English | Telugu

నిద్రలోనే చనిపోతాననుకున్నా.. నా చెల్లెలు వ‌చ్చి సేవ‌లు చేసింది!!

'జబర్దస్త్' కామెడీ షోతో గత ఎనిమిదేళ్లుగా ప్రేక్షకులను నవ్విస్తున్నాడు అదిరే అభి. తన కెరీర్ ఆరంభంలో మిమిక్రీ ఆర్టిస్ట్ గా పని చేసిన అభి.. ఆ తరువాత యాంకర్ గా కొన్ని షోలు చేశాడు. అతడికి మంచి పేరు రావడంతో సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి. కొన్నాళ్లుగా ఆయన బుల్లితెరకే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో 'జబర్దస్త్' షోలో తన కామెడీ స్కిట్ లతో ఆకట్టుకుంటున్నాడు. మిగిలిన వారి స్కిట్ లలో బూతులు దొర్లినా.. అదిరే అభి మాత్రం క్లీన్ కామెడీతో మెప్పిస్తుంటాడు.

ఎప్పుడూ నవ్వుతూ కనిపించే కమెడియన్లు కూడా నిజ జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొంటారు. ఒక్కోసారి ఆ విషయాలను బయటపెడుతుంటారు. అభి కూడా తన జీవితంలో ఓ మర్చిపోలేని అనుభవం గురించి ఓ షోలో చెప్పుకొచ్చాడు. సుమ యాంకర్ గా ప్రముఖ ఛానెల్ లో 'క్యాష్' షో ప్రసారమవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ షోలోకి సెలబ్రిటీ అన్నా, చెల్లెళ్లను అతిథులుగా తీసుకొచ్చారు.

మహేష్ విట్టా, రోల్ రైడా, అదిరే అభి తమ చెల్లెళ్లతో రాగా.. బిగ్ బాస్ హిమజ తన తమ్ముడిని తీసుకొచ్చింది. వీరందరూ కలిసి షోని చాలా ఎంటర్టైనింగ్ గా మలిచారు. ఇదే సమయంలో అభి తను నిద్రలోనే చనిపోతాననుకున్నానని చెప్పి ఎమోషనల్ అయ్యాడు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా.. తనకు కరోనా సోకిందని.. అప్పుడు చనిపోతాననే భయంతో రాత్రిపూట తన రూమ్ గొళ్లెం పెట్టకుండా పడుకునేవాడ్నని చెప్పుకొచ్చారు. నిద్రలో ఏదైనా జరిగితే తనను చూడ్డం కుదరదని అలా చేసేవాడినని కంటతడి పెట్టుకున్నారు. ఆ సమయంలో తన చెల్లెలు దుబాయ్ నుండి వచ్చి తనకు సేవలు చేసిందని చెప్పుకొచ్చారు.