English | Telugu

20 ఏళ్ళ ఇండ‌స్ట్రీ హిట్ న‌ర‌సింహ‌నాయుడు

తెలుగునాట ఇండ‌స్ట్రీ హిట్స్ కి చిరునామాగా నిలిచిన క‌థానాయ‌కుల్లో న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ ఒక‌రు. మ‌రీ ముఖ్యంగా.. సంక్రాంతి సీజ‌న్ లో రెండేళ్ళ గ్యాప్ లో రెండు ఇండ‌స్ట్రీ హిట్స్ అందించారాయ‌న‌. 1999 సంక్రాంతికి విడుద‌లైన స‌మ‌ర‌సింహారెడ్డితోనూ.. 2001 సంక్రాంతికి రిలీజైన న‌ర‌సింహ‌నాయుడుతోనూ ఈ ఘ‌న‌త‌ను సాధించారు. కాగా, వీటిలో రెండో ఇండ‌స్ట్రీ హిట్ మూవీ అయిన న‌ర‌సింహ‌నాయుడు నేటి(జ‌న‌వ‌రి11)తో 20 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

ఈ సంద‌ర్భంగా న‌ర‌సింహ‌నాయుడు జ్ఞాప‌కాల్లోకి వెళితే..

* బాల‌కృష్ణ‌, స్టార్ డైరెక్ట‌ర్ బి. గోపాల్ కాంబినేష‌న్ లో నాలుగో సినిమా ఇది. లారీ డ్రైవ‌ర్, రౌడీ ఇన్స్ పెక్ట‌ర్, స‌మ‌ర‌సింహారెడ్డి వంటి ఘ‌న‌విజ‌యాల త‌రువాత ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన న‌ర‌సింహ‌నాయుడు.. గ‌త చిత్రాల కంటే మిన్నగా ఆద‌ర‌ణ పొందింది.

* తెలుగు చిత్ర సీమ‌లో రూ.25 కోట్ల షేర్ ఆర్జించిన తొలి చిత్రంగా న‌ర‌సింహ‌నాయుడుకి ప్ర‌త్యేక స్థాన‌ముంది. అలాగే 100కి పైగా కేంద్రాల్లో శ‌త‌దినోత్స‌వం జ‌రుపుకున్న తొలి ద‌క్షిణాది సినిమాగానూ చ‌రిత్ర పుట్ట‌లకెక్కింది న‌ర‌సింహ‌నాయుడు.

* బాల‌య్య‌కి తొలిసారి నంది పుర‌స్కారం ద‌క్కింది న‌ర‌సింహ‌నాయుడుతోనే. ఆ త‌రువాత సింహా, లెజెండ్ చిత్రాల‌కు గానూ మ‌రో రెండు సార్లు నంది అవార్డుల‌ను అందుకున్నారు న‌ట‌సింహ‌.

* సంక్రాంతి సీజ‌న్ లో వ‌చ్చిన బాల‌య్య రెండు ఇండ‌స్ట్రీ హిట్స్ లోనూ సిమ్రాన్ ఓ హీరోయిన్ గా న‌టించింది. ఈ రెండు సినిమాలు కూడా ముగ్గురు క‌థానాయిక‌ల చిత్రాలు కావ‌డం విశేషం.

* బాల‌కృష్ణ - మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ కాంబినేష‌న్ లో వ‌చ్చిన రెండో చిత్ర‌మిది. తొలి చిత్రం స‌మ‌ర‌సింహారెడ్డి కాగా.. ద్వితీయ ప్ర‌య‌త్నం న‌ర‌సింహ‌నాయుడు. ఇలా.. వీరిద్ద‌రి కాంబోలోని తొలి రెండు సినిమాలు కూడా ఇండ‌స్ట్రీ హిట్స్ కావ‌డం విశేషం. రెండు సినిమాల్లోనూ పాట‌ల‌న్నీ విశేష ప్ర‌జాద‌ర‌ణ పొందాయి.