English | Telugu

మోనితకు శ్రీమంతం చేసిరా! వంటలక్క మీద కార్తీక్ ఫైర్‌!!

మోనిత పేపర్‌కు ఎక్కడంతో వంటలక్కలో కంగారు మొదలైంది. పేపర్ పిల్లల కంట పడడం, వాళ్లేమో తండ్రిని దోషిలా చూస్తుండడంతో మోనితకు వార్నింగ్ ఇవ్వడానికి వంటలక్క జైలుకు వెళ్ళింది. వెళుతూ వెళుతూ యాపిల్స్ పట్టుకుని వెళ్ళింది. పేపర్‌లో పిచ్చి రాతలు మానెయ్యమని మోనితతో సీరియస్‌ నోట్‌లో చెప్పింది. అయితే, ఎప్పటిలా కార్తీక్ చేత నా మెడలో తాళి కట్టిస్తే ఇవన్నీ మానేస్తానని మోనిత అన్నది. లేదంటే పిల్లలకు నిజం చెప్పేయమని అంటుంది.

ఇంటికి వచ్చిన దీపను 'ఎక్కడికి వెళ్ళావ్?' అని సౌందర్య అడుగుతుంది. 'మోనిత దగ్గరకు' అని చెబుతుంది. దాంతో కార్తీక్ కోప్పడతాడు. 'ఆ మోనిత ఓ క్రూరమృగం. మాటలతో చెబితే మారిపోతుందా? పైగా, యాపిల్స్ తీసుకువెళ్లావా? ఈసారి జ్యూస్ తీసుకువెళ్ళు. శ్రీమంతం చేసిరా' అని ఫైర్ అవుతాడు కార్తీక్. అప్పుడే మోనిత న్యూస్ పడిన పేపర్ కనిపించడం లేదని భర్తతో వంటలక్క చెబుతుంది. దాంతో కార్తీక్ కూలబడతాడు. దీపను తిట్టడంతో పాటు పిల్లలకు తెలిస్తే అని కుమిలిపోతాడు.

ఆల్రెడీ పేపర్ చదివిన హిమ దగ్గరకు దీప వెళుతుంది. ఏమైందని అంటే... 'డాడీ మంచివాడేనా? ఎందుకు కష్టాలు వస్తున్నాయి' అని తల్లిని హిమ ప్రశ్నిస్తుంది. 'మంచివాళ్లకు ఎక్కువ కష్టాలు వస్తాయి' అని అమ్మాయికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంది దీప. వెంటనే, 'మరి మోనిత ఆంటీ మంచిదేనా? అందుకే తనకీ కష్టాలు వస్తున్నాయా? జైల్లో ఉన్నవాళ్లు చెడ్డవాళ్ళా? బయట ఉన్నవాళ్లు మంచివాళ్లా?' అని ప్రశ్నల వర్షం కురిపించడంతో కొంపతీసి పేపర్ పిల్లల కంట పడిందేమోనని దీప కంగారు పడుతుంది. మరోవైపు సుకన్య సాయంతో ఏదో ప్లాన్ వేయడానికి ప్రయత్నిస్తుంది జైల్లో ఉన్న మోనిత. అదేమిటన్నది రాబోయే ఎపిసోడ్స్‌లో చూడాలి.