English | Telugu
విడుదలకు ముందే రూ. 200 కోట్లకు పైగా ఆర్జించిన కమల్ హాసన్ 'విక్రమ్'
Updated : May 30, 2022
కమల్ హాసన్ టైటిల్ రోల్ పోషిస్తోన్న 'విక్రమ్' మూవీ జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. అయితే థియేటర్లలోకి రాకముందే ఆ మూవీ రూ. 200 కోట్లకు పైగా వసూలు చేసేసింది. ట్రేడ్ వర్గాల ప్రకారం, లోకేశ్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ఆ మూవీ ఓటీటీ హక్కులు రికార్డు ధరలకు అమ్ముడయ్యాయి. నిజానికి కమల్ హాసన్ కెరీర్‌లోనే 'విక్రమ్' మూవీ ప్రి బిజినెస్ అత్యధికం. ఈ ఏడాది ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో అదొకటి కావడమే దీనికి కారణం. లోకేశ్ మునుపటి సినిమాలు 'ఖైదీ', 'మాస్టర్' ఒకదాన్ని మించి ఒకటి బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించడంతో 'విక్రమ్'పై అంచనాలు అంబరాన్ని చుంబిస్తున్నాయి.
కమల్‌తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు చేసిన ఈ సినిమా పాన్ ఇండియా ఫిల్మ్‌గా విడుదలవుతోంది. ట్రేడ్ విశ్లేషకుడు రమేశ్ బాల ట్విట్టర్ ద్వారా, 'విక్రమ్' మూవీ ప్రి రిలీజ్ బిజినెస్ ద్వారా రూ. 200 కోట్లను ఆర్జించినట్లు వెల్లడించాడు. "కమల్ హాసన్ కెరీర్‌లో 'విక్రమ్' అత్యధిక ప్రి రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. పలు భాషల్లో శాటిలైట్, ఓటీటీ హక్కులతో కలుపుకొని రూ. 200 కోట్లకు పైగా బిజినెస్ అయ్యింది" అని ఆయన రాసుకొచ్చాడు.
కమల్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రధారులైన 'విక్రమ్'ను వయొలెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా లోకేశ్ రూపొందించాడు. కమల్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ఈ మూవీని నిర్మించింది. నరైన్, కాళిదాస్ జయరామ్, హరీశ్ ఉత్తమన్, అర్జున్ దాస్ ఇతర పాత్రధారులు కాగా, హీరో సూర్య అతిథి పాత్రలో మెరవనున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం ఈ సినిమాకు ఓ ఎస్సెట్‌గా నిలవనున్నట్లు ఇప్పటికే విడుదలైన పాటలు తెలియజేస్తున్నాయి.