English | Telugu

తమిళ బిగ్‌బాస్‌ లో తెలుగమ్మాయి!

కోలీవుడ్ స్టార్ హీరో కమల్‌‌ హాసన్ హోస్ట్ చేస్తున్న తమిళ బిగ్‌‌ బాస్ సీజన్-5 అక్టోబర్ 3న గ్రాండ్‌‌ గా మొదలైంది. తమిళ బిగ్‌బాస్‌ షో ఐదో సీజన్‌ 18 కంటెస్టెంట్లతో ప్రారంభమైంది. అయితే వారిలో మన తెలుగమ్మాయి పావని రెడ్డి కూడా ఉంది. దీంతో ఆమె గురించి తెలుసుకోవడానికి తెలుగు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు.

మొదట్లో మోడలింగ్‌ చేసిన పావని రెడ్డి తర్వాత బుల్లితెరపై అడుగు పెట్టింది. తెలుగులో అగ్నిపూలు, నా పేరు మీనాక్షి వంటి హిట్‌ సీరియల్స్‌ లో నటించింది. అలాగే ది ఎండ్, డబుల్ ట్రబుల్, లజ్జ, డ్రీమ్ వంటి సినిమాల్లోనూ తళుక్కున మెరిసింది. అయితే తెలుగులో ఆశించినంత గుర్తింపు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది. అక్కడ పలు సీరియల్స్‌, సినిమాలలో నటిస్తూ తమిళ ప్రేక్షకులకు బాగానే దగ్గరైంది.

పావని రెడ్డి తెలుగు ఇండస్ట్రీకి దూరమవ్వడానికి మరో కారణం కూడా ఉంది. ఆమె 2013లో నటుడు ప్రదీప్‌ కుమార్‌ ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. అయితే అతను 2017లో ఆత్మహత్య చేసుకున్నాడు. పావని రెడ్డి మరొకరితో చనువుగా ఉన్న ఫోటోను చూసి మనస్తాపంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. అప్పట్లో ఈ వ్యవహారం తెలుగునాట హాట్‌ టాపిక్‌ గా మారింది. ఆ ఘటన తర్వాత ఆమె తెలుగు ఇండస్ట్రీకి గుడ్‌ బై చెప్పి చెన్నైలోనే సెటిల్‌ అయిపోయింది. 2020లో ఆనంద్‌ జాయ్‌ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. ఇక ఇప్పుడు తమిళ బిగ్‌బాస్‌ హౌస్‌ లోకి ఎంటర్ అయింది. మరి పావని రెడ్డి ఈ షో తో తమిళ ప్రేక్షకులను ఏ మేర మెప్పిస్తుందో చూడాలి.