English | Telugu

'పార్కింగ్' మూవీ రివ్యూ

'పార్కింగ్' మూవీ రివ్యూ

మూవీ : పార్కింగ్
నటీనటులు: హరీష్ కళ్యాణ్, ఎమ్.ఎస్ భాస్కర్, ఇందుజ‌ రవిచంద్రన్, రమా రాజేంద్ర, ప్రార్థనా నాథన్, ఇలవరసు తదితరులు
సినిమాటోగ్రఫీ: జిజు సన్నీ
ఎడిటింగ్: పిలోమిన్ రాజ్
మ్యూజిక్: సామ్ సి.ఎస్
రచన, దర్శకత్వం: రామ్ కుమార్ బాలకృష్ణన్
నిర్మాతలు: సుదన్ సుందరం, కె.ఎస్ సినిష్
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్ స్టార్

ఇతర భాషల్లో విడుదలైన కొన్ని సినిమాలు ప్రస్తుతం ఓటీటీ వేదికపై మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంటున్నాయి. హర్రర్, కామెడీ జానర్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కనెక్ట్ చేసే సినిమాలు తక్కువగా వస్తున్నాయి. మరి అలాంటి ఫ్యామిలీ డ్రామాతో‌ సాగే 'పార్కింగ్' కథేంటో ఓసారి చూసేద్దాం...

కథ: 
ఈశ్వర్, ఆదిక అనే ఇద్దరు కొత్తగా పెళ్ళిచేసుకున్న జంట ఒక ఇంట్లో మేడ మీద అద్దెకి దిగుతారు. ఇక అదే ఇంట్లో కింద ఫ్లోర్ లో గత పది సంవత్సరాలుగా ఇల్లంపారుతి అద్దెకు ఉంటాడు. అయితే ఈశ్వర్, ఆదిక ఇద్దరు ప్రేమించి పెళ్ళి చేసుకుంటారు. ఆదిక గర్భవతిగా ఉంటుంది. ఇక తను హౌస్ లో ఉంటు వర్క్ చేస్తుంటుంది. ఈశ్వర్ ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. కొన్నిరోజులకి వారు ఒక కొత్త కార్ ని తీసుకుంటారు. ఆ కార్ ని పార్కింగ్ చేయడానికి ఆ అద్దె ఇంట్లో స్థలం తక్కువగా ఉంటుంది‌. మరోవైపు ఇల్లంపారుతికి అప్పటికే ఒక బైక్ ఉంటుంది. ఈశ్వర్ యొక్క కార్ పార్కింగ్ చేశాక ఇల్లంపారుతి బైక్ పార్కింగ్ చేయడానికి కొంచెం స్థలం మాత్రమే ఉంటుంది. ఇక ప్రతీరోజు ఆ బైక్ ని రాత్రి పార్కింగ్ చేయడం, పొద్దున్నే బయటకు తీయడం ఇల్లంపారుతికి ఇబ్బందిగా ఉంటుంది. ‌రెండురోజులకి ఈశ్వర్ కార్ కి అనుకోకుండా ఇల్లంపారుతి బైక్ వల్ల ఒక చిన్న స్క్రాచ్ పడుతుంది. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అది కాస్త పెద్దదిగా మారుతుంది. ఇలా రోజురోజుకి వీరిమధ్య పార్కింగ్ విషయంలో గొడవలు పెరుగుతూ ఉంటాయి. మరి గొడవలు ఎక్కడిదాకా వెళ్ళాయి.. ఇద్దరి మధ్య పార్కింగ్ కోసం తలెత్తిన గొడవలేంటో తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ:
సిటీలో పార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదీ అపార్ట్మెంట్, కాలనీలలో చాలా కష్టం. అందులోను ఒక కుటుంబానికి కార్ ఉంటే అదీ మరీ కష్టం. ‌ఈ  పార్కింగ్ సమస్యని తీసుకొని 'పార్కింగ్' అనే సినిమాని తీసిన రామ్ కుమార్ బాలకృష్ణన్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. 

ఈశ్వర్, ఇల్లంపారుతి మధ్యలో సాగే ప్రతీ సీన్ ప్రేక్షకుడిని ఆలోచింపజేసేదిలా ఉంటుంది. గర్భణీ భార్య ఉన్నప్పుడు భర్త ఎదుర్కొన్న సమస్య, ఇద్దరి మధ్య సాగే ఎమోషనల్ బాండింగ్ అంతా చక్కగా తీర్చిదిద్దాడు డైరెక్టర్.  ఇల్లంపారుతి ఒక గవర్నమెంట్ ఉద్యోగి అయి ఉండి అతని సహజమైన గుణాన్ని చాలా చక్కగా చూపించాడు డైరెక్టర్. ఒక ఉన్నత స్థానంలో ఉన్న అధికారికి ఇగో ఏ రేంజ్ లో ఉంటుందో చూపించారు మేకర్స్. కథని ఇద్దరి మధ్య ఇగో క్లాష్ లా చూపించాడు. 

ప్రథమార్ధంలో సాగే పాటలు కాస్త కథని నెమ్మది చేసిందనిపిస్తుంది. మొదటి నలభై నిమిషాలు క్యారెక్టర్లని పరిచయం చేయడానికే సరిపోయింది. అసభ్య పదజాలం ఎక్కడా వాడలేదు. కుటుంబంతో కలిసి చూసేలా దర్శకుడు రామ్ కుమార్ బాలకృష్ణన్ ప్రయత్నించిన తీరు బాగుంది.  అసభ్యకరమైన సీన్లు‌ లేకుండా జాగ్రత్తపడ్డ డైరెక్టర్, నిడివి విషయంలో కాస్త చొరవ తీసుకుంటే బాగుండేది. గంటన్నర నిడివి ఈ కథకి సరిపోయేది. పాటలు, ప్రథమార్ధంలో సాగే స్లో సీన్లు మినహా కథనం సాగిన తీరు‌బాగుంది. 

ఒక భారీ విధ్వంసం తర్వాత ‌కలిగే ప్రశాంతతిని సినిమా క్లైమాక్స్ లో‌ చూపించిన తీరు బాగుంది. ఎండింగ్ లో డైలాగ్స్ కట్టిపడేస్తాయి. జిజు సన్నీ సినిమాటోగ్రఫీ బాగుంది. సామ్ సి.ఎస్ మ్యూజిక్ సింపుల్ గా ఉంది. రామ్ కుమార్ రాసుకున్న కథని అలాగే ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. పిలోమిన్ రాజ్ ఎడిటింగ్ లో కాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:
ఈశ్వర్ గా హరీష్ కళ్యాణ్ ఆకట్టున్నాడు. ఇల్లంపారుతిగా ఎమ్.ఎస్ భాస్కర్, ఆదికగా ఇందుజ, పారుతిగా రమా రాజేంద్ర ఆకట్టుకున్నారు. ఇక మిగతా పాత్రలు తమ పరిధి మేర నటించి మెప్పించారు.

తెలుగు వన్ పర్ స్పెక్టివ్:
ఈ మధ్యకాలంలో వచ్చిన వాటిల్లో కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమాల జాబితాలో  ఈ పార్కింగ్ కి చోటు దక్కినట్టే. ఈ వీకెండ్ లో ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా ఇది. 

రేటింగ్: 3/5 

✍️. దాసరి మల్లేశ్