English | Telugu
బిగ్ షాక్.. 'బిగ్‌బాస్-13' విన్నర్, 'చిన్నారి పెళ్లికూతురు' హీరో మృతి!
Updated : Sep 2, 2021
ప్రముఖ బాలీవుడ్-టీవీ యాక్టర్, హిందీ 'బిగ్ బాస్' పదమూడో సీజన్ విన్నర్ సిద్ధార్థ్ శుక్లా మృతి చెందారు. ఆయన వయసు 40 సంవత్సరాలు. గురువారం ఉదయం తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికి మృతి చెందినట్టు కూపర్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సిద్ధార్థ్ శుక్లాకు తల్లి, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.
'బాలికా వధు' సీరియల్ సిద్ధార్థ్ శుక్లాకు ప్రేక్షకుల్లో విపరీతమైన గుర్తింపు తీసుకొచ్చింది. తర్వాత అతను 'బిగ్ బాస్ - 13' విన్నర్ గా నిలిచారు. ఇటీవల 'బిగ్ బాస్' ఓటీటీలోనూ కనిపించాడు. 'హంప్టీ శర్మ కె దుల్హనియా'లో సపోర్టింగ్ రోల్ ద్వారా సిల్వర్ స్క్రీన్ కు సిద్ధార్థ్ పరిచయమయ్యాడు. ఏక్తా కపూర్ నిర్మించిన 'బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్'లో అగస్త్య పాత్రలో నటించాడు. రియాలిటీ షోల్లో కూడా కనిపించాడు. సోషల్ మీడియాలో ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉంది.
సిద్ధార్థ్ ఆకస్మిక మృతికి దేశంలోని ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయింది. పలువురు సెలబ్రిటీలు ఈ వార్త నిజం కాకపోతే బాగుండునంటూ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వార్తను తట్టుకోలేకపోతున్నామని సంతాపం వ్యక్తం చేశారు.