English | Telugu

రాజమౌళి ఒక రాబిన్‌హుడ్‌.. వాళ్ళ దగ్గర దోచుకొని, వీళ్లకు పంచి పెడతాడు!

- రాజమౌళి ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాడు

- అందుకే హీరోలు రెమ్యునరేషన్లు పెంచేస్తున్నారు

- ఇండస్ట్రీలోఉన్న డబ్బు బయటికి వెళ్లదు

తెలుగు సినిమా మార్కెట్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత అనే విధంగా ఒక్కసారిగా టాలీవుడ్‌ను వరల్డ్‌ మార్కెట్‌కు దగ్గర చేశారు రాజమౌళి. తన ప్రతి సినిమాను వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించి దానికి తగ్గట్టుగానే మార్కెటింగ్‌ చేస్తూ నిర్మాతలను లాభాల బాటలో నడిపిస్తున్న రాజమౌళి గురించి, అతని స్ట్రాటజీ గురించి తన పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో వివరించే ప్రయత్నం చేశారు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ. ఉన్నవాళ్ళని దోచుకొని పేదవారికి డబ్బులు పంచేవాడిని రాబిన్‌హుడ్‌ అని చెప్తుంటాం. టాలీవుడ్‌లో అలాంటి రాబిన్‌హుడ్‌ రాజమౌళి అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు వర్మ.

‘డబ్బున్నవాడు రకరకాల వ్యాపారాల మీద పెట్టుబడి పెట్టి లాభాలు సంపాదించి ఇంకా ధనవంతుడు అవ్వాలనుకుంటాడు. తన ఆస్తులు ఇంకా ఇంకా పెరగాలని కోరుకుంటాడు. సినిమా రంగానికి వస్తే.. బాహుబలి వంటి భారీ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందించి తమకు పెద్ద సమస్యగా మారాడని కొందరు నిర్మాతలు నాతో అన్నారు. దానికి కారణం.. ప్రొడక్షన్‌ బడ్జెట్‌ పెరిగిపోయింది. ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు పెరిగిపోయాయి. తద్వారా సినిమా బడ్జెట్‌ భారీగా పెరిగిపోతోంది. రాజమౌళి చేసే సినిమాలను చూసి మిగతా హీరోలు కూడా రెమ్యునరేషన్లు పెంచేస్తున్నారు. తమ సినిమా కూడా భారీ బడ్జెట్‌తో చెయ్యాలని నిర్మాతల్ని అడుగుతున్నారు.

కొందరు నిర్మాతలు భారీ బడ్జెట్‌తో సినిమాలు చేసి చేతులు కాల్చుకుంటూ వుంటారు. వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు నిర్మించి నష్టపోతుంటారు. భారీ బడ్జెట్‌లో సినిమాలు చెయ్యడం ద్వారా రాజమౌళి ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాడు అని వాళ్లు చెప్తుంటారు. నిజానికి వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తీస్తే.. ఆ డబ్బు బయటికి ఎక్కడికీ వెళ్ళదు. ఇండస్ట్రీలోనే చేతులు మారుతుంది. రాజమౌళి వంటి డైరెక్టర్‌ భారీ బడ్జెట్‌తో సినిమా చేస్తే.. ఆ డబ్బును ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు పంచుతున్నారు. నిర్మాత ఎలా ఉన్నా.. వాళ్లు మాత్రం ఆర్థికంగా ఎదుగుతున్నారు. దీన్ని బట్టి రాజమౌళి తనకు తెలియకుండానే చారిటీ చేస్తున్నాడనేది నా ఒపీనియన్‌.

ఒక విధంగా నిర్మాతలు వాళ్లంతట వాళ్లే ఈ చారిటీ చేస్తున్నారు. మరో ఉదాహరణ చెప్పాలంటే.. బాలీవుడ్‌ నటుడు నానా పాటేకర్‌ నార్త్‌లో ఒక బాబాకి పరమభక్తుడు. ఒక సినిమాకి తన పారితోషికం 4 కోట్లు అనుకుంటే అందులో రెండు కోట్లు ఆ బాబాకి డొనేషన్‌ ఇవ్వమని చెప్తారు నానా పాటేకర్‌. అంటే తను ఇవ్వకుండా ఆ నిర్మాతతోనే ఆ డొనేషన్‌ ఇప్పిస్తాడు. దాని వల్ల మరికొంతమంది నిర్మాతలు అలాంటి చారిటీలు చేస్తారనేది అతని అభిప్రాయం’ అంటూ సినిమా ఇండస్ట్రీలోని డబ్బు ఎలా చేతులు మారుతుంది అనే విషయాన్ని వివరించారు రామ్‌గోపాల్‌వర్మ.