English | Telugu

మాన్సీకి చుక్క‌లు చూపించిన అను

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా అల‌రిస్తున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. విజ‌య‌వంత‌మైన మ‌రాఠీ సీరియ‌ల్ `తుల‌ఫ‌టేరే` ఆధారంగా తెలుగులో న‌టుడు, `బొమ్మ‌రిల్లు` ఫేమ్ శ్రీ‌రామ్ వెంక‌ట్ న‌టించి నిర్మించారు. గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రి నుంచి జీ తెలుగులో ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ గ‌త జ‌న్మ‌ల ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో రూపొందింది. కీల‌క పాత్ర‌లో క‌న్న‌డ న‌టి వ‌ర్ష న‌టించింది. రాజ‌నందిని ఆత్మ ఆర్య కోసం త‌పించే ఫాంట‌సీ క‌థ నేప‌థ్యంలో రూపొందిన ఈ సీరియ‌ల్ గ‌త ఏడాది కాలంగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.

మంగ‌ళ‌వారం రాత్రి ఎపిసోడ్ హైలైట్స్ ఒక‌సారి చూద్దాం. గాఢ నిద్ర‌లో వున్న అను వెంట‌నే లేచి రాజ‌నందిని రూమ్‌లోకి వెళుతుంది. గ‌దిలోకి వెళ్లాక అను నుంచి రాజ నందిని ఆత్మ బ‌య‌టికి వ‌స్తుంది. ఊహించ‌ని ప‌రిణామానికి షాక్ అయిన అను ఎవ‌రు మీరు అని అడుగుతుంది. అను క‌ళ్ల ముందున్న ఆత్మ నా పేరు రాజ‌నందిని అని చెబుతుంది. నేనే నువ్వు.. నువ్వే నేను అని చెప్ప‌డంతో అను కొంత క‌న్ప్యూజ‌న్‌కి గుర‌వుతుంది. మ‌రి మిమ్మ‌ల్ని ఏం చేశార‌ని అను అడిగితే చంపేశార‌ని, నా లాగే నిన్ను కూడా అంతం చేయాల‌ని చూస్తున్నార‌ని చెబుతుంది రాజ‌నందిని.

ఇదిలా వుంటే అను... రాజ‌నందిని గ‌దిలోకి వెళ్లిన విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన మాన్సీ ఎలాగైనా అనుని అంద‌రి ముందు దోషిగా నిల‌బెట్టాల‌ని ప్లాన్ చేస్తుంది. వెంట‌నే డోర్ లాక్ చేసేసి అంద‌రిని వెళ్లి పిల‌వాల‌ని వెళ్ల‌బోతుంది. ఇంత‌లో అను వెళ్లిపోతే ఇంత వ‌ర‌కు చేసిందంతా వేస్ట్ అవుతుంది కదా అని అక్క‌డే కాప‌లా కాస్తూ వుంటుంది. క‌ట్ చేస్తే రాజ నందిని త‌ను వ‌చ్చిన విష‌యం మ‌ర్చిపోతావ‌ని, అలా అయితే నిన్ను కూడా కాపాడ‌టం క‌ష్టం అవుతుంద‌ని అనుకి చెప్పి గుర్తుల కోసం ఓ డైరీలో రాసుకోమంటుంది. అలా డైరీలో రాసుకుని గ‌దిలోంచి బ‌య‌టికి వ‌చ్చేస్తుంది అను. అయితే అనులో రాజ‌నందిని ఆత్మ అలాగే వుంటుంది. ఈ విష‌యం తెలియ‌ని మాన్సీ.. అను రెడ్ హ్యాండెడ్‌గా దొరికి పోయావ‌ని, ఈ విష‌యాన్ని అంద‌రికి చెప్పేస్తానంటుంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన అను .. మాన్సీకి చుక్కులు చూపించేస్తుంది. మంగ‌ళ వారం జ‌రిగిన ఈ ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిని రేకెత్తించింది.