్‌ఫామ్ నుంచే. ఆమె తల్లి ఒక ఐదేళ్ల పాటు హిమయత్ నగర్‌లో ఒక బౌటిక్ నడిపి, ఫ్యామిలీని మణికొండకు షిఫ్ట్ చేయడంతో ఇటీవలే దాన్ని తీసేశారు. ఇప్పుడామె హారిక యూట్యూబ్ చానల్ కోసం వీడియోలు చేసే పనిలో ఉన్నారు.