English | Telugu

వెలవెలబోతున్న వెండితెర వేల్పులు.. అయోమయంలో దర్శకనిర్మాతలు!

సినిమా అనేది ఒక కళ. ప్రజలకు వినోదాన్ని అందించే పలు మాధ్యమాల నుంచి రూపాంతరం చెంది సినిమాగా అవతరించింది. పాతతరం హీరోలు, దర్శకనిర్మాతలు, ఇతర సాంకేతిక నిపుణులు సినిమాను ఒక అసాధారణమైన కళగా ఆరాధించారు. ఒక తపస్సులా సినిమాలను చేశారు. దానికి తగ్గట్టుగానే మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూ వచ్చారు. తాము చదివిన కథల్లో ఊహించుకున్న పురాణ పురుషుల్ని వెండితెరపై చూసి మైమరచిపోయారు. రాముడు, కృష్ణుడు ఇలాగే ఉంటారేమో అన్నంతగా ఆరాధించేవారు. ఆరోజుల్లో సినిమా తారలకు, ప్రేక్షకులకు మధ్య ఒక అవినాభావ సంబంధం ఉండేది. అగ్రతారలుగా వెలుగొందుతున్న నటీనటులు కూడా ప్రేక్షకుల్ని ఎంతో ఆదరించేవారు.

పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం కారణంగా సినిమా కూడా రూపాంతరం చెందుతూ వచ్చింది. దర్శకనిర్మాతలు పేక్షకుల్ని అబ్బుర పరిచే సినిమాలు నిర్మిస్తున్నారు. అయితే సినిమా పట్ల అప్పుడు ఉన్న ఆరాధనా భావం ఇప్పుడున్న హీరోలు, దర్శకనిర్మాతల్లో లేదనే చెప్పాలి. కేవలం వ్యాపార ధోరణితోనే సినిమాలు రూపొందిస్తున్నారు తప్ప ప్రజల్లో చైతన్యాన్ని నింపే సినిమాలు, మధురానుభూతిని కలిగించే సినిమాలు మాత్రం వారి నుంచి రావడం లేదు. సినిమాకి మనం ఎంత డబ్బు పెట్టాం, దాన్ని తిరిగి ఎలా రాబట్టుకోవాలి అనే ధోరణి మాత్రమే వారిలో కనిపిస్తోంది. దాని కోసం ఎన్నిరకాలుగా ప్రేక్షకుల్ని మభ్యపెడుతున్నారో మనం చూస్తున్నాం.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో అందరికీ తెలిసిందే. ఐబొమ్మ, బప్పంటివి పేర్లతో వెబ్‌సైట్లను ప్రారంభించి రిలీజ్‌ అయిన కొత్త సినిమాలను ప్రేక్షకులకు ఉచితంగా చూపించేందుకు ఇమ్మడి రవి అనే వ్యక్తి కంకణం కట్టుకున్నాడు. గత కొన్నేళ్లుగా ఎవరికీ చిక్కకుండా పైరసీ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి కటకటాల్లో ఉన్నాడు. రవి చేసింది నేరమే అయినా అతనికి ప్రజల నుంచి సానుభూతి లభిస్తోంది. తమకు ఉచితంగా సినిమాలు చూపిస్తున్న రవి ప్రేక్షకుల దృష్టిలో హీరో అయిపోయాడు. అతనికి ఎంతలా మద్దతు లభిస్తోందంటే.. దాదాపు 90 శాతం ప్రజలు అతను చేసింది కరెక్ట్‌ అనే స్థాయిలో ఉంది.

సినిమాలకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు? అని ప్రశ్నిస్తే.. అందరూ చిత్ర పరిశ్రమ వైపే వేళ్లు చూపిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా అనేది సామాన్య ప్రేక్షకుడికి అందుబాటులో లేని వినోదంగా పరిణమించింది. కుటుంబ సమేతంగా థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలంటే భారీ ఖర్చుతో కూడుకున్నదనే భావన అందరిలోనూ వచ్చేసింది. దానికి కారణం.. సింగిల్‌ స్క్రీన్స్‌ అంతరించిపోయి, వాటి స్థానంలో మల్టీప్లెక్సులు పుట్టుకు రావడమే. అంతేకాదు, టికెట్‌ రేట్లు భారీగా పెరిగిపోవడం, స్టార్‌ హీరోల సినిమాలకు టికెట్‌ రేట్ల పెంపులో ప్రభుత్వాలు మరింత వెసులుబాటు కల్పించడం వంటివి ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లకుండా చేస్తున్నాయి.

ఐ బొమ్మ రవి అరెస్ట్‌ తర్వాత ప్రేక్షకుల్లో ఈ తరహా నిరసన మరింత పెరిగింది. నేరం చేసిన వాడిని పక్కన పెట్టి, చిత్ర పరిశ్రమలోని హీరోలు, దర్శకనిర్మాతలను టార్గెట్‌ చేస్తున్నారు. రవి చేసిన నేరం కంటే హీరోలు, దర్శకనిర్మాతలు చేస్తున్న దారుణాలే ఎక్కువ అని అభిప్రాయపడుతున్నారు. హీరోలకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్లు ఇచ్చేందుకు నిర్మాతలు వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు నిర్మించడం, వాటిని ప్రేక్షకుల నుంచి దోచుకోవడం అనే కాన్సెప్ట్‌ పట్ల ప్రేక్షకులకు ఒక అవగాహన వచ్చింది. అంతేకాదు, మల్టీప్లెక్సుల కల్చర్‌ బాగా పెరగడం, థియేటర్‌లో స్నాక్స్‌ పేరుతో దోచుకోవడం వంటివి ప్రేక్షకుల ఆగ్రహానికి కారణం అవుతున్నాయి. దీంతో సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సినీ ప్రముఖులపై వ్యతిరేకత విపరీతంగా పెరుగుతోంది. వందల కోట్లతో సినిమాలు నిర్మించమని ఎవరు అడిగారు అనే ప్రశ్న ప్రేక్షకుల నుంచి వస్తోంది.

ఒకప్పుడు సంవత్సరానికి పదికి తక్కువ కాకుండా సినిమాలు చేసేవారు హీరోలు. దానివల్ల చిత్ర పరిశ్రమ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండేది. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. స్టార్‌ హీరోల సినిమాలు రెండు సంవత్సరాలకు ఒక్కటి రావడమే గగనంగా మారిపోయింది. దాన్ని కూడా వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మించి, దాన్ని రాబట్టుకోవడం కోసం టికెట్‌ రేట్లు పెంచాలంటూ ప్రభుత్వాలను ప్రాధేయ పడడం నిర్మాతలకు అలవాటుగా మారిపోయింది. అభిమానులే మా దైవాలు అంటూ చెప్పుకునే స్టార్‌ హీరోలు.. తమ సినిమాకి మొదటి వారం అసాధారణ స్థాయిలో టికెట్‌ రేట్లు పెంచి ఆ అభిమానుల నుంచే ముక్కు పిండి డబ్బు వసూలు చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయమని అభిమానులే చెబుతున్నారు. ఈ విషయంలో ప్రేక్షకులకు ఒక క్లారిటీ వచ్చింది. అందుకే చిత్ర పరిశ్రమ పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు.

దీంతో వెండితెర వేల్పులు వెలవెలబోతున్నారు. ఇక దర్శకనిర్మాతలు అయోమయంలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో టికెట్‌ రేట్లు మరోసారి పెంచితే ప్రేక్షకుల నుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తుందోనని టెన్షన్‌ పడుతున్నారు. సినీ ప్రముఖులపై రోజురోజుకీ ప్రేక్షకుల ఆగ్రహం పెరిగిపోతోందన్నది వాస్తవం. దాన్ని తగ్గించాలంటే మొదట టికెట్‌ రేట్ల తగ్గించాలి. వారికి అందుబాటులో ఉన్న ధరల్లోనే సినిమాను చూపించాలి. అలాగే థియేటర్స్‌లో స్నాక్స్‌ పెరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టాలి. ఇవన్నీ సక్రమంగా చేయగలిగితే ఐబొమ్మ వంటి పైరసీ సైట్లవైపు వెళ్లకుండా ప్రేక్షకుల్ని నివారించగలుగుతారు. తద్వారా థియేటర్లకు ప్రేక్షకుల తాకిడి పెరుగుతుంది. సినిమాకి మునుపటి కళ వస్తుంది.