English | Telugu
బోయపాటి.. ఇలాగైతే ఎలాగయ్యా!
Updated : Sep 20, 2023
సినిమాకి ప్రమోషన్స్ చాలా ముఖ్యం. బాగా ప్రమోట్ చేస్తేనే, సినిమా ప్రేక్షకులకు చేరువై, టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ వస్తాయి. ఓపెనింగ్స్ అనేది మీడియం, బిగ్ బడ్జెట్ సినిమాలకి కీలకం. కానీ 'స్కంద' మూవీ టీం మాత్రం విడుదల తేదీ దగ్గరపడుతున్నా, ప్రమోషన్స్ లో దూకుడు పెంచడం లేదు. ఇది స్ట్రాటజీనా లేక తెలిసీతెలియక చేస్తున్న తప్పిదమా అనే చర్చ నడుస్తోంది.
రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన సినిమా 'స్కంద'. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో శ్రీలీల హీరోయిన్. 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి డైరెక్షన్ లో వస్తున్న సినిమా కావడం, రామ్-బోయపాటి కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీ కావడంతో మొదటి నుంచి 'స్కంద'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు సినిమా ఏమాత్రం తగ్గినా, రిజల్ట్ తేడా కొట్టే అవకాశముందనే ఆలోచనతోనే ప్రమోషన్స్ తగ్గించి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఈ స్ట్రాటజీ ఓపెనింగ్స్ పై ప్రభావం చూపుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. మరోవైపు విడుదల తేదీని సెప్టెంబర్ 15 నుంచి 28 కి మార్చడం, థమన్ స్వరపరిచిన పాటలు ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా సినిమాపై హైప్ ని తగ్గించాయని అంటున్నారు. ఏది ఏమైనా క్రేజీ కాంబోలో వస్తున్న మాస్ ఫిల్మ్ పై విడుదలకు ముందు భారీ హైప్ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి ఈ స్ట్రాటజీ రామ్-బోయపాటికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.