English | Telugu

'కస్టడీ' ట్రైలర్ అదిరింది.. చైతన్య సాలిడ్ హిట్ కొట్టేలా ఉన్నాడు!

నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'కస్టడీ'. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ తెలుగు, తమిళ భాషల్లో మే 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.

'కస్టడీ' చిత్రం 48 గంటల్లో జరిగే కథ అని ఇప్పటికే మూవీ టీం క్లారిటీ ఇచ్చింది. ఇక ఈరోజు విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఇదొక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అనిపిస్తోంది. ఏకంగా సీఎం బండినే ఆపిన కానిస్టేబుల్ శివగా చైతన్య పరిచయమయ్యాడు. అతనికి డ్యూటీ అంటే ప్రాణం, డ్యూటీ కోసం ఏమైనా చేస్తాడు అన్నట్టుగా అతని పాత్రను చూపించారు. ఓ వైపు ప్రేమించిన అమ్మాయి పెళ్లి.. మరోవైపు పై అధికారులను ఎదిరించి, ప్రత్యర్థుల దాడుల నుంచి రక్షిస్తూ ఓ భయంకరమైన క్రిమినల్ ని కోర్టులో హాజరుపరిచే బాధ్యత.. వీటి నడుమ కథానాయకుడి ప్రయాణం ఎలా సాగిందన్న ఆసక్తిని కలిగిస్తూ ట్రైలర్ ను రూపొందించారు. "ఒక్కసారి న్యాయం పక్కన నిలబడి చూడు.. నీ లైఫే మారిపోతుంది", "నిజం గెలవడానికి లేట్ అవుతుంది.. కానీ ఖచ్చితంగా గెలుస్తుంది" వంటి డైలాగ్స్ మెప్పించాయి. కతీర్ సినిమాటోగ్రఫీ, యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే చైతన్య ఖాతాలో మంచి విజయం ఖాయమనే అభిప్రాయం కలుగుతోంది.