English | Telugu

కుర్ర మాస్ట‌ర్ ఇచ్చిన కిస్‌.. సిగ్గుల మొగ్గ‌యిన మోనాల్‌!

'సుడిగాడు' సుంద‌రి మోనాల్ గ‌జ్జ‌ర్‌కు సినిమాల కంటే ఎక్కువ‌గా బిగ్ బాస్ షో పాపులారిటీ తెచ్చింది. అల్ల‌రి న‌రేశ్ జోడీగా 'సుడిగాడు' సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి అల‌రించిన ఈ గుజ‌రాతీ గుమ్మ‌కు త‌ర్వాత ఆశించిన రీతిలో ఆఫ‌ర్స్ రాలేదు. తెలుగు ప్రేక్ష‌కులు దాదాపు ఆమెను మ‌ర‌చిపోయిన స్టేజ్‌లో స‌డ‌న్‌గా బిగ్ బాస్ సీజ‌న్ 4లో కంటెస్టెంట్‌గా పాల్గొని, త‌న గ్లామ‌ర్‌తో, ల‌వ్ ట్రాక్స్‌తో హెడ్‌లైన్స్‌లోకి ఎక్కింది. హోస్ట్ నాగార్జున స‌పోర్ట్‌తో చివ‌రిదాకా బిగ్ బాస్ హౌస్‌లో నిలిచిన మోనాల్ ఆ షో అయిపోయాక కూడా స‌హ కంటెస్టెంట్‌, షో ర‌న్న‌ర‌ప్ అఖిల్ సార్థ‌క్‌తో ప్రేమాయ‌ణం కొన‌సాగిస్తున్న‌ట్లు వినిపిస్తూనే ఉంది. 'అల్లుడు అదుర్స్' సినిమాలో హీరో బెల్లంకొండ శ్రీ‌నివాస్‌తో "రంభా ఊర్వ‌శి"అనే ఐట‌మ్ సాంగ్ చేసి ఆడియెన్స్‌ను ఉర్రూత‌లూగించింది.

ప్ర‌స్తుతం స్టార్ మా చాన‌ల్‌లో ప్ర‌సార‌మవుతున్న డాన్స్ ప్ల‌స్ షోలో ఒక జ‌డ్జిగా ఉంటూ, త‌న గ్లామ‌ర్‌తో షోకు ఆక‌ర్ష‌ణ‌ను తీసుకొచ్చింది. ఓంకార్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్‌తో మ‌రోసారి అంద‌‌రి దృష్టిలో ప‌డింది మోనాల్‌. ఈ ఎపిసోడ్‌లో యంగ్ డాన్స్ మాస్ట‌ర్ క‌న్నా ఆమెకు ముద్దివ్వ‌డం ఊహించ‌ని విష‌యం. క‌న్నా చేసిన ప‌నికి మొద‌ట ఆశ్చ‌ర్య‌పోయిన మోనాల్‌, త‌ర్వాత మురిపెంగా న‌వ్వేసింది.

ఈ షోలో క‌న్నా మాస్ట‌ర్ ట్రైనింగ్ ఇచ్చిన కంటెస్టెంట్లు డాన్స్ ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చాక‌, వారి ప‌ర్ఫార్మెన్స్‌కు ముచ్చ‌ట‌ప‌డిన హోస్ట్ ఓంకార్‌, "బాబూ క‌న్నా ఎక్క‌డున్నావ్ నాయ‌నా?" అని పిలిచాడు. ఆ వెంట‌నేవైట్ క‌ల‌ర్ సిల్క్ షర్ట్‌, లుంగీ ధ‌రించి, క‌ళ్ల‌కు క‌ల‌ర్ గ్లాస్‌లు పెట్టుకొని డాన్స్ చేస్తూ వ‌చ్చాడు క‌న్నా. జ‌డ్జిలు ఉన్న ప్లేస్‌కు వెళ్లి మోనాల్ చేయి ప‌ట్టుకొని లేపి, ఆమెను స్టేజి మీద‌కు తీసుకువ‌చ్చాడు. న‌వ్వుతూ అత‌డిని అనుస‌రించింది మోనాల్‌. స్టేజి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేలోపుగానే అప్ప‌టిదాకా దాచిన గులాబీ పువ్వు తీసి, ఆమెకు అందించాడు. ఆశ్చ‌ర్య‌పోతూనే దాన్ని అందుకుంది మోనాల్‌.

క‌న్నా హుషారుగా డాన్స్ చేస్తుంటే, త‌నూ అడుగులు క‌దిపింది. ఆ త‌ర్వాత ముఖానికి మాస్క్ వేసుకొని, మోకాళ్ల‌పై కూర్చొని, మోనాల్ చేయందుకొని ఆ చేతిపై ముద్దు పెట్టేశాడు క‌న్నా. ఏమాత్రం ప్ర‌తిఘటించ‌‌‌కుండా అత‌డితో ముద్దు పెట్టించుకొని సిగ్గుల మొగ్గ‌వుతూ, న‌వ్వులు చిందించింది మోనాల్‌. దాంతో జ‌డ్జిలు స‌హా అంద‌రూ స‌ర్‌ప్రైజ్ అవుతూ, న‌వ్వేశారు. ఈ వీకెండ్‌ ప్ర‌సారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ఈ ప్రోమో నెట్టింట తెగ సంద‌డి చేస్తోంది.‌‌‌ఏదేమైనా మోనాల్‌, క‌న్నా ఎపిసోడ్ చూస్తే అఖిల్ సార్థ‌క్ ఏమైపోతాడోనంటూ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.