English | Telugu
సినిమాని తొక్కాలని చూసే ఇలాంటి వారిని ఉరి తియ్యాలి!
Updated : Oct 21, 2025
ఒకప్పుడు సినిమా వాళ్లకి, మీడియాకి మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేది. తాము నిర్మించిన సినిమా రిలీజ్ అయిన తర్వాత మీడియాలో వచ్చే రివ్యూలపై దర్శకనిర్మాతలుగానీ, హీరోలుగానీ సానుకూలంగా స్పందించేవారు. సినిమా వారికి, మీడియాకి మధ్య ఎలాంటి వాతావరణం ఉండేదో చెప్పడానికి 60 ఏళ్ళ క్రితం జరిగిన ఒక సంఘటనను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక ప్రముఖ నిర్మాత తీసిన సినిమా బాగా లేదని ఒక పత్రికలో ప్రింట్ చేశారు. ‘మా సినిమా బాగానే ఉందని అందరూ అంటున్నారు. మీరు అలా రాశారేమిటి?’ అని ఆ పబ్లిషర్‌ని ప్రశ్నించారు నిర్మాత. దానికా పబ్లిషర్ సమాధానమిస్తూ ‘అది మా రివ్యూ రైటర్ అభిప్రాయం మాత్రమే. రివ్యూ ఎలా ఉంటే బాగుంటుంది అని మీరనుకుంటున్నారో అలా మీరే రాసి మాకు పంపండి. మేం ప్రింట్ చేస్తాం’ అని ఎంతో మర్యాదగా చెప్పారు. అప్పుడా నిర్మాత ఓ రివ్యూ రాయించి ఆ పత్రికకు పంపారు. ఆ రివ్యూని కూడా అచ్చు వేశారా పబ్లిషర్. అలా ఒకే పత్రికలో ఒక నెగెటివ్ రివ్యూ, ఒక పాజిటివ్ రివ్యూ ప్రింట్ అయ్యాయి.
ఆరోజుల్లో సినిమా వాళ్ళకి, మీడియాకి మధ్య అంత మంచి రిలేషన్ ఉండేది. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. తమ సినిమా గురించి ఎవరైనా చెడుగా రాస్తే.. వారి మీద అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు దర్శకనిర్మాతలు. బాహాటంగానే విమర్శలకు దిగుతున్నారు. పరుష పదజాలంతో మీడియాలోని అందర్నీ దూషిస్తున్నారు. ఇటీవలికాలంలో ఇలాంటివి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలా హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఇలా మీడియా మీద విరుచుకుపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా ‘కెర్యాంప్’ చిత్రానికి సంబంధించి అలాంటి వ్యాఖ్యలే చేశారు నిర్మాత రాజేష్ దండా.
కిరణ్ అబ్బవరం హీరోగా జైన్స్ నాని దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మించిన ‘కె ర్యాంప్’ రిలీజ్ అయింది. మూడురోజుల్లో 17 కోట్లు కలెక్ట్ చేసి సినిమా బ్రేక్ ఈవెన్ అయిందని యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకి సంబంధించి జరిగిన సక్సెస్‌మీట్‌లో నిర్మాత రాజేష్ దండా ఒక న్యూస్ పోర్టల్ మీద విరుచుకుపడ్డారు. తమ సినిమా గురించి కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పరుష పదజాలంతో ఆ న్యూస్ పోర్టల్ యాజమాన్యాన్ని దూషించారు. బ్లాక్‌బస్టర్ హిట్ అయినప్పటికీ సినిమాని తొక్కాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి వారిని ఊరికే వదలకూడదని, ఉరి తియ్యాలని ఆవేశంగా మాట్లాడారు.