English | Telugu

ఇది నాకు 'ఆస్కార్' కన్నా ఎక్కువ

సినిమా విడుదలకి ముందే 'మేజర్' టీమ్ కి ప్రశంసలు దక్కుతున్నాయి. జూన్ 3న విడుదల కానున్న ఈ సినిమాని రిలీజ్ కి ముందే పది సిటీలలో స్పెషల్ స్క్రీనింగ్ వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు చోట్ల స్క్రీనింగ్ జరగగా సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ కూడా లభించింది. ఇక తాజాగా ఈ మూవీ టీమ్ 'నేషనల్ సెక్యూరిటీ గార్డ్' నుంచి ఓ మెడల్ అందుకుంది. ఇది తమకు ఆస్కార్ కన్నా గొప్ప విషయమని అడివి శేష్ తన సంతోషాన్ని పంచుకున్నాడు.

అడివి శేష్ ప్రధాన పాత్ర పోషించిన లేటెస్ట్ మూవీ 'మేజర్'. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి శశి కిరణ్ తిక్క దర్శకుడు. సోనీ పిక్చర్స్, జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్ల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా జూన్ 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రిలీజ్ కి పదిరోజుల ముందే మే 24 నుంచి ప్రీరిలీజ్ ఫిల్మ్ స్క్రీనింగ్ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ముంబైలో 'నేషనల్ సెక్యూరిటీ గార్డ్'కి చెందిన 312 కుటుంబాలకు సినిమాని చూపించారు.

సినిమా ప్రదర్శన అయ్యాక హెడ్ క్వార్టర్స్ కి రమ్మని 'నేషనల్ సెక్యూరిటీ గార్డ్' నుంచి పిలుపు వచ్చిందట. సినిమాలో తాము ఏమైనా తప్పుగా చూపించామా అని భయంతో వెళ్ళగా.. అక్కడ వారు తమంకి నేషనల్ సెక్యూరిటీ బ్లాక్ కమాండో మెడల్ బహుకరిచారని అడివి శేష్ తెలిపాడు. అది తనకు ఆస్కార్ కన్నా గొప్ప విషయం అంటూ పొంగిపోయాడు.

కాగా, ముంబైలోని 'నేషనల్ సెక్యూరిటీ గార్డ్'లో సందీప్ ఉన్ని కృష్ణన్ ట్రైనింగ్ అయ్యాడు. అక్కడ ఆయన విగ్రహం కూడా ఉంది.