English | Telugu

బిగ్‌బాస్ షో కోసం జెస్సీ డ‌బ్బులిచ్చాడా?

బిగ్‌బాస్ సీజ‌న్ 5 తెలుగు ప్రారంభం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు విమ‌ర్శ‌లు ఎదుర్కొంటూనే వుంది. తాజాగా మ‌రో ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఈ షోలోకి ఎంపిక‌య్యే కంటెస్టెంట్‌ల నుంచి నిర్వాహ‌కులు డ‌బ్బులు తీసుకుంటున్నార‌ని, వారిచ్చే డ‌బ్బుల ఆధారంగానే కంటెస్టెంట్‌ల‌ని నిర్వాహ‌కులు ఎంపిక చేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ఓ కార‌ణం కూడా వుంది. బిగ్‌బాస్ షోలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌టీన‌టులు, క‌మెడియ‌న్‌లు, సింగ‌ర్‌లు, డ్యాన్స్ మాస్ట‌ర్‌లు, ట్రాన్స్ జెండ‌ర్‌లు మాత్ర‌మే కంటెస్టెంట్‌లుగా ఎంపిక‌య్యారు.

కానీ మొట్ట‌మొద‌టి సారి సీజ‌న్ 5 కోసం ఓ మోడ‌ల్‌ని ఎంపిక చేయ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. అత‌ని నుంచి నిర్వాహ‌కులు డ‌బ్బులు తీసుకునే ఎంపిక చేశారంటూ తాజాగా ప్ర‌చారం మొద‌లైంది. ఇదంతా అనారోగ్య కార‌ణాల వ‌ల్ల హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చిన కంటెస్టెంట్ జెస్సీ గురించే. అయితే తాజాఆ విమ‌ర్శ‌ల‌పై జెస్సీ స్ట్రాంగ్ రిప్లై ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. త‌ను డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని, డ‌బ్బులిచ్చి తాను హౌస్లోకి వ‌చ్చాన‌ని జ‌రుగుతున్న ప్ర‌చారంలో ఎలాంటి నిజం లేద‌ని ఈ సంద‌ర్భంగా జెస్సీ క్లారిటీ ఇచ్చాడు.

ప్రేక్ష‌కులే కాకుండా హౌస్‌లో వున్న వాళ్లు కూడా నేను డ‌బ్బులిచ్చే హౌస్‌లోకి వచ్చాన‌ని విమ‌ర్శ‌లు చేశార‌ని, కానీ నేను బిగ్‌బాస్ నిర్వాహ‌కుల‌కు డ‌బ్బులివ్వ‌డం ఏంట‌ని ఎదురు ప్ర‌శ్నిస్తున్నాడు. నా ఎకౌంట్‌లో కేవ‌లం రూ. 11 వేలు మాత్ర‌మే వున్నాయ‌ని, నా ఆర్థిక స్టోమ‌త అంతంత మాత్ర‌మేన‌ని చెప్పుకొచ్చాడు. త‌న‌కు తండ్రి లేడ‌ని, రాత్రిళ్లు ఉద్యోగం చేసి ఆ డ‌బ్బుతో మోడ‌లింగ్ లోకి వెళ్లాన‌ని .. తన టాలెంట్‌ని గుర్తించే బిగ్‌బాస్ ఆఫ‌ర్ ఇచ్చార‌ని, త‌ను మాత్రం అంతా అంటున్న‌ట్టుగా ఎలాంటి డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని స్పష్టం చేశాడు.