English | Telugu

బిగ్‌బాస్ : ఈ రోజు ర‌చ్చ అంత‌కు మించి

మొత్తానికి విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 5 ప‌ద‌వ వారంలోకి ఎంట్రీ ఇచ్చేసింది. కంటెస్టెంట్‌ల విష‌యంలో ఇప్ప‌టికే ప‌లువురు విమ‌ర్శ‌లు చేస్తూనే వున్నారు. సీజ‌న్ 4తో పోలిస్తే తాజా సీజ‌న్ అన్ని విష‌యాల్లోనూ తేలిపోయింద‌ని, కంటెస్టెంట్‌ల పెర్ఫార్మెన్స్ ఏమంత‌గా లేద‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న నెటిజ‌న్స్ తాజాగా శ‌నివారం ఎపిసోడ్ విష‌యంలో హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న నాగ్ తీరుపై కూడా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ప‌ద‌వ వారం వ‌ర్టిగో వ్యాధి కార‌ణంగా బాధ‌ప‌డుతున్న జెస్సీ ఆరోగ్య‌కార‌ణాల వ‌ల్ల హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేశాడు. దీంతో అత‌ని స్థానంలో బ‌య‌టికి వెళ్లాల్సిన కాజ‌ల్ మొత్తానికి సేఫ్ అయిపోయింది. ఇదిలా వుంటే సోమ‌వారం నామినేష‌న్‌ల ప్ర‌క్రియ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో హౌస్ మ‌రోసారి ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌ల‌తో హీటెక్క‌బోతోంది. అంద‌రికి మ‌న‌సులో వున్న నిజాల‌ని బ‌య‌ట‌పెట్టే ధైర్యం వుండ‌దు. నిజాల‌ని నిర్భ‌యంగా నిల‌దీసే అవ‌కాశ‌మే ఈ రోజు జ‌రిగే నామినేష‌న్ ప్ర‌క్రియ అంటూ బిగ్‌బాస్ హౌస్ మెంబ‌ర్స్ మ‌ధ్య కొచ్చ చిచ్చుకు తెర‌లేపాడు.

దీంతో సోమ‌వారం రోజు ర‌చ్చ అంత‌కు మించి వుండేలా క‌నిపిస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. `నీ త‌ప్పు నీకు చెబితే నీకు నేను ఫేక్ ఎలా అనిపించానో నాకు అర్థం కాలేదు మామా అంటూ స‌న్నీని ఉద్దేశించిన ర‌వి అన‌డం.. అంద‌రి ముందు నాది బ్యాడ్ బిహేవియ‌ర్ అన‌డం .. ఆ వ‌ర్డ్‌ని నేనే తీసుకోలేక‌పోయాను మామ‌` అని స‌న్నీ స‌మాధానం చెప్ప‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య ర‌చ్చ‌కు దారి తీసింది. ఇదిలా వుంటే ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ష‌న్నూ .. కాజ‌ల్‌ని నామినేట్ చేయ‌డం.. ఇంటి నుంచి నువ్వు బ‌య‌టికి వెళ్లిపోతే గొడ‌వ‌లు త‌గ్గుతాయ‌ని నా ఫీలింగ్ అని చెప్ప‌డం.. ఇదే క్ర‌మంలో స‌న్నీ కార‌ణంగా మాన‌స్‌, ష‌న్నూల మ‌ధ్య గొడ‌వ జ‌ర‌గ‌డంతో ఈ సోమ‌వారం ఎపిసోడ్ ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌నున్న‌ట్టుగా తెలుస్తోంది.