English | Telugu

ఆ విషయంలోనూ టాలీవుడ్‌ నెంబర్‌ వన్‌.. హీరోలు ఎందుకిలా చేస్తున్నారు?

ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది ఒక గొప్ప మలుపును తీసుకొస్తుంది. సాధారణ వ్యక్తుల విషయానికి వస్తే.. పెళ్లి వయసు దాటిపోయిందంటే వారికి పెళ్లి కావడం కష్టం అనే అభిప్రాయం ఉంది. కానీ, సినిమా రంగంలో అలా పెళ్లి వయసు దాటిపోయిన నటీనటులు ఎంతో మంది ఉన్నారు. వారిలో పెళ్లి చేసుకోకుండా ఇంకా బ్యాచిలర్‌ లైఫ్‌ని గడుపుతున్న హీరోలే ఎక్కువగా కనిపిస్తున్నారు. వీరందరికీ ఆదర్శంగా నిలిచిన వాడు బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌. 59 సంవత్సరాలు వచ్చినా ఇంకా పెళ్లి ఊసు లేకుండా సింగిల్‌గానే లైఫ్‌ని లీడ్‌ చేస్తున్నారు. ఇక టాలీవుడ్‌ విషయానికి వస్తే.. ఇప్పటికే 30 ఏళ్లు దాటిన హీరోలు ఇంకా పెళ్లిళ్లు చేసుకోకుండా కెరీర్‌పైనే దృష్టి పెడుతున్నారు.

Also Read :పవర్ స్టార్ ఊచకోత.. ఓటీటీలో ఓజీకి దిమ్మతిరిగే రెస్పాన్స్!

టాలీవుడ్‌లో పెళ్లి ఊసు లేకుండా సినిమాలే జీవితంగా గడుపుతున్న హీరోల్లో ప్రభాస్‌ గురించి ముందుగా చెప్పుకోవాలి. 46 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి ఊసు ఎత్తకుండా సినిమాలతో బిజీ అయిపోయాడు ప్రభాస్‌. బాహుబలి సినిమా జరుగుతున్న సమయంలో ప్రభాస్‌ పెళ్లి వార్త తెరపైకి వచ్చింది. అయితే అది అక్కడితో ఆగిపోయింది. అనుష్కను పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్తలు అనేక సార్లు మీడియాలో వచ్చాయి. అయితే ప్రభాస్‌గానీ, అనుష్కగానీ ఈ విషయంలో స్పందించలేదు. లేటెస్ట్‌ టెక్నాలజీని ఉపయోగించి వీరిద్దరికీ పెళ్లి కూడా చేసేసింది సోషల్‌ మీడియా. ప్రభాస్‌ పెద్దమ్మ శ్యామలాదేవి మాత్రం మా అబ్బాయికి వచ్చే ఏడాది పెళ్లి చేసేస్తాం అనే చెప్తూ వస్తున్నారు. కానీ, అది కూడా జరగలేదు. ప్రభాస్‌ ధోరణి చూస్తుంటే ఇప్పట్లో అతనికి పెళ్లి చేసుకునే ఆలోచన లేనట్టుగా కనిపిస్తోంది.

Also Read:చిన్నప్పటి ప్రభాస్ గా మహేష్ బాబు మేనల్లుడు

ఆ వరసలోనే మరో హీరో రామ్‌ పోతినేని 37 సంవత్సరాలు దాటినా ఇంకా బ్యాచిలర్‌గానే ఉన్నాడు. అయితే అతని పెళ్లి గురించి ప్రేక్షకులు అంతగా పట్టించుకున్నట్టుగానీ, డిస్కస్‌ చేసినట్టుగానీ ఎక్కడా కనిపించదు. పాతిక సంవత్సరాల క్రితం లవర్‌బోయ్‌గా ఒక వెలుగు వెలిగిన తరుణ్‌.. 42 ఏళ్ళ వయసులో ఇంకా సింగిల్‌గానే ఉన్నాడు.

మెగా కాంపౌండ్‌ హీరో సాయి ధరమ్‌తేజ్‌ వయసు 39 సంవత్సరాలు. అతనికి పెళ్లి చెయ్యాలని అతని తల్లి ఎంతో ఆసక్తిగా ఉన్నప్పటికీ తనకి ఇంకా టైమ్‌ కావాలని దాటవేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నయ్య పెళ్లి చేసుకుంటే తనకు లైన్‌ క్లియర్‌ అవుతుందని తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ ఎదురుచూస్తున్నాడు. అతని వయసు కూడా 30 ఏళ్లు దాటింది.

Also Read :అసలు ఈ భీమ్స్ ఎవరు!.. చనిపోయేంత పరిస్థితి ఎందుకు వచ్చింది

35 ఏళ్లు దాటిన మరో హీరో నవీన్‌ పొలిశెట్టి. ఇతను కూడా పెళ్లి కంటే కెరీర్‌ ముఖ్యమని భావిస్తున్నట్టుగా ఉన్నాడు. అందుకే కనుచూపు మేరలో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపించడం లేదు. ఆ వరసలోనే 30 ఏళ్లు దాటిన మరో హీరో విశ్వక్‌సేన్‌ కూడా పెళ్లి మాట ఎత్తకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అలాగే మరో హీరో సందీప్‌ కిషన్‌కి కూడా 38 ఏళ్ళు దాటాయి. అతను కూడా సినిమాలపైనే దృష్టి పెట్టాడు తప్ప పెళ్లి జోలికి వెళ్లడం లేదు. మరో హీరో రాజ్ తరుణ్‌కి 33 ఏళ్లు. అతను కూడా ఇప్పట్లో పెళ్లికి తొందరలేదు అన్నట్టుగానే ఉన్నాడు.

ఇలా టాలీవుడ్‌లోని చాలా మంది హీరోలు పెళ్లి అనే మాట వారి జీవితాల్లో వినిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. అలా పెళ్లికి దూరంగా ఉన్న హీరోలంతా 30 ఏళ్ళు పైబడినవారే కావడం విశేషం. 36 ఏళ్ళ విజయ్‌ దేవరకొండ ఎంగేజ్‌మెంట్‌ ఇటీవల రష్మిక మందన్నతో జరిగిందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే వారిద్దరూ దాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా ఎంగేజ్‌మెంట్‌ జరిగిందనే సమాచారం మాత్రం ఉంది.

ఇప్పటివరకు టాలీవుడ్‌లో పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉంటున్న హీరోల సంఖ్య ఎక్కువగానే ఉంది. ప్రభాస్‌ మొదలుకొని యంగ్‌ హీరోల వరకు పెళ్లిని ఎందుకు ఎవాయిడ్‌ చేస్తున్నారనే ప్రశ్న అందరిలోనూ మొదలైంది. ఏది ఏమైనా వారి కెరీర్‌ని చూసుకుంటూనే మన హీరోలంతా పెళ్లి పీటలు ఎక్కాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు.