English | Telugu

అర్థమయ్యిందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ రివ్యూ

అర్థమయ్యిందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ రివ్యూ

వెబ్ సిరీస్ : అర్థమయ్యిందా అరుణ్ కుమార్
నటీనటులు: హర్షిత్ రెడ్డి, అనన్య శర్మ, తేజస్విని మదివాడ, గౌతమ్ గోమఠం, జై ప్రవీణ్, వాసు ఇంటూరి తదితరులు
సంగీతం: అజయ్ అరసాడ
ఎడిటింగ్: నాగేశ్వర్ రెడ్డి బొంతల
సినిమాటోగ్రఫీ: అమర్ దీప్ గుత్తుల
నిర్మాతలు: బి. సాయి కుమార్, శరణ్ సాయి కుమార్
నిర్మాణ సంస్థలు: అర్రే స్టుడియో, లాఫింక్ కౌ ప్రొడక్షన్స్
దర్శకత్వం: జొనాథన్ ఎడ్వర్డ్స్
ఓటిటి: ఆహా

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలే కాదు కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లకు మంచి గుర్తింపు వస్తుంది. కాగా తాజాగా ఆహాలో విడుదలైన 'అర్థమైందా అరుణ్ కుమార్' వెబ్ సిరీస్ ఎలా ఉందో చూసేద్దాం

కథ:

అమలాపురం నుండి అరుణ్(హర్షిత్ రెడ్డి) హైదరాబాద్ కి వస్తాడు. ఒక కార్పోరేట్ కంపెనీలో జాబ్ చేయాలని ఎన్నో కలలు కంటుంటాడు అరుణ్. అయితే తనకి ఒక స్టార్టప్ కంపెనీలో ఇంటర్న్ షిప్ లో అవకాశం లభిస్తుంది. దాన్ని అదృష్టంగా భావించిన అరుణ్ కుమార్.. ఆఫీస్ లో ఎంతో వినయంగా, క్రమశిక్షణగా ఉంటాడు. అయితే అరుణ్ కుమార్ మంచితనాన్ని ఆసరగా తీసుకొని.. అతనిని తన సీనియర్ టీం లీడర్ అయినటువంటి జై అవమానిస్తుంటాడు. దాంతో ఒకానొక దశలో హైదరాబాద్ లో మనకేమి సెట్ కాదని వెళ్ళిపోదామనుకుంటున్న టైంలో షాలిని(తేజస్విని మదివాడ) వస్తుంది. దాంతో అరుణ్ కళ్ళుతిప్పుకోకుండా తననే చూస్తుంటాడు. అరుణ్ ఎవరి టీంలో ఉండాలని జై, అరుణ్ కలిసి ఒక గేమ్ ఆడతారు. ఆ గేమ్ లో ఓడిపోవడం వల్ల జై టీం నుండి షాలినీ టీంకి వస్తాడు అరుణ్. ఆ తర్వాత షాలినితో కలిసి అరుణ్ క్లోజ్ గా ఉంటాడు. అయితే మొదటి నుండి అరుణ్ ని పల్లవి ఇష్టపడతుంది. మరి పల్లవి ప్రేమని అర్థం చేసుకోగలిగాడా? షాలిని, అరుణ్ ల మధ్య ఏం జరిగింది? సాఫ్డ్ వేర్ ఉద్యోగం చేయాలనే డ్రీమ్ ని అరుణ్ నెరవేర్చుకున్నాడా లేదా అని తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

విశ్లేషణ:

సాఫ్ట్‌వేర్ మీద ఉన్న ఇష్టంతో ఎన్నింటినో దాటుకొని వచ్చిన అరుణ్ కుమార్.. ఎదుర్కొన్న పరిస్థితులేంటని చక్కగా చూపించాడు డైరెక్టర్. సాఫ్ట్‌వేర్ లో కొత్తగా జాయిన్ అయిన ఒక ఎంప్లాయ్ ని సీనియర్స్ ఎలా చూస్తారో చూపించిన విధానం వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. అరుణ్ కుమార్ వ్యక్తిగత జీవితాన్ని, ఆఫీస్ లో సిచువేషన్స్ ని కలిపి భిన్నమైన వ్యక్తుల మనస్తత్వాలు తెలిసిపోతాయి. అరుణ్ కుమార్ తన జాబ్ లో వచ్చే ఎన్నింటినో ఎదుర్కొనే సీన్స్ ఆలోచించేలా చేస్తాయి.

అయితే ఈ సినిమాలో భారీ డైలాగ్స్ ఏమీ లేవు. ఒక సింపుల్ కథని అంతే సింపుల్ గా కొనసాగించారు మేకర్స్. ట్విస్ట్ లు, ఫైట్స్ పెద్దగా ఏమీ లేకపోగా ఒక్కో ఎపిసోడ్‌ నిడివి కూడా తక్కువే. వీకెండ్ లో ఒక సింపుల్ అండ్ క్లాసికల్ సిరీస్ చూడాలంటే ఇది చూడొచ్చు. అయితే మధ్యలో కొన్ని లిప్ లాక్ సీన్స్ ఉంటాయి. ఫ్యామిలీతో కాకుండా ఒక్కొక్కరు వ్యక్తిగతంగా చూస్తే బాగుంటుంది.

ఒక్కో పాత్రని పరిచయం మొదటి ఎపిసోడ్ ముగుస్తుంది. ఆ తర్వాత అరుణ్ కుమార్ ఆఫీస్ లో ఎదుర్కునే ఇబ్బందులను చూపిస్తూ మిగతా ఎపిసోడ్‌లు సాగుతుంటాయి. అయితే అరుణ్, పల్లవిల లవ్ స్టోరీని ముగించిన విధానం కాస్త నిరాశని కలిగిస్తుంది. ఈ వెబ్ సిరీస్‌లో స్క్రీన్ ప్లే బాగుంది. అజయ్ అరసాడ సంగీతం బాగుంది. నాగేశ్వర్ రెడ్డి బొంతల ఎడిటింగ్ నీట్ గా ఉంది. అమర్ దీప్ గుత్తుల సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

అరుణ్ కుమార్ పాత్రలో హర్షిత్ రెడ్డి ప్రాణం పెట్టి చేశాడు. తన హావభావాలతో సిరీస్ ని ఆసక్తికరంగా మలిచాడు. తన టైమింగ్, డైలాగ్ డెలివరీ చాలా సాదాసీదాగా ఉంటూ మనలో ఒకడిగా కనిపిస్తుంటాడు. పల్లవి పాత్రలో '30weds21' ఫేమ్ అనన్య శర్మ ఆకట్టుకుంది. షాలిని పాత్రలో తేజస్విని మదివాడ గ్లామర్ రోల్ ని చేసింది. జై, గౌతమ్ గోమఠం వారి వారి పరిధి మేరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

తెలుగువన్ పర్ స్పెక్టివ్:

వీకెండ్ లో ఒక సింపుల్ క్లాస్ స్టోరీని చూడాలంటే ఈ సిరీస్ ని చూసేయొచ్చు. అయితే ఫ్యామిలీతో కాకుండా వ్యక్తిగతంగా చూస్తే బాగుంటుంది.

రేటింగ్: 3 / 5

✍🏻. దాసరి మల్లేశ్