English | Telugu

హైదరాబాద్ లో బాలీవుడ్ స్టార్స్ స్టూడియోలు.. ఒక్కో స్టూడియోకి ఎన్ని ఎకరాలంటే..?

ఫ్యూచర్ సిటీలో భారీ ఫిల్మ్ స్టూడియోలు
ముందుకొచ్చిన బాలీవుడ్ స్టార్స్

హైదరాబాద్ ను ఇండియన్ సినిమా హబ్ గా మారుస్తామని కొద్దినెలల క్రితం తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన చెప్పినట్టుగానే ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో పలు ఫిల్మ్ స్టూడియోలు ఉన్నాయి. ఇప్పుడు మరో రెండు స్టూడియోలకు అడుగులు పడుతున్నాయి.

బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్ హైదరాబాద్ లో స్టూడియోలు పెట్టడానికి ముందుకొచ్చారు. సల్మాన్ కి చెందిన 'సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్', అజయ్ దేవ్‌గణ్ కి చెందిన విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ 'ఎన్.వై. వీఎఫ్ఎక్స్ వాలా'.. ఈ ఫిల్మ్ స్టూడియోలను ఏర్పాటు చేయనున్నాయి.

అంతర్జాతీయస్థాయిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ'ని నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం పూనుకున్న విషయం విదితమే. ఐటీ, ఫార్మా వంటి వివిధ రంగాలతో పాటు వినోద రంగానికి కూడా ఇది కేంద్రంగా మారనుంది. ఈ ఫ్యూచర్ సిటీలో స్టూడియోలు నిర్మించడానికి సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్ ముందుకొచ్చారు.

Also Read: బాలకృష్ణకు ఐపీఎస్ అధికారి క్షమాపణలు..!

డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'లో.. ఫిల్మ్ స్టూడియోల ఏర్పాటుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్ కంపెనీలు ఒప్పందం చేసుకునే అవకాశముంది అంటున్నారు. ఒక్కో స్టూడియో ఏర్పాటుకు 50-60 ఎకరాల స్థలం అవసరమని ఇప్పటికే ఆయా సంస్థల ప్రతినిధులు ప్రభుత్వానికి చెప్పినట్లు సమాచారం.

కాగా, కొద్దిరోజుల క్రితం సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్ విడివిడిగా సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై.. తెలంగాణ అభివృద్ధిలో భాగమవుతామని చెప్పడం విశేషం.