English | Telugu

ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్న పాపుల‌ర్ యాక్ట‌ర్‌

పేరుపొందిన ఒడియా న‌టుడు, జాత్ర క‌ళాకారుడు రాయ్‌మోహ‌న్ ప‌రిడా క‌న్నుమూశారు. భువ‌నేశ్వ‌ర్‌లోని ప్రాచి విహార్‌లో ఉన్న త‌న నివాసంలో ఉరివేసుకొని ఉన్న ఆయ‌న‌ను క‌నుగొన్నారు. రాయ్‌మోహ‌న్ వ‌య‌సు 58 సంవ‌త్స‌రాలు. ఆయ‌నది ఆత్మ‌హ‌త్య‌గా భావిస్తున్నారు. అయితే, ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం ద్వారా త‌న జీవితాన్ని ఆయ‌న ఎందుకు ముగించాల‌నుకున్నారో.. ఇంత‌వ‌ర‌కూ వెల్ల‌డి కాలేదు. ఆయ‌నకు భార్య‌, ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు పెళ్ల‌యి అత్త‌వారింటికి వెళ్ల‌గా, భార్య‌, చిన్న కుమార్తెతో క‌లిసి ఉంటున్నారు రాయ్‌మోహ‌న్‌.

ఆయ‌న ఉరివేసుకొన్నార‌నే విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌డంతో, మంచేశ్వ‌ర్ పోలీసులు హుటాహుటిన ఆయ‌న ఇంటికి వెళ్లి పార్థివ శ‌రీరాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌-మార్టెమ్ నిమిత్తం ఆయ‌న బాడీని క్యాపిట‌ల్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. రాయ్‌మోహ‌న్ ఆక‌స్మిక మృతి వార్త మొత్తం ఒడియా ఫిల్మ్ ఇండ‌స్ట్రీని దిగ్భ్రాంతికి లోను చేసింది. వార్త తెలిసిన వెంట‌నే వంద‌లాది మంది న‌టులు, అభిమానులు ఆయ‌న ఇంటికి త‌ర‌లివెళ్లారు.

రాయ్‌మోహ‌న్‌తో ప‌లు సినిమాల్లో క‌లిసి న‌టించిన సిద్ధాంత్ మ‌హాపాత్ర జీవితంలో ప‌లు ఆటుపోట్ల‌ను ఎదుర్కొన్నప్ప‌టికీ స‌క్సెస్‌ఫుల్ యాక్ట‌ర్‌గా నిల‌దొక్కుకున్న ఆయ‌న ఇలాంటి ప‌ని చేయ‌డం ఊహించ‌డానికే చాలా క‌ష్టంగా ఉంది. ఈమ‌ధ్య మేం మాట్లాడుకున్న‌ప్పుడు ఆయ‌న‌లో ఏమాత్రం డిప్రెష‌న్ ఛాయ‌లు క‌నిపించ‌లేదు. ఇలాంటి ప‌నికి ఆయ‌న‌ను ఏది పురికొల్పింద‌నేది అనూహ్యంగా ఉంది అని అన్నారు.

ఎక్కువ‌గా విల‌న్ పాత్ర‌ల‌తో పాపుల‌ర్ అయిన రాయ్‌మోహ‌న్ ప‌రిడా 1963 జూలై 10న జ‌న్మించారు. వంద‌కు పైగా సినిమాల్లో న‌టించారు. వాటిలో కొన్ని బెంగాలీ సినిమాలు కూడా ఉన్నాయి. 'సింగ బాహిణి' (1998), 'సున భౌజా' (1994), 'మెంట‌ల్' (2014) సినిమాల్లో ఆయ‌న అభినయాన్ని ప్రేక్ష‌కులు మ‌ర‌చిపోలేరు.