English | Telugu

1000 కోట్ల సినిమాకు కాన్పెప్ట్‌ రెడీ.. మరి నిర్మాత ఎక్కడ?

- గేమ్ ఆఫ్ థ్రోన్స్‌, అవ‌తార్ టెక్నాల‌జీతో
- ల‌క్ష కాపీలు అమ్ముడుపోయిన న‌వ‌ల ఆధారంగా
- శంక‌ర్ డ్రీమ్ ప్రాజెక్టుల‌లో ఇదొక‌టి

ఎన్ని బ్లాక్‌బస్టర్స్‌ ఇచ్చిన దర్శకుడైనా ఒక దశలో సినిమాలు లేక ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. టాప్‌ డైరెక్టర్లుగా పేరు తెచ్చుకొన్న కొందరికి ఇది అనుభవమే. 1993లో జెంటిల్‌మెన్‌ చిత్రంతో సంచలన విజయం సాధించి డైరెక్టర్‌గా తనకంటూ ఒక మార్క్‌ క్రియేట్‌ చేసుకున్నారు శంకర్‌. ఆ సినిమా తర్వాత ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్‌, ఒకేఒక్కడు, బార్సు, అపరిచితుడు, శివాజీ, రోబో వంటి భారీ విజయాలతో ఇండియాలోనే టాప్‌ డైరెక్టర్‌గా ఎదిగారు.


టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో సినిమాలు రూపొందించడంలో దిట్ట అనిపించుకున్న శంకర్‌కు ప్రస్తుతం భారీ విజయాలు లేకపోగా భారీ డిజాస్టర్లు అతన్ని వెంటాడుతున్నాయి. రోబో తర్వాత శంకర్‌ చేసిన ఐ, స్నేహితుడు చిత్రాలు నిరాశపరిచాయి. ఆ తర్వాత రోబోకి సీక్వెల్‌గా చేసిన 2.0 కమర్షియల్‌గా కాస్త ఫర్వాలేదు అనిపించినా నష్టాలు మాత్రం తప్పలేదు.


2.0 తర్వాత భారతీయుడు2 చేయబోతున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు శంకర్‌. ఈ సినిమా ఎనౌన్స్‌ చేసినప్పుడే ఇది తప్పకుండా ఫ్లాప్‌ అవుతుందని అందరూ డిసైడ్‌ అయ్యారు. దానికి తగ్గట్టుగానే బాక్సాఫీస్‌ వద్ద భారతీయుడు2 ఘోరంగా దెబ్బతింది. ఆ తర్వాత రామ్‌చరణ్‌ హీరోగా చేసిన గేమ్‌ ఛేంజర్‌ చిత్రానికి కూడా అదే రిజల్ట్‌ వచ్చింది. భారతీయుడు2 చిత్రానికి కొనసాగింపుగా భారతీయుడు3 కూడా ఉందని ప్రకటించారు. అయితే ఆ సినిమాను పూర్తి చేసి రిలీజ్‌ చేసే ధైర్యం మాత్రం నిర్మాతలు చేయడం లేదు.


ఇలా వరస పరాజయాలతో శంకర్‌ కెరీర్‌ గ్రాఫ్‌ కింద పడిపోయింది. ఇప్పుడు అతనితో సినిమా చేసేందుకు ఏ నిర్మాతా సిద్ధంగా లేడు. ఎందుకంటే శంకర్‌ చేసే సినిమాలన్నీ భారీ బడ్జెట్‌ సినిమాలే. అంతేకాదు, సినిమా పూర్తి చెయ్యడానికి చాలా సమయం తీసుకుంటాడు. ఈ పరిస్థితిలో శంకర్‌తో సినిమా అంటే ఏ నిర్మాతకైనా కష్టంతో కూడుకున్న పనే.


ఇదిలా ఉంటే.. ఇటీవల చెన్నరులో ఓ కార్యక్రమానికి హాజరైన శంకర్‌.. తన నెక్స్‌ట్‌ సినిమా కాన్సెప్ట్‌ గురించి చెప్పారు. ప్రముఖ రచయిత వెంకటేశన్‌ రచించిన 'వేల్పారి' అనే చారిత్రక నవల లక్ష కాపీలకుపైగా అమ్ముడు పోయింది. దాని ఆధారంగా సినిమా చెయ్యబోతున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు శంకర్‌. తన డ్రీమ్‌ ప్రాజెక్ట్స్‌ చాలా వున్నాయని, వాటిలో ఇదొకటని చెప్పారు. గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌, అవతార్‌ వంటి సినిమాల టెక్నాలజీని ఈ సినిమాకి ఉపయోగించబోతున్నానని చెప్పారు.


శంకర్‌ అనుకున్న కాన్సెప్ట్‌కి రూ.1000 కోట్లకుపైగా బడ్జెట్‌ అవుతుందని కోలీవుడ్‌ ట్రేడ్‌వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారతీయుడు2, గేమ్‌ ఛేంజర్‌ వంటి రెండు భారీ డిజాస్టర్ల తర్వాత శంకర్‌తో అంత భారీ బడ్జెట్‌తో సినిమా చేసేందుకు ఏ నిర్మాతా ధైర్యం చెయ్యడు అనేది వాస్తవం. అంతేకాదు, అతని మీద నమ్మకంతో డేట్స్‌ ఇచ్చేందుకు హీరోలెవరూ ముందుకు రారు. ఈ పరిస్థితుల్లో శంకర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కడం అనేది దాదాపు అసాధ్యం అని కోలీవుడ్‌ వర్గాలు నిర్ధారణకు వచ్చేశాయి.