English | Telugu

సూర్య‌తో అనుష్క మాలీవుడ్ ఎంట్రీ

తెలుగులో స్టార్ హీరోయిన్‌గా త‌న‌దైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అనుష్క శెట్టి త‌మిళంలో కొన్ని సినిమాలు చేసింది. ఎక్కువ ఫోక‌స్ తెలుగు సినిమాపైనే పెట్టింది. ఇత‌ర భాష‌ల్లో ఆమె న‌టించలేదు. అయితే ఎట్ట‌కేల‌కు ఇప్పుడామె మ‌ల‌యాళ చిత్ర‌సీమ‌లోకి అడుగు పెట్ట‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. వివ‌రాల్లోకి వెళితే, జై సూర్య‌తో హోమ్ మూవీ ఫేమ్ రోజీ థామ‌స్ ఓ సినిమా చేస్తున్నారు. అది కూడా పీరియాడిక్ మూవీ. ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఇది రెండు భాగాలుగా తెర‌కెక్క‌నుంది. ఇందులో అనుష్క న‌టించ‌నుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. స్క్రిప్ట్ ఎంతో న‌చ్చి ఉంటే త‌ప్ప అనుష్క మ‌ల‌యాళ సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్ట‌ద‌ని సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న టాక్‌.

ఇక తెలుగు సినిమాల విష‌యానికి వ‌స్తే అనుష్క వ‌రుస సినిమాలు చేయ‌టం లేదు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో ప్ర‌ధానంగా న‌టిస్తుంది. అది కూడా గ్యాప్‌లు తీసుకుంటూ. రీసెంట్‌గా మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి చిత్రంలో ఆమె క‌థానాయిక‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. న‌వీన్ పొలిశెట్టి ఇందులో హీరో. ఈ సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది. చాలా రోజుల త‌ర్వాత అనుష్క‌కు మంచి స‌క్సెస్‌ను తెచ్చి పెట్టిన సినిమా ఇది. అంత‌కు ముందు నిశ్శ‌బ్దం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు డైరెక్ట‌ర్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ద్వారా వ‌చ్చిన‌ప్ప‌టికీ అదేమీ అంత పేరుని తెచ్చిపెట్ట‌లేదు. ఓ ర‌కంగా అనుష్క‌పై విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి.

అనుష్క సినిమా సినిమాకు ఎక్కువ గ్యాప్ తీసుకుంటుంది. అందుకు కార‌ణం.. అంతకు ముందు సైజ్ జీరో సినిమాకుగానూ ఆమె త‌న బ‌రువు పెంచుకుని లుక్ మార్చి మ‌రీ న‌టించారు. అయితే త‌ర్వాత ఆమె ఆ బ‌రువును త‌గ్గించుకోలేక‌పోతున్నారు. మ‌ధ్యలో బాహుబ‌లి, భాగ‌మ‌తి సినిమాల్లో న‌టించి మెప్పించిన‌ప్ప‌టికీ అనుష్క లుక్‌పై మాట‌లు వినిపిస్తూనే వ‌స్తున్నాయి. దీంతో ఆమె ఎక్కువ గ్యాప్ తీసుకున్నారు. బ‌రువు త‌గ్గి లుక్ మార్చుకునే ప‌నిలో ఉన్నారు మ‌రి. దీని త‌ర్వాత అనుష్క తెలుగులో ఏ సినిమా చేస్తారోన‌ని ఆమె అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.