English | Telugu

దేశంలోనే మోస్ట్ పాపుల‌ర్ యాక్ట్రెస్‌.. సామ్‌!

స‌మంత అభిన‌య సామ‌ర్థ్యం ఎలాంటిదో, త‌న కెరీర్‌లో ఆమె చేసిన పాత్ర‌లే చెప్తాయి. న‌టిగా ఆమె రేంజే వేరు. ఒక‌వైపు గ్లామ‌ర‌స్ రోల్స్‌, ఇంకోవైపు ప‌ర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేస్తూ మాస్‌, క్లాస్ ఆడియెన్స్ అంద‌రికీ ఆరాధ్య తార‌గా మారింది. ఇప్పుడు, స్థాయికి త‌గ్గ కీర్తి ఆమెకు ద‌క్కింది. దేశంలోనే మోస్ట్‌ పాపుల‌ర్ ఫిమేల్ స్టార్‌గా నిలిచింది స‌మంత‌. ఇటీవ‌ల ఇండియాలో నిర్వ‌హించిన ఓ ప‌రిశోధ‌న‌లో దేశ‌వ్యాప్తంగా పేరుగాంచిన అనేక‌మంది తార‌ల‌ను అధిగ‌మించి స‌మంత అగ్ర‌స్థానాన్ని అధిరోహించింది. ఆలియా భ‌ట్‌, న‌య‌న‌తార‌, దీపికా ప‌డుకోనే లాంటి వాళ్లను కూడా ఆమె వెనక్కి నెట్టేసింది.

క‌రోనా మ‌హ‌మ్మారి త‌ర్వాత ప్రేక్ష‌కుల అభిరుచుల్లో వ‌చ్చిన మార్పును ఈ రీసెర్చి తెలియ‌జేసింది. ఇది భార‌త‌దేశ‌పు స‌రికొత్త వాస్త‌విక దృశ్యం. మే నెల మాసానికి ఆర్‌మాక్స్ మీడియా నిర్వ‌హించిన ఈ స‌ర్వేలో స‌మంత‌, ఆలియా, న‌య‌న‌తార‌, దీపికా ప‌డుకోనే, కాజ‌ల్ అగ‌ర్వాల్ మొద‌టి ఐదు స్థానాల్లో నిల‌వ‌గా, కీర్తి సురేశ్‌, క‌త్రినా కైఫ్‌, ర‌ష్మికా మంద‌న్న‌, పూజా హెగ్డే, అనుష్క శెట్టి త‌ర్వాత ఐదు స్థానాలు పొందారు. త‌న అందం, విల‌క్ష‌ణ‌త‌, ప్ర‌తిభ‌తో మొత్తం ప్రేక్ష‌కుల్ని మంత్ర‌ముగ్ధుల్ని చేస్తూ ఇండియాలోని టాప్ యాక్ట్రెస్‌ల‌లో ఒక‌రిగా గుర్తింపు తెచ్చుకుంది స‌మంత‌. ఇటీవ‌లి కాలంలో 'ద ఫ్యామిలీ మ్యాన్ 2'లో చేసిన రాజీ అనే నెగ‌టివ్ రోల్‌, 'పుష్ప‌'లో చేసిన ఐట‌మ్ నంబ‌ర్ "ఊ అంటావా మావ ఉఊ అంటావా మావ" ఆమెకు విప‌రీత‌మైన ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టాయి.

స‌మంత న‌టిగానే కాకుండా, ఒక సామాజిక సేవిక‌గా, వ్యాపార‌వేత్త‌గా, సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స‌ర్‌గా కూడా పేరు తెచ్చుకుంది. మెస్మ‌రైజింగ్ లుక్స్‌, యాక్టింగ్ స్కిల్స్ ఆమెకు దేశ‌వ్యాప్తంగా వీరాభిమానుల‌ను సంపాదించి పెట్టాయి. 'ఏ మాయ చేశావే' మూవీలో చేసిన జెస్సీ నుంచి 'ద ఫ్యామిలీ మ్యాన్ 2'లో చేసిన రాజీ దాకా ఆమె చేసిన ప్ర‌యాణం ఏ న‌టికైనా స్ఫూర్తిదాయ‌క‌మే. త్వ‌ర‌లో ఆమె న‌టించిన తెలుగు సినిమాలు 'య‌శోద‌', 'శాకుంత‌లం' విడుద‌ల‌కు రెడీ అవుతున్నాయి.