English | Telugu

'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి కెవ్వుకేక అప్డేట్!

ఓ వైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మరోవైపు తాను గతంలో కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే బాధ్యతను కూడా తీసుకున్నారు. ఇటీవల 'హరి హర వీరమల్లు' చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. అలాగే 'ఓజీ' షూటింగ్ ను పూర్తి చేశారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఇక ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' వంతు వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. (Ustaad Bhagat Singh)

'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. ఇటీవల భారీ క్లైమాక్స్ సీక్వెన్స్ ను తెరకెక్కించినట్లు టీమ్ అధికారికంగా తెలిపింది. అదే జోష్ లో ఇప్పుడు ఓ సాంగ్ ను తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన భారీ సెట్ లో సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.

'ఉస్తాద్ భగత్ సింగ్'కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 'గబ్బర్ సింగ్' కోసం ఆయన స్వరపరిచిన సాంగ్స్ ఏ రేంజ్ హిట్ అయ్యాయో తెలిసిందే. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా.. 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆల్బమ్ ఉండేలా చూస్తున్నారట. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న పాటకు.. దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్ అందించారట. ఈ సాంగ్ ఫ్యాన్స్ చేత కెవ్వుకేక అనిపించేలా ఉంటుందని చెబుతున్నారు.