English | Telugu
‘కరోనా పేపర్స్’ మూవీ రివ్యూ
Updated : May 6, 2023
సినిమా పేరు: కరోనా పేపర్స్
తారాగణం: షేన్ నిగమ్, సిద్దిక్, జీన్ లాల్, షైన్ టామ్ చాకో, ఫ్రాంకో ఫ్రాన్సిస్, గాయత్రీ, జీసీ జోస్, విజిలేష్ కరాయద్, హన్నా రెజి కోషి, మేనకా సురేష్ కుమార్, సంధ్యా శెట్టి తదితరులు
రచయిత: శ్రీగణేషన్
ఎడిటింగ్: ఎమ్ ఎస్ అయ్యప్పన్ నయ్యర్
సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి
సంగీతం: కె.పి
నిర్మాత: ఎన్ ఎమ్ బాదుషా, ప్రియదర్శన్
దర్శకత్వం: ప్రియదర్శన్
ఓటీటీ వేదిక: డిస్నీ ప్లస్ హాట్ స్టార్
ఇతర భాషలో హిట్ అయిన సినిమాని తెలుగులో డబ్ చేసి ఓటీటీలో విడుదల చేస్తే హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలా మలయాళంలో హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ కరోనా పేపర్స్ సినిమాని తాజాగా తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైన ఈ సినిమా కథేంటో ఓసారి చూసేద్దాం...
కథ:
ఒక అర్థరాత్రి ఎనిమిది బుల్లెట్లు పేలిన శబ్ధాలు వినిపించడంతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత ఒక పోలీస్ అధికారి వాకింగ్ చేస్తుంటే కార్ లో వచ్చిన కొందరు దుండగలు అతడిని కాల్చి చంపేస్తారు. దాంతో ఈ సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఆ తర్వాత రోజు ఇద్దరు వారి కారు మిస్ అయిందని పోలీస్ స్టేషన్ లో కంప్లెంట్ ఇవ్వడానికి వస్తారు. అలా వచ్చిన వారిని పోలీస్ అధికారులు.. వాళ్లే చంపారని చెప్పి రివర్స్ కేస్ పెడతారు. ఆ కేస్ నుండి వాళ్ళు బయటపడ్డారా? అసలు క్రిమినల్ ఎవరు?.. ఆ తర్వాత ఏం జరిగిందనేది అసలు కథ. ఈ కథేంటో తెలియాలంటే 'కరోనా పేపర్స్' మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ:
శ్రీగణేషన్ రాసుకున్న కథని ప్రియదర్శన్ ఆశించిన తరహాలో తెరపై చూపించలేకపోయాడు. మొదట ఒక క్రైమ్ ని చూపించి.. ఆ క్రైమ్ ని అమాయకుల మీద వేయడంతో కథ ఒక ఇంటెన్స్ తో స్టార్ట్ అవుతుంది. అయితే ఆ తర్వాత అదే స్టేషన్ లోకి కొత్తగా ఒక ఎస్సై పోస్టింగ్ కి రావడం.. ఆ తర్వాత అతనికి ఒక గన్ ఇవ్వడం.. దానిని ఆ పోలీస్ పోగొట్టుకోవడం ఇదంతా మెయిన్ కథని డిస్టబ్ చేసేదిలా సాగుతుంది. అసలు కథని పక్కకు పెట్టి మళ్ళీ జర్నలిస్టుని హీరో నమ్మి పోలిస్ స్టేషన్ లో జరిగే కొన్ని విషయాలని షేర్ చేయడం ఇదంతా స్లోగా సాగుతుంటాయి.
సినిమా కథలో మొదటి ఇరవై నిమిషాలు ఆసక్తికరంగా సాగుతుంది. ఆ తర్వాత పోలీస్ గన్ కోసం సెర్చ్ చేసే విధానం బాగున్నా.. ఆ తర్వాత కథ టెంపో మిస్ అయింది. చివరి ముప్పై నిమిషాలలో రివీల్ అయ్యే ట్విస్ట్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు మనకి అప్పట్లో రిలీజ్ అయి మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకున్న 'సేనాపతి' సినిమానే గుర్తొస్తుంది. అయితే అక్కడికి ఇక్కడికి డిఫరెంట్ ఏంటంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఒక్కటే. అయితే ఇందులో ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అక్కడక్కడా పోలీస్ స్టేషన్ లో పై అధికారికి, కింది అధికారికి మధ్య జరిగే సీన్స్ అన్నీ చాలా సాధారణమైనవిగా ఉంటాయి. ఒక స్లో మోషన్ వీడియోని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. సంగీతం ఉందా అంటే ఏమో అనే చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతగా బాలేదు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఒకటి రెండు సీన్లు తప్ప ఏవీ అంతగా మెప్పించలేదు.
ఫస్టాఫ్ లో కొన్ని సన్నివేశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే డైరెక్టర్ ప్రియదర్శన్ ఆ ఇంటెన్స్ ని చివరిదాకా తీసుకెళ్ళలేకపోయాడు. ఒక్కోసారి అసలు ఏం జరుగుతుందా అనే డైలామాలో ప్రేక్షకులు ఉండిపోతారు. ఒకటి రెండు సీన్లు ఉత్కంఠని రేకెత్తించినా థ్రిల్లర్ మూవీని చూస్తున్నామనే ఫీలింగే ఉండదు. ఇదే సినిమా ఒక అయిదారు సంవత్సరాల క్రితం తీసుంటే చూసేవారికి కాస్త బాగుండేది. ఎందుకంటే ఇలాంటి కథలని మించిన సస్పెన్స్ థ్రిల్లర్స్ ని ఇప్పటికే ప్రేక్షకులు చూసేసారు. మలయాళం నుండి వచ్చే క్రైమ్ సస్పెన్స్ మూవీలు అన్నీ దాదాపుగా కొత్తగా ఉంటాయి. మరి ఈ కథేంటో ఏ చోట కొత్తదనం కనిపించదు. గంటన్నర సినిమాని రెండన్నర గంటలు ఎలా తీసాడో అర్థం కాలేదు. ఒకట్రెండ్ ట్విస్ట్ ల కోసం ప్రేక్షకుడు క్లైమాక్స్ వరకు ఓపికతో కూర్చొని చూడాల్సిందే. ఎన్ని స్లో సీన్స్ అంటే అసలు కథని డైవర్ట్ చేసే సీన్లు చాలానే ఉన్నాయి. ఎడిటర్ అయ్యప్పన్ నయ్యర్ కొన్ని సీన్స్ ని ట్రిమ్ చేస్తే బాగుండు. సంగీతం ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. కథాంశం బాగున్నా తీసిన విధానంలో కొత్తదనమేమీ లేదు.
నటీనటుల పనితీరు:
కాకా పాపి పాత్రలో షైన్ టామ్ చాకో ఒదిగిపోయాడు. తన పాత్ర నిడివి చిన్నదైనా ఉన్నంతలో బాగా నటించాడు. ఎస్సై రాహుల్ నంబియార్ గా షేన్ నిగమ్ ఆకట్టుకున్నాడు. శంకరరామన్ గా, గోవిందన్ నంబియార్(నకిలి)గా సిద్దిక్ ముఖ్య పాత్రని పోషించాడు. టోనీగా జీన్ లాల్ పర్వాలేదనిపించాడు. గాయత్రీ సపోర్టింగ్ యాక్టర్ గా ఆకట్టుకుంది. ఏఎస్పీ గ్రేసీగా సంధ్యా శెట్టి ఉన్నంతో ఆకట్టుకుంది.
తెలుగుఒన్ పర్ స్పెక్టివ్:
సస్పెన్స్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వారికి నచ్చుతుంది. కామన్ ఆడియన్స్ ఒక్కసారి చూడొచ్చు.
రేటింగ్: 2/5
✍🏻. దాసరి మల్లేశ్