English | Telugu

నాగార్జునకు బిగ్ షాక్.. బిగ్‌బాస్‌ 5 ఫస్ట్ ఎపిసోడ్‌ కు దారుణ రేటింగ్!

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ సెప్టెంబర్‌ 5న ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అక్కినేని నాగార్జున వరుసగా మూడోసారి ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఐదో సీజన్‌ తో ఐదు రెట్ల ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తామంటూ నాగార్జున చెప్పారు. దీంతో ఐదో సీజన్‌ అదరగొడుతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ.. బిగ్‌బాస్‌ 5 లాంచింగ్‌ ఎపిసోడ్‌ కు దారుణమైన రేటింగ్ వచ్చింది.

బిగ్‌బాస్‌ తొలి సీజన్‌ కు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్ గా వ్యవహరించారు. బిగ్‌బాస్‌ షో తెలుగు ప్రేక్షకులకు చేరువ అవ్వడానికి ఆయనే ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఆయన హోస్ట్ చేసిన తొలి సీజన్‌ లాంచ్‌ ఎపిసోడ్‌కు 16.18 టీఆర్పీ వచ్చింది. ఆ తర్వాత నేచురల్‌ స్టార్‌ నాని హోస్ట్ చేసిన రెండో సీజన్‌ తొలి ఎపిసోడ్‌కు 15.05 టీఆర్పీ వచ్చింది. ఇక మూడో సీజన్ నుండి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మూడవ సీజన్‌ ఫస్ట్‌ ఎపిసోడ్‌కు అనూహ్యంగా 17.92 టీఆర్పీ వచ్చింది. నాలుగో సీజన్‌ లాంచింగ్‌ ఎపిసోడ్‌ కు అయితే ఏకంగా 18.5 టీఆర్పీ వచ్చింది. దీంతో ఐదో సీజన్‌తో నాగార్జున ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడోనని అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా గత రెండు సీజన్ల కంటే ఈ సీజన్ కు తక్కువ రేటింగ్‌ నమోదైంది.

బిగ్‌బాస్‌ సీజన్‌ 5 లాంచ్‌ ఎపిసోడ్‌ కు 15.7 టీఆర్పీ వచ్చింది. గత రెండు సీజన్లతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. అయితే కంటెస్టెంట్ల వివరాలు ముందే లీక్ కావడమే తొలి ఎపిసోడ్‌ కు తక్కువ రేటింగ్‌ రావడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. మరోవైపు, ఈ సీజన్ లో చాలావరకు కొత్త ముఖాలే ఉండటంతో ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపట్లేదని టాక్ వినిపిస్తోంది. మరి ముందు ముందు నాగార్జున ఏమైనా మ్యాజిక్ చేస్తారేమో చూడాలి.