English | Telugu

వివాదంలో వారణాసి.. టైటిల్ మారుతుందా..?

వివాదంలో మహేష్-రాజమౌళి మూవీ
వారణాసి టైటిల్ తో తెలుగులో మరో చిత్రం
టైటిల్ మాదేనంటూ నిర్మాతల మండలికి ఫిర్యాదు
రాజమౌళి 'వారణాసి' టైటిల్ మారుస్తారా?

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ కి 'వారణాసి' అనే టైటిల్ ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 15న హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ ను నిర్వహించి టైటిల్ ను రివీల్ చేశారు. అయితే ఇప్పుడు ఈ వారణాసి టైటిల్ వివాదంలో చిక్కుకుంది. (Varanasi)

నిజానికి 'వారణాసి' టైటిల్ తో కొంతకాలం క్రితం తెలుగులో ఒక మూవీని అనౌన్స్ చేశారు. రామభక్త హనుమా క్రియేషన్స్ బ్యానర్‌‌లో ‘రఫ్’ మూవీ ఫేమ్ సుబ్బారెడ్డి దర్శకత్వంలో ఈ చిత్ర ప్రకటన వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా నిర్మాతలు.. రాజమౌళిపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి ఫిర్యాదు చేశారు.

రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ బ్యానర్‌పై 'వారణాసి' అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించి, టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశామని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజమౌళి తమ అనుమతి లేకుండా టైటిల్ వాడుకుంటున్నారని, ఈ విషయంపై న్యాయం చేయాలని నిర్మాతల మండలిని కోరారు.

Also Read: బాలకృష్ణకు ఐపీఎస్ అధికారి క్షమాపణలు..!

సినీ పరిశ్రమలో ఈ టైటిల్స్ వివాదం అనేది ఎప్పటినుండో ఉంది. ఈ తరహా వివాదం వచ్చినప్పుడు.. కొందరు రిక్వెస్ట్ చేసి టైటిల్ తీసుకుంటారు. మరికొందరు ఎంతో కొంత చెల్లించి టైటిల్ తీసుకుంటారు. వివాదం ముదిరితే.. టైటిల్ కి ముందు హీరో పేరో, డైరెక్టర్ పేరో చేర్చి.. సింపుల్ గా ఇది వేరే టైటిల్ అనేస్తారు.

గతంలో మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'ఖలేజా' సినిమా కూడా.. ఇలాగె టైటిల్ వివాదంలో చిక్కుకుంది. ఆ సమయంలో 'మహేష్ ఖలేజా'గా ఆ సినిమాను విడుదల చేశారు. ఇప్పుడు 'వారణాసి' విషయంలోనూ అలాంటిది జరగొచ్చు.

వారణాసి పోస్టర్ ను గమనిస్తే.. టైటిల్ పైన రాజమౌళి పేరుంది. 'మహేష్ ఖలేజా' బాటలోనే ఈ సినిమాని కూడా 'రాజమౌళి వారణాసి'గా విడుదల చేసినా ఆశ్చర్యంలేదు.

మరి చర్చలతో ఈ టైటిల్ వివాదానికి ఫుల్ స్టాప్ పెడతారో లేక ఖలేజా బాటలో పయనించి షాకిస్తారో చూడాలి.