English | Telugu

'ప్రేమించొద్దు' మూవీ రివ్యూ

సినిమా పేరు: ప్రేమించొద్దు
తారాగణం: అనురూప్, దేవా మలిశెట్టి, సారిక, సోనాలి గార్జే, మానస, లహరి, యశ్వంత్ పెండ్యాల, సంతోషి తదితరులు
సంగీతం : చైతన్య స్రవంతి
బ్యాగ్రౌండ్ మ్యూజిక్ : కామరాన్
కెమెరా : హర్ష కొడాలి
లిరిక్స్ : శ్రీ సాయి కిరణ్
సౌండ్ మిక్సింగ్ : అరవింద్ మీనన్
బ్యానర్ : సిరిన్ శ్రీరామ్ కేఫ్
రైటర్, ఎడిటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ : సిరిన్ శ్రీరామ్
విడుదల తేదీ: జూన్ 7, 2024

ట్రయాంగిల్ ప్రేమకథగా వచ్చిన 'బేబీ' సినిమా ఘన విజయం సాధించింది. అయితే నిజానికి 'బేబీ' కథ తనదేనంటూ సిరిన్ శ్రీరామ్ అనే యువ దర్శక నిర్మాత ఆరోపించారు. అంతేకాదు అప్పటికే అదే కథతో తాను రూపొందించిన 'ప్రేమించొద్దు' సినిమాకి సంబంధించిన ప్రచార చిత్రాలను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అలా వార్తల్లో నిలిచిన 'ప్రేమించొద్దు' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
కమల్(అనురూప్)తో ప్రేమలో ఉన్న లాలస(సారిక).. అనుకోకుండా సారస్(దేవా మలిశెట్టి) తోనూ ప్రేమలో పడుతుంది. కమల్, సారస్ ఇద్దరూ లాలసని గాఢంగా ప్రేమిస్తారు. ఆమె కోసం ప్రాణాలు ఇవ్వడానికైన సిద్ధపడతారు. లాలస కూడా ఇద్దరినీ ఇష్టపడుతుంది. ఇద్దరితో చాలా చనువుగా ఉంటుంది. అసలు కమల్-లాలస ప్రేమ కథలోకి సారస్ ఎలా వచ్చాడు? సారస్ రాకతో వారి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగింది? చివరికి లాలస కమల్ వైపు మొగ్గు చూపిందా లేక సారస్ వైపు మొగ్గు చూపిందా? ఈ ముక్కోణపు ప్రేమ కథలో చివరి ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
ఇది కాలేజీ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ స్టోరీ. కాలేజీ బ్యాక్ డ్రాప్ తో సినిమా మొదలై.. ఫస్టాఫ్ అంతా చాలా సరదాగా నడిచింది. కామెడీ సన్నివేశాలు, ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ మెప్పించింది. ఇక సెకండాఫ్ లో కామెడీతో పాటు బలమైన కంటెంట్ కూడా ఉంది. పతాక సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలిచాయి.

కమల్, లాలస ప్రేమ సన్నివేశాలు మెప్పించాయి. సారాస్ రాకతో అది ముక్కోణపు ప్రేమ కథగా మారి, సినిమా మరింత ఆసక్తికరంగా నడిచింది. ఇక కమల్, సారస్ లలో లాలస ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనే విషయాన్ని చివరివరకు ఎంతో ఇంట్రెస్టింగ్ గా నడిపించారు. ఫీల్ మిస్ అవ్వకుండా, బోర్ కొట్టకుండా కథ చెప్పడంలో డైరెక్టర్ బాగానే సక్సెస్ అయ్యాడు. అయితే దర్శకుడు ఆరోపించినట్టుగా.. తన కథతో 'బేబీ' చిత్రం ముందు రావడం అనేది.. ఈ సినిమాకి బిగ్ మైనస్ అని చెప్పవచ్చు.

టెక్నికల్ గా ఈ సినిమా బాగానే ఉంది. హర్ష కొడాలి కెమెరా పనితనం ఆకట్టుకుంది. మ్యూజిక్, ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

నటీనటుల పనితీరు:
సినిమాకి ప్రధానమైన లాలస పాత్రలో సారిక చక్కగా రాణించింది. ఒకేసారి ఇద్దరినీ ఇష్టపడుతూ, ఎటు తేల్చుకోలేక సతమతమయ్యే పాత్రలో మంచి పర్ఫామన్స్ ఇచ్చింది. కమల్ గా అనురూప్, సారస్ గా దేవా మలిశెట్టి వారి పాత్రలకు న్యాయం చేశారు. సోనాలి గార్జే, మానస, లహరి, యశ్వంత్ పెండ్యాల, సంతోషి తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఫైనల్ గా...
ఈ తరం ప్రేమ కథలకు అద్దంపట్టేలా ఉన్న ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా యువతకు ఈ సినిమా నచ్చే అవకాశాలున్నాయి.

రేటింగ్: 2.5/5