English | Telugu

ప్రేక్షకులకు షాక్‌ ఇచ్చిన తులసి.. ఎందుకిలా చేసింది?

హీరోయిన్‌గా కంటే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానే తులసి అందరికీ పరిచయం. అక్క, వదిన, అమ్మ.. ఇలాంటి క్యారెక్టర్స్‌తోనే ప్రేక్షకులకు బాగా దగ్గరైన తులసి కెరీర్‌ ఎంతో సుదీర్ఘమైందని చెప్పాలి. 1967లో ప్రారంభమైన ఆమె సినీ ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 2025 సంవత్సరంలో తెలుగు, తమిళ్‌, కన్నడ భాషల్లో 7 సినిమాలు చేసి నటిగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సమయంలో ఆమె చేసిన ప్రకటన అందర్నీ షాక్‌కి గురి చేసింది.

1967లో ఏడాదిన్నర వయసులో భార్య అనే చిత్రంలో తొలిసారి తెరపై కనిపించిన తులసి.. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో 300కి పైగా సినిమాల్లో నటించారు. అయితే వీటిలో ఎక్కువ శాతం తెలుగు, కన్నడ సినిమాలే ఉండడం విశేషం. చిల్లరకొట్టు చిట్టెమ్మ, సీతామాలక్ష్మీ చిత్రాలు బాలనటిగా తులసికి ఎంతో పేరు తెచ్చాయి. ఆ తర్వాత చేసిన శంకరాభరణం చిత్రంతో బాలనటిగా అలరించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.

కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించినప్పటికీ ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. ఆ తర్వాత చెల్లెలు పాత్రలకే పరిమితమైపోయారు. తులసి హీరోయిన్‌గా నటించిన చివరి చిత్రం కన్నయ్య కిట్టయ్య. 1996లో కన్నడ డైరెక్టర్‌ శివమణిని వివాహం చేసుకొని కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. 2003లో ఎక్స్‌క్యూజ్‌మి అనే కన్నడ చిత్రం ద్వారా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సెకండ్‌ ఇన్నింగ్స్‌ను స్టార్ట్‌ చేశారు. అయితే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కన్నడలో 15 సినిమాలు చేసిన తర్వాత శశిరేఖా పరిణయం చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు.

అప్పటి నుంచి ఇప్పటివరకు సినిమాలు చేస్తూనే ఉన్న తులసి.. తాజాగా తను నటిగా రిటైర్‌ అవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్‌ 31వ తేదీతో తను నటన నుంచి తప్పుకుంటున్నట్టు సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. గత కొన్నేళ్లుగా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తున్న తులసి.. సాయిబాబా భక్తురాలు. ఇన్‌స్టాలో హ్యాపీ రిటైర్‌మెంట్‌ అని రాసి ఉన్న ఒక కార్డును పోస్ట్‌ చేస్తూ.. డిసెంబర్‌ 31న షిరిడీ వెళుతున్నానని, ఆరోజే తన రిటైర్‌మెంట్‌ ఉంటుందని ప్రకటించారు. రిటైర్‌ అయిన తర్వాత సాయిబాబాకు సేవ చేసుకుంటూ జీవిస్తానని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. సినిమాల నుంచి తప్పుకొని భక్తి మార్గం వైపు వెళుతున్న తులసిని ప్రేక్షకులు, అభిమానులు అభినందిస్తూ ఆమెకు దేవుని ఆశీస్సులు ఉండాలని కామెంట్స్‌ పెడుతున్నారు.