English | Telugu

మహేష్ మ్యాజిక్ కి 25 ఏళ్ళు!

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా సినీ పరిశ్రమకు పరిచయమైన మహేష్ బాబు (Mahesh Babu).. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. కథానాయకుడిగా ఆయన సినీ పరిశ్రమకు పరిచయమై.. నేటితో 25 ఏళ్ళు.

బాల నటునిగా పలు సినిమాల్లో నటించి మెప్పించిన మహేష్.. 'రాజకుమారుడు' సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీ దత్ నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్.. 1999 జూలై 30న విడుదలై మంచి విజయం సాధించింది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఈ చిత్రం ఆకట్టుకుంది. ఇక 'రాజకుమారుడు' అనే టైటిల్ కి తగ్గట్టుగానే నిజంగానే రాజకుమారుడిలా ఉన్నాడనే పేరుని మహేష్ తెచ్చుకున్నారు. మహేష్ అందానికి, ఆయన నటనకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ప్రీతి జింటా హీరోయిన్ గా నటించిన 'రాజకుమారుడు' చిత్రంలో ప్రకాష్ రాజ్, సుమలత, శ్రీహరి, ప్రసాద్ బాబు, బ్రహ్మానందం, శివాజీ రాజా, అస్రాని, ఎం. ఎస్. నారాయణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కృష్ణ అతిథి పాత్రలో మెరిశారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు విశేష ఆదరణ పొందాయి. "రామసక్కనోడమ్మ చందమామ", "గోదారి గట్టు పైన", "ఇంద్రుడు చంద్రుడు" వంటి పాటలు పెద్ద హిట్ అయ్యాయి. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా జయనన్ విన్సెంట్, ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వరరావు వ్యవహరించారు.

40కి పైగా కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొని, రూ.10 కోట్లకు పైగా షేర్ రాబట్టిన 'రాజకుమారుడు' మూవీ.. హీరోగా మహేష్ కి మంచి స్టార్ట్ ని ఇచ్చింది.