English | Telugu

హరి హర వీరమల్లు మూవీ రివ్యూ

తారాగణం: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, ఈశ్వరి రావు, తనికెళ్ళ భరణి, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, మురళి శర్మ, అయ్యప్ప శర్మ, కబీర్ సింగ్, వెన్నెల కిశోర్ తదితరులు
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
డీఓపీ: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వి.ఎస్
ఎడిటర్: ప్రవీణ్ కె.ఎల్
ఆర్ట్: తోట తరణి
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ
సమర్పణ: ఎ. ఎం. రత్నం
నిర్మాత: ఎ. దయాకర్ రావు
బ్యానర్: మెగా సూర్య ప్రొడక్షన్స్
విడుదల తేదీ: జూలై 24, 2025

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'హరి హర వీరమల్లు'. పవన్ కళ్యాణ్ నటించిన మొదటి పీరియాడిక్ ఫిల్మ్ కావడంతో పాటు, ఆయన నుంచి వచ్చిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో వీరమల్లుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడో ఐదేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా పలు కారణాల వల్ల ఆలస్యమై.. ఎట్టకేలకు ఇప్పుడు థియేటర్లలో అడుగుపెట్టింది. మరి 'హరి హర వీరమల్లు' ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలిని తీర్చేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. (Hari Hara Veera Mallu Movie Review)

కథ:
ఇది 17వ శతాబ్దంలో జరిగే కథ. హరి హర వీరమల్లు(పవన్ కళ్యాణ్) ఓ దొంగ. రాజులకు, విదేశాలకు చేరాల్సిన వజ్రాలను దొంగతనం చేసి.. వాటితో పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుంటాడు. వీరమల్లు దొంగ మాత్రమే కాదు, ఎంత మందినైనా మట్టి కరిపించే యోధుడు కూడా. తన బుద్ధిబలం, కండబలంతో వజ్రాలను దోచుకుంటూ.. కుతుబ్ షా దృష్టిలో పడతాడు. వీరమల్లుకి కుతుబ్ షా ఓ పెద్ద బాధ్యతను అప్పగిస్తాడు. అదేంటంటే.. క్రూరమైన మొఘల్ రాజు ఔరంగజేబు(బాబీ డియోల్) తీసుకెళ్లిన అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావాలని. ఔరంగజేబు అత్యంత క్రూరమైన వాడు. అతని వల్ల ఎందరో రాజులు చనిపోయారు, ఎన్నో రాజ్యాలు నలిగిపోతున్నాయి. కోహినూర్ కోసం కుతుబ్ షా పంపించిన ఏడుగురిని దారుణంగా చంపేశాడు. ఇప్పుడు వీరమల్లు ఎనిమిదో వాడు. అసలు వీరమల్లు ఎవరు? అందరిని భయపెట్టే ఔరంగజేబును అతను చేరుకోగలిగాడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
పవన్ కళ్యాణ్ పీరియాడిక్ ఫిల్మ్ చేయడం ఇదే మొదటిసారి. కాబట్టి ప్రేక్షకులకు ఈ సెటప్ కాస్త కొత్తగా ఉంటుంది. అక్కడే మూవీ టీమ్ సగం విజయం సాధించిందని చెప్పవచ్చు. కోహినూర్ వజ్రం గురించి, దాని విలువ గురించి అందరూ ఎంతో కొంత వినే ఉంటారు. అలాంటి కోహినూర్ వజ్రం నేపథ్యంలో కథని తీసుకొని, ఔరంగజేబు నుంచి దానిని తిరిగి తీసుకురావడం అనే ఆలోచన బాగుంది. అయితే దానిని రెండు భాగాలుగా కాకుండా, ఒకే భాగంగా మరింత ఆసక్తికరంగా చెబితే బాగుండేది.

కోహినూర్ వజ్రం దొరికిన కొల్లూరు ప్రాంతంలో వజ్రాల వేటను, వీరమల్లు బాల్యాన్ని చూపిస్తూ సినిమా ప్రారంభమైంది. వీరమల్లు ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోయింది. అదొక్కటే కాదు.. ఫస్ట్ హాఫ్ లో డిజైన్ చేసిన మిగతా యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. కుస్తీ ఫైట్ కానీ, చార్మినార్ ఫైట్ సీక్వెన్స్ కానీ ఆకట్టుకున్నాయి. ఫ్యాన్స్ మెచ్చే హై మూమెంట్స్ ఎన్నో ఉన్నాయి. ఈ యాక్షన్ సీన్స్ ని కలుపుతూ కథను కూడా ఆసక్తికరంగానే నడిపించారు. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్, ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయాయి.

ఈ కథ ప్రధానంగా కోహినూర్ వజ్రం చుట్టూ తిరుగుతుందని మొదటి నుంచి చెప్పారు. కానీ, నిజానికి ఈ కోహినూర్ కథ ఇంటర్వెల్ కి ముందే మొదలవుతుంది. అయినప్పటికీ యాక్షన్ సీన్స్ తో ఫస్ట్ హాఫ్ ని బోర్ కొట్టకుండా చేశారు. అయితే అసలు కథ మొదలయ్యాక సెకండ్ హాఫ్ ఓ రేంజ్ లో ఉంటుందని అందరూ ఆశిస్తారు. కానీ, ఆ స్థాయిలో సెకండ్ హాఫ్ లేదనే చెప్పాలి. ముఖ్యంగా ఢిల్లీకి వెళ్లే ప్రయాణం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు నెమ్మదిగా సాగాయి. ఫ్లాష్ బ్యాక్ కూడా ఆకట్టుకోలేదు. అయితే ప్రీ క్లైమాక్స్ కి మాత్రం మళ్ళీ సినిమాలో ఊపు వచ్చింది. యాక్షన్, ఎమోషన్స్ తో ప్రీ క్లైమాక్స్ ని డిజైన్ చేసిన తీరు బాగుంది. ముగింపు అంత సంతృప్తి ఇవ్వదు. వీరమల్లు లక్ష్యం నెరవేరకుండా సినిమాని ముగించడం నిరాశ కలిగిస్తుంది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూపించారు. ఈ మూవీ కొన్నేళ్ల పాటు షూటింగ్ జరుపుకోవడంతో లుక్స్ పరంగా అక్కడక్కడా వ్యత్యాసం కనిపించినా.. తనదైన నటనతో ఆ విషయాన్ని మరిచిపోయేలా చేయగలిగారు పవన్. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో కట్టిపడేశారు. పంచమి పాత్రలో నిధి అగర్వాల్ తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఇక ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ చక్కగా ఒదిగిపోయారు. పవన్ తో ఢీ అంటే ఢీ అన్నట్టుగా నటించారు. సత్యరాజ్, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

'హరి హర వీరమల్లు' సినిమా సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. ఎం.ఎం. కీరవాణి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు. సినిమా విడుదలకు ముందు పాటలు చార్ట్ బస్టర్స్ కానప్పటికీ.. సినిమా చూస్తున్నప్పుడు ఆ పాటలు వినసొంపుగా ఉన్నాయి. విజువల్ గానూ బాగున్నాయి. ఇక నేపథ్య సంగీతంలో తన మార్క్ చూపించారు కీరవాణి. చాలా సీన్స్ ని తనదైన మ్యూజిక్ తో ఎలివేట్ చేశారు. వీఎఫ్ఎక్స్ మాత్రం చాలా చోట్ల తేలిపోయింది. ముఖ్యంగా సెకండాఫ్ లో గుర్రాల సీన్స్ ఆర్టిఫీషియల్ గా ఉన్నాయి. తోట తరణి డిజైన్ చేసిన సెట్స్.. మనల్ని 17వ శతాబ్దంలోకి తీసుకెళ్లేలా ఉన్నాయి. మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ ల కెమెరా పనితనం ఆకట్టుకుంది. ప్రవీణ్ కె.ఎల్ ఎడిటింగ్ పరవాలేదు. సంభాషణలు బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

ఫైనల్ గా చెప్పాలంటే...
'హరి హర వీరమల్లు' సినిమా పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి తీర్చేలా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ చూడని పాత్రలో కొత్తగా కనిపించాడు. ప్రతి ఫ్రేమ్ లో ఆయన కష్టం కనిపించింది. కథనంలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. పవన్ కళ్యాణ్ ఈ సినిమాని కాపాడాడని చెప్పవచ్చు.

రేటింగ్: 2.75/5