English | Telugu

త‌మిళ‌నాట స‌రికొత్త రికార్డును సృష్టించిన 'విక్ర‌మ్‌'

క‌మ‌ల్ హాస‌న్ ఫిల్మ్ 'విక్ర‌మ్' త‌మిళ‌నాడులో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన త‌మిళ చిత్రంగా స‌రికొత్త రికార్డును సాధించింది. లోకేశ్ క‌న‌గ‌రాజ్ డైరెక్ట్ చేసిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌, అజిత్ 'విశ్వాస‌మ్' క‌లెక్ష‌న్ల‌ను దాటేసి, ఇంకా మంచి వ‌సూళ్ల‌ను సాధిస్తూ, దూసుకుపోతోంది. త‌మిళ‌నాడులో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన 'బాహుబ‌లి 2' రికార్డుపై క‌న్నేసింది. ఈ వారాంతానికి ఆ రికార్డు కూడా 'విక్ర‌మ్' ఖాతాలో చేరుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 400 కోట్ల మార్కును అందుకోనున్న‌ది.

రాజ్ క‌మ‌ల్ ఫిలిమ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ నిర్మించిన 'విక్ర‌మ్' జూన్ 3న ప‌లు భాష‌ల్లో విడుద‌లైంది. క‌మ‌ల్ హాస‌న్‌, విజ‌య్ సేతుప‌తి, ఫ‌హ‌ద్ ఫాజిల్ ఈ మూవీలో ప్ర‌ధాన పాత్ర‌ధారులు. విశ్లేష‌కుడు ర‌మేశ్ బాల ప్ర‌కారం, త‌మిళ‌నాడులో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన త‌మిళ చిత్రంగా 'విక్ర‌మ్' రికార్డుల‌కెక్కింది. ఆ రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కూ అజిత్ సినిమా 'విశ్వాస‌మ్' సాధించిన బాక్సాఫీస్ క‌లెక్ష‌న్ల రికార్డును 'విక్ర‌మ్' అధిగ‌మించింది.

ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన 'విక్ర‌మ్‌'లో రోలెక్స్ అనే అతిథి పాత్ర‌లో మెరిసి ఆక‌ట్టుకున్నాడు సూర్య‌. గాయ‌త్రి, వాసంతి, కాళిదాస్ జ‌య‌రామ్‌, న‌రైన్‌, సంతాన భార‌తి ఇత‌ర పాత్ర‌ల్లో క‌నిపించారు. అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్, గిరీశ్ గంగాధ‌ర‌న్ సినిమాటోగ్ర‌ఫీ అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌లుగా నిలిచాయి.