English | Telugu

స్పెష‌ల్ స్టోరీ: గుణ‌శేఖ‌ర్.. హ‌ద్దులు లేని క్రియేటివ్ జీనియ‌స్‌!


తొలి చిత్రం 'లాఠీ' (1992)తోనే ప్ర‌తిభావంతుడైన ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న గుణ‌శేఖ‌ర్ ఈ 28 సంవ‌త్స‌రాల కాలంలో రూపొందించింది కేవ‌లం 12 చిత్రాలంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. తెలుగు సినిమాకి స్క్రీన్‌ప్లే ప‌రంగా, ట్రీట్‌మెంట్ ప‌రంగా ఉన్న‌త స్థాయిని క‌ల్పించిన ద‌ర్శ‌కుల్లో ఆయ‌నా ఒక‌రు. అయిన‌ప్ప‌టికీ చాలా త‌క్కువ సంఖ్య‌లో చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డానికి కార‌ణం.. ఆయ‌న‌లోని అంకిత‌భావం. తాను చేయ‌బోయే సినిమా తాలూకు స‌బ్జెక్టుకి సంబంధించి పూర్తి స్థాయిలో ప‌రిశీల‌న‌, ప‌రిశోధ‌న చేసుకున్న త‌ర్వాత‌నే సెల్యులాయిడ్ పైకి ఎక్కించేందుకు ఉప‌క్ర‌మించ‌డం ఆయ‌న అల‌వాటు. అందుక‌నే ఈ 12 చిత్రాల్లో 8 చిత్రాలు అవార్డులు తెచ్చాయి.

'లాఠీ'తో ఉత్త‌మ తొలి చిత్ర ద‌ర్శ‌కునిగా రాష్ట్ర ప్ర‌భుత్వ నంది అవార్డు సాధించిన ఆయ‌న‌, రెండో చిత్రం 'సొగ‌సు చూడ‌త‌ర‌మా' (1995)కు ఉత్త‌మ చిత్రం అవార్డును సాధించి పెట్టారు. ఆయ‌న మూడో సినిమా బాల‌న‌టుల‌తో రూపొందించిన 'రామాయ‌ణం' (1996). శ్రీ‌రాముని పాత్ర‌తో జూనియ‌ర్ ఎన్టీఆర్ చెల్డ్ ఆర్టిస్ట్‌గా ఈ సినిమాతో ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఈ సినిమాకు జాతీయ ఉత్త‌మ బాల‌ల చిత్రం పుర‌స్కారం ల‌భించ‌డం విశేషం. గుణ‌శేఖ‌ర్ నాలుగో సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేసిన 'చూడాల‌ని వుంది' (1998). దీనికి అవార్డులు రాలేదు కానీ, బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల రివార్డులు అమితంగా ద‌క్కాయి.

ఐదో సినిమా 'మ‌నోహ‌రం' (2000)కు ఉత్త‌మ చిత్రంగా నంది అవార్డుతో పాటు, ఉత్త‌మ క‌థార‌చ‌యిత‌గా పుర‌స్కారం అందుకున్నారు గుణ‌శేఖ‌ర్‌. ఇందులో జ‌గ‌ప‌తిబాబు, ల‌య జంట‌గా న‌టించారు. ఆరో సినిమా మాత్రం ఆయ‌న‌కు బాగా డిజ‌ప్పాయింట్‌మెంట్ క‌లిగించింది. అది చిరంజీవితో ఆయ‌న చేసిన 'మృగ‌రాజు' (2001). దీనికి అవార్డులు, రివార్డులు రెండూ ద‌క్క‌లేదు. ఆ లోటును ఆ త‌ర్వాతి సినిమాతో పూడ్చుకున్నారు గుణ‌శేఖ‌ర్‌. ఆ సినిమా.. మ‌హేశ్ క్రేజ్‌ను అనూహ్య స్థాయిలో పెంచేసిన 'ఒక్క‌డు' (2003). ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ ద‌ర్శ‌కుడి అవార్డుల‌ను సాధించింది ఈ సినిమా. అంతేకాదు, గుణ‌శేఖ‌ర్ ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా, మ‌హేశ్ ఉత్త‌మ న‌టుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుల‌ను సైతం అందుకున్నారు.

ఆ వెంట‌నే మ‌హేశ్‌తోటే త‌న ఎనిమిదో సినిమానీ చేశారు గుణ‌శేఖ‌ర్‌. అది 2004లో వ‌చ్చిన 'అర్జున్‌'. మ‌హేశ్‌కు నంది స్పెష‌ల్ జ్యూరీ అవార్డును అందించింది ఈ సినిమా. ఒకే హీరోతో వ‌రుస‌గా మూడు సినిమాలు డైరెక్ట్ చేసిన డైరెక్ట‌ర్ ఈమ‌ధ్య కాలంలో ఎవ‌రైనా ఉన్నారంటే.. అది గుణ‌శేఖ‌రే. 'ఒక్క‌డు', 'అర్జున్‌', త‌ర్వాత మ‌రోసారి మ‌హేశ్‌తోటే 'సైనికుడు' (2006) సినిమా రూపొందించారు గుణ‌శేఖ‌ర్‌. బెస్ట్ స్పెష‌ల్ ఎఫెక్ట్స్ నంది అవార్డును ఈ సినిమా అందుకుంది. కానీ బాక్సాఫీస్ ప‌రంగా డిజాస్ట‌ర్ అయ్యి, నిర్మాత అశ్వినీద‌త్‌కు తీవ్ర న‌ష్టాలు మిగిల్చింది.

ప‌దో సినిమాలో అల్లు అర్జున్‌ను 'వ‌రుడు' (2010)గా చూపించారు గుణ‌శేఖ‌ర్‌. దీనికి కూడా 'సైనికుడు' త‌ర‌హా రిజల్టే రావ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. నంది అవార్డుల్లో బెస్ట్ స్పెష‌ల్ ఎఫెక్ట్స్ పుర‌స్కారం, బాక్సాఫీస్ డిజాస్ట‌ర్‌! ప‌ద‌కొండో సినిమా కూడా ఆయ‌న‌కు తీవ్ర నిరాశ‌ను క‌లిగించింది. అది.. ర‌వితేజ‌తో తీసిన 'నిప్పు' (2012).

వ‌రుస‌గా మూడు సినిమాలు డిజాస్ట‌ర్ కావ‌డంతో గుణ‌శేఖ‌ర్ తీవ్ర విమ‌ర్శ‌ల పాల‌య్యారు. ఆయ‌న‌లోని సృజ‌నాత్మ‌క శ‌క్తి స‌న్న‌గిల్లిందంటూ విమ‌ర్శ‌కులు దాడి చేశారు. దీంతో పున‌రాలోచ‌న‌లో ప‌డిన గుణ‌శేఖ‌ర్‌.. ఈసారి చరిత్ర మీద దృష్టి సారించారు. కాక‌తీయ సామ్రాజ్యాన్ని అనిత‌ర‌సాధ్యంగా ఏలిన వీర‌వ‌నిత రాణి రుద్ర‌మ‌దేవి క‌థ ఆయ‌న‌ను బాగా ఆక‌ర్షించింది. 'రుద్ర‌మ‌దేవి' పేరుతో అనుష్క‌ను టైటిల్ రోల్‌లో చూపిస్తూ 2015లో ఆయ‌న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. అల్లు అర్జున్‌, రానా ద‌గ్గుబాటి కూడా న‌టించిన ఈ సినిమాలో ఆయ‌న‌లో మునుప‌టి వాడి, వేడి క‌నిపించాయ‌నే ప్ర‌శంస‌లు ల‌భించాయి.

దాని త‌ర్వాత గుణ‌శేఖ‌ర్ చూపు మ‌న ఇతిహాసాల మీద‌కు మ‌ళ్లింది. మొద‌ట 'హిర‌ణ్య‌క‌శ్య‌ప' క‌థ‌ను తీద్దామ‌నుకున్నారు. ఆ పాత్ర‌ను చేయ‌డానికి రానా, సినిమా నిర్మించ‌డానికి డి. సురేశ్‌బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. అయితే ప్ర‌స్తుతం రానా క‌మిట్‌మెంట్స్‌తో దానికి మ‌రికొంత స‌మ‌యం ప‌ట్టేట్లు క‌నిపిస్తుండ‌టంతో, ఈలోగా మ‌రో సినిమా తీద్దామ‌ని నిర్ణ‌యించుకున్నారు గుణ‌శేఖ‌ర్‌.

మ‌హాభార‌తం ఆదిప‌ర్వంలో వ‌చ్చే శ‌కుంత‌ల, దుష్యంతుల సుంద‌ర‌ప్రేమ‌గాథ ఆయ‌న‌ను ఆక‌ర్షించింది. ఆ క‌థ‌ను మ‌హాక‌వి కాళిదాసు 'అభిజ్ఞాన శాకుంత‌లం' పేరుతో నాట‌కంగా ర‌చించారు. దాని ఆధారంగా 'శాకుంత‌లం' చిత్రాన్ని రూపొందించ‌నున్న‌ట్లు ఇటీవ‌లే ప్ర‌క‌టించారు గుణ‌శేఖ‌ర్‌. తెలుగు తెర‌పై ఇప్ప‌టికే ఎన్టీఆర్‌, బి. స‌రోజాదేవి పోషించిన దుష్యంతుడు, శ‌కుంత‌ల పాత్ర‌ల‌కు ఆయ‌న ఎవ‌ర్ని ఎంచుకుంటార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఆ ప్రేమ‌క‌థ‌ను గుణ‌శేఖ‌ర్ త‌న‌దైన శైలిలో, త‌న సృజ‌నాత్మ‌క శ‌క్తితో ఎలా ఆవిష్క‌రిస్తారో చూడాల‌ని ప్రేక్ష‌కులు కుతూహ‌లంతో ఎదురు చూస్తున్నారు .

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.