English | Telugu

ఇప్పుడొస్తున్న పాటల్లో సంగీతం ఉందా?.. మ్యూజిక్‌ డైరెక్టర్లపై ఇళయరాజా సెటైర్‌!

- అది దేవుడిచ్చిన వరం
- 12, 15 టేకులు చేసిన సందర్భాలు ఉన్నాయి
- ఇప్పటి మ్యూజిక్‌ డైరెక్టర్లు అలా లేరు

సంగీత ప్రపంచంలో రారాజు ఇళయరాజా. కొన్ని దశాబ్దాలుగా తన శ్రావ్యమైన సంగీతంతో సంగీత ప్రియులను మెస్మరైజ్‌ చేస్తున్న ఇళయరాజా.. గత కొన్ని సంవత్సరాలుగా సెలెక్టివ్‌గానే సినిమాలు చేస్తున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కాన్సర్ట్స్‌ చేస్తూ తన సంగీతంతో అభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల విజయవాడలో జరిగిన ఒక కాన్సర్ట్‌ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఇళయరాజా. ఈ సమావేశంలో సినిమా సంగీతం గురించి, ఇప్పుడు వస్తున్న పాటల గురించి, మ్యూజిక్‌ డైరెక్టర్ల గురించి పలు విధాలుగా విమర్శలు గుప్పించారు.

‘నేను ఎన్నో సంవత్సరాలుగా నా సంగీతంతో ప్రేక్షకులకు ఆనందాన్ని అందిస్తున్నానంటే.. అది దేవుడు నాకిచ్చిన వరంగానే భావిస్తాను. నా తర్వాత వచ్చిన చాలా మంది మ్యూజిక్‌ డైరెక్టర్లు ఇళయరాజా అంతటి సంగీత దర్శకుడ్ని అయిపోవాలనే వచ్చారు. అలా అనుకోవడం ఎంతో సహజం. అయితే అనుకున్నంత మాత్రాన అయిపోరు. అది దేవుడిచ్చిన వరం.

నేను చేసిన ఎన్నో పాటల్ని ఇప్పటికీ వింటున్నారంటే దానికి ప్రధాన కారణం.. ఆ పాటల్ని ఎంతో శ్రద్ధగా, భక్తిగా చేయడమే. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. అన్ని రకాల సదుపాయాలు వచ్చాయి. దాంతో శ్రావ్యమైన, సహజమైన సంగీతాన్ని అందించలేకపోతున్నారు సంగీత దర్శకులు. నేను, నాతోటి సంగీత దర్శకులు ఆరోజుల్లో చేసిన పాటలు ఇప్పటికీ జీవంతో ఉన్నాయంటే.. వాటిని లైవ్‌ ఆర్కెస్ట్రాతో చెయ్యడమే కారణం. ఇప్పుడు ఒక కీబోర్డ్‌లోనే అన్ని సంగీత వాయిద్యాలను పలికించేస్తున్నారు. దానివల్ల ఒరిజినల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ ఎఫెక్ట్‌ రావడం లేదు.

ఇక పాటల రికార్డింగ్‌ విషయానికి వస్తే.. నా పాటలన్నీ లైవ్‌ ఆర్కెస్ట్రాలోనే చేసే వాళ్ళం. రికార్డింగ్‌ జరిగేటపుడు 80 మంది మ్యూజిషియన్స్‌ ఉండేవారు. పాట పాడే మేల్‌, ఫిమేల్‌ సింగర్స్‌ కూడా అక్కడే ఉండేవారు. పాట రికార్డింగ్‌ జరుగుతున్నప్పుడు చిన్న పొరపాటు జరిగినా రీ టేక్‌ చేసేవాళ్లం. అలా 12, 15 టేకులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటి పరిస్థితి అలా లేదు. పాట ఎవరు రాశారో తెలీదు, ఆ పాట ఏ సిట్యుయేషన్‌లో వస్తుందో తెలీదు, ఎవరికి పాడుతున్నారో తెలీదు.

ముందుగానే పాటకు సంబంధించిన ప్రోగ్రామ్‌ అంతా జరిగిపోయి ఉంటుంది. మేల్‌, ఫిమేల్‌ ఒకేసారి పాడే సందర్భాలు కూడా ఇప్పుడు చాలా తక్కువ. ఎవరికి వీలున్నప్పుడు వాళ్లు పాడి వెళ్లిపోతున్నారు. ఈ స్పీడ్‌ ప్రపంచంలో అన్నీ త్వరగా అయిపోవాలని కోరుకుంటారు. మ్యూజిక్‌ డైరెక్టర్లు కూడా అంతే. అందుకే ఇప్పుడు వస్తున్న పాటల్లో సంగీతం అనేది కనిపించకుండా పోతోంది. లైవ్‌ ఆర్కెస్ట్రాలో, సింగర్స్‌ ఇద్దరూ అక్కడ ఉండి పాడిన పాటను జనం ఎక్కువ కాలం వింటారు, ఆనందిస్తారు’ అంటూ ప్రస్తుతం వస్తున్న పాటలపై తన ఆవేదనను వ్యక్తం చేశారు ఇళయరాజా.