English | Telugu
కట్టిపడేస్తున్న 'ఖుషి' ట్రైలర్.. మరో వంద కోట్ల బొమ్మ!
Updated : Aug 9, 2023
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఖుషి'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటిదాకా విడుదలైన పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
'ఖుషి' ట్రైలర్ ఈరోజు(ఆగస్టు 9) విడుదలైంది. కశ్మీర్ అందాలతో ప్రారంభమైన ఈ ట్రైలర్.. ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగి, కట్టిపడేసేలా ఉంది. కశ్మీర్ వెళ్లిన విప్లవ్(విజయ్) అక్కడ ఆరాధ్య(సమంత)ను చూసి బేగం అనుకొని ప్రేమ పేరుతో ఆమె వెంట పడటం.. ఆ తర్వాత తాను 'బేగం కాదు, బ్రాహ్మిణ్' అని సమంత చెప్పే సన్నివేశాలు క్యూట్ గా ఉన్నాయి. ఇద్దరు ప్రేమలో పడటం, ఆ తర్వాత దోషం ఉందంటూ వీరి పెళ్ళికి ఆరాధ్య తండ్రి అంగీకరించకపోయినా విప్లవ్-ఆరాధ్య పెళ్లి చేసుకోవడం.. పెళ్లి తర్వాత వారి మధ్య తలెత్తే చిన్న చిన్న సమస్యలతో ట్రైలర్ ఎంతో సరదాగా సాగింది. ఇక ట్రైలర్ చివరిలో "మార్కెట్ లో నా గురించి అలా అనుకుంటున్నారు కానీ నేను స్త్రీ పక్షపాతిని" అని విజయ్ చెప్పడం ఆకట్టుకుంది. ట్రైలర్ లో హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం కట్టి పడేస్తోంది. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే ఎమోషన్స్ తో కూడిన ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే భావన కలుగుతోంది.
ట్రైలర్ చూసి విజయ్ అభిమానులు, సమంత అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. విజయ్ కెరీర్ లో అత్యధిక వసూళ్ళు రాబట్టిన సినిమాగా రూ.130 కోట్ల గ్రాస్ తో 'గీత గోవిందం' నిలిచింది. ఇప్పుడు 'ఖుషి' కూడా వంద కోట్ల క్లబ్ లో చేరి ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. అందుకే ట్రైలర్ రాగానే వంద కోట్ల బొమ్మ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.