English | Telugu

ప్రపంచ సినీ చరిత్రలోనే అతి పెద్ద డీల్‌.. నెట్‌ఫ్లిక్స్‌కే సాధ్యమైంది!

- డివిడి రెంట‌ల్ స‌ర్వీస్‌తో ప్రారంభ‌మైన నెట్‌ఫ్లిక్స్‌
- 83 బిలియ‌న్ డాల‌ర్ల‌కు డీల్‌
- చిత్ర నిర్మాణంలోకి నెట్‌ఫ్లిక్స్‌

1997 ప్రాంతంలో డివిడి రెంటల్‌ సర్వీస్‌గా ప్రారంభమైన నెట్‌ఫ్లిక్స్‌.. క్రమంగా తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చింది. ఎంటర్‌టైనమెంట్‌ రంగంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా తమ సంస్థ కార్యకలాపాలను మెరుగు పరుచుకుంది. డివిడి రెంటల్‌ సర్వీస్‌ నుంచి ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌లోకి అడుగుపెట్టి ప్రస్తుతం నెంబర్‌ వన్‌ స్థానంలో కొనసాగుతోంది.


థియేటర్లలో రిలీజ్‌ అయిన సినిమాలను స్ట్రీమ్‌ చెయ్యడమే కాకుండా ఒరిజినల్‌ కంటెంట్‌ నిర్మాణం కూడా చేపట్టి ఓటిటి రంగంలో పెను మార్పులు తీసుకొచ్చింది నెట్‌ఫ్లిక్స్‌. సరికొత్త వెబ్‌సిరీస్‌లతో ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటూ చందాదారులను కూడా బాగా పెంచుకుంది. ఇప్పుడు ప్రపంచ సినిమాపై దృష్టి పెట్టింది నెట్‌ఫ్లిక్స్‌. ఒక భారీ డీల్‌తో చరిత్ర సృష్టించింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో అతి పెద్ద డీల్‌ చేసింది నెట్‌ఫ్లిక్స్‌.


ప్రపంచ సినీ చరిత్రలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన వార్నర్‌ బ్రదర్స్‌ సంస్థను సొంతం చేసుకుంది. 83 బిలియన్‌ డాలర్లకు ఫిలిం అండ్‌ టెలివిజన్‌ స్టూడియో వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీని కొనుగోలు చేసింది నెట్‌ఫ్లిక్స్‌. ఈ దశాబ్దంలోనే ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో జరిగిన అతి పెద్ద డీల్‌గా దీన్ని పేర్కొంటున్నారు.


వార్నర్‌ బ్రదర్స్‌ ప్రొడక్షన్‌ హౌస్‌, ఫిలిం స్టూడియోలు, టెలివిజన్‌ స్టూడియోలతోపాటు HBO MAX, HBOలను కూడా కొనుగోలు చేసింది నెట్‌ఫ్లిక్స్‌. ఈ విషయాన్ని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఓటీటీ రంగంలో అగ్రగామి సంస్థగా కొనసాగుతున్న నెట్‌ఫ్లిక్స్‌.. ఇప్పుడు వార్నర్‌ బ్రదర్స్‌ను కొనుగోలు చేసి చిత్ర నిర్మాణంలోకి కూడా అడుగుపెడుతోంది.