English | Telugu

ర‌ష్మిక‌తో 'ఆడాళ్లూ మీకు జోహార్లు' అంటున్న శ‌ర్వానంద్‌!

కంటెంట్‌కు అత్య‌ధిక ప్రాధాన్యం ఇచ్చే న‌టుడిగా పేరు తెచ్చుకున్న శ‌ర్వానంద్ ఒప్పుకున్న లేటెస్ట్ ఫిల్మ్ 'ఆడాళ్లూ మీకు జోహార్లు'. నేను.. శైల‌జ‌, చిత్ర‌ల‌హ‌రి లాంటి చిత్రాలు అందించిన డైరెక్ట‌ర్ కిశోర్ తిరుమ‌ల ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో శ‌ర్వా జోడీగా తొలిసారి సంచ‌ల‌న క‌థానాయిక ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోంది. ద‌స‌రా సంద‌ర్భంగా ఆదివారం ఈ సినిమా షూటింగ్ లాంఛ‌నంగా మొద‌లైంది. దీనికి శ‌ర్వా, ర‌ష్మిక ఇద్ద‌రూ హాజ‌ర‌య్యారు.

వారిపై చిత్రీక‌రించిన మ‌హూర్త‌పు షాట్‌కు ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్ కెమెరా స్విచ్చాన్ చేయ‌గా, మ‌రో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి క్లాప్ కొట్టారు. ఈ సినిమా స్క్రిప్ట్‌ను ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌, 14 రీల్స్ ప్ల‌స్ అధినేత‌లు రామ్ ఆచంట‌, గోపి ఆచంట అంద‌జేశారు. శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీకి సుజిత్ సారంగ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

గ‌తంలో 'ఆడాళ్లూ మీకు జోహార్లు' అనే టైటిల్‌తో కృష్ణంరాజు సినిమా వ‌చ్చింది. ఆస‌క్తిని రేకెత్తించే ఈ టైటిల్‌తో ఇప్పుడు శ‌ర్వానంద్ సినిమా చేస్తుండ‌టం, అందులో ర‌ష్మిక హీరోయిన్ కావ‌డంతో వారి ఫ్యాన్స్ ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.