English | Telugu

15 వ‌సంతాల `మ‌ధుమాసం`!

క‌థానాయ‌కుడు సుమంత్ కెరీర్ లో ప్ర‌త్యేకంగా నిలిచే చిత్రాల్లో `మ‌ధుమాసం` ఒక‌టి. మూవీ మొఘ‌ల్ డి. రామానాయుడు నిర్మాణంలో సుమంత్ న‌టించిన ఈ సినిమా.. కొన్ని కేంద్రాల్లో శ‌త‌దినోత్స‌వం జ‌రుపుకుని విజ‌య‌వంత‌మైన చిత్రాల జాబితాలోనూ చేరింది. అంతేకాదు.. సుమంత్ పుట్టిన‌రోజు (ఫిబ్ర‌వ‌రి 9) కానుక‌గా విడుద‌లైన సినిమాగానూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. బ‌ల‌బ‌ధ్ర‌పాత్రుని ర‌మ‌ణి ర‌చించిన ఈ చిత్రానికి చంద్ర సిద్ధార్ధ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో సుమంత్ కి జంట‌గా స్నేహ‌, పార్వ‌తీ మెల్ట‌న్ న‌టించ‌గా చ‌ల‌ప‌తిరావు, క‌విత‌, గిరిబాబు, న‌రేశ్, సూర్య‌, వేణు మాధ‌వ్, ధ‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌మ‌ణ్యం, ఎల్బీ శ్రీ‌రామ్, ఏవీయ‌స్, ర‌విబాబు, ర‌జిత‌, ఉత్తేజ్, సుమ‌న్ శెట్టి ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చారు.

Also Read:'గంగూబాయ్‌'లో ఫస్ట్ లుక్‌ను రివీల్ చేసిన అజ‌య్ దేవ్‌గ‌ణ్‌!

మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత సార‌థ్యంలో రూపొందిన గీతాలకు వేటూరి సుంద‌రరామ్మూర్తి, చంద్ర‌బోస్, సుద్దాల అశోక్ తేజ‌, పెద్దాడ‌మూర్తి సాహిత్య‌మందించారు. ``ఊహ‌లే``, ``వ‌సంతం``, ``ఓణి మెరుపులు``, ``ప్రామిస్ చేస్తూఉన్నా``, ``వేలంటైన్``, ``దేవ‌దాసు క‌న్న‌``.. ఇలా ఇందులోని పాట‌ల‌న్నీ సంగీత‌ప్రియుల‌ను రంజింప‌జేశాయి. 2007 ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌లై ప్రజాద‌ర‌ణ పొందిన `మ‌ధుమాసం`.. నేటితో 15 వ‌సంతాలు పూర్తిచేసుకుంది.