English | Telugu

తెలంగాణాలో ఘోరం! రోడ్డుపైనే క‌రోనా ల‌క్ష‌ణాల‌తో నేపాలీ వృద్ధుడి మరణం!

త‌న ప్రాణాలు కాపాడుకోవ‌డానికి ఆ వృద్ధుడు ఆసుప‌త్రుల చుట్టూ తిరుగుతూనే క‌నీస వైద్యం అంద‌కుండా రోడ్డు పైనే దారుణంగా త‌నువు చాలించాడు. ఇట‌లీని త‌ల‌పించేలా జ‌రిగిన ఈ ఘోరం ప్ర‌భుత్వానికి స‌వాల్ విసురుతోంది. లాలాపేట ఆసుప‌త్రి, గాంధీ ఆసుప‌త్రి, కింగ్ కోఠి ఆసుప‌త్రి ఎవ‌రూ అడ్మిట్ చేసుకోలేదు. అంద‌రూ క‌రోనా లక్ష‌ణాలు వున్నాయ‌ని నిర్ధారించారు కానీ పేషంట్‌ను జాగ్ర‌త్త‌గా డీల్ చేయ‌లేదు.

కరోనా లక్షణాలతో నేపాల్‌కు చెందిన ఓ వృద్ధుడు రోడ్డుపైనే ప్రాణాలు వ‌దిలాడు. హాస్పిటల్ నుంచి నడుచుకుంటూ వస్తూ నారాయణగూడ పరిధిలోని శాంతి థియేటర్ వద్ద పడిపోయి ప్రాణాలు వ‌దిలాడు.

నేపాల్‌కు చెందిన ఈ 70 ఏళ్ల బహదూర్ లాలాపేటలోని ఓ బార్‌లో పని చేస్తాడు. జలుబు, దగ్గు కారణంగా లాలాపేట హాస్పిటల్‌కు వెళ్లగా.. కరోనా అనే అనుమానంతో గాంధీ హాస్పిటల్‌కి వెళ్లాలని సూచించారు.

జలుబు, దగ్గుతో బాధపడుతూనే బహదూర్ గాంధీ హాస్పిటల్‌కు వెళ్లాడు. అక్కడ అతడ్ని కింగ్ కోఠీ హాస్పిటల్‌కు వెళ్లమని వైద్యులు సూచించారు.

అక్కడి నుంచి కింగ్ కోఠీకి వెళ్ళాడు. కింగ్ కోఠీ హాస్పిటల్‌కు వెళ్లగా.. కరోనా లక్షణాలు ఉన్నాయని, హాస్పిటల్‌లో చేర్చుకోలేమని అక్క‌డి వైద్యులు స్పష్టం చేశారు.
అంబులెన్స్ సమకూరుస్తామని చెప్పడంతో చాలా సేపటి వరకు ఆయన అక్కడే నిరీక్షించాడు. ఎంతకీ అంబులెన్స్ రాలేదు.

మళ్లీ నడుచుకుంటూ గాంధీ హాస్పిటల్‌కు తిరిగి బయల్దేరాడు. గాంధీకి తిరిగొస్తూ మార్గం మధ్యలో నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని శాంతి థియేటర్ వద్ద కుప్పకూలి పోయాడు. అక్క‌డే రోడ్డుపైన ప్రాణాలు వ‌దిలాడు.

గురువారం రాత్రంతా మృతదేహం రోడ్డుపైనే పడి ఉంది. శుక్ర‌వారం తెల్ల‌వారుఝామున రోడ్డుపై అటుగా వెళ్తున్న వారు రోడ్డుపై ఓ వ్యక్తి పడి ఉన్నాడని పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం దగ్గర కింగ్ కోఠీ హాస్పిటల్ పత్రాలు ఉండటాన్ని గమనించిన పోలీసులు అతడు హాస్పిటల్‌కు వెళ్లినట్లు నిర్ధారించారు. మృతదేహం నుంచి శాంపిళ్లను సేకరించిన వైద్య సిబ్బంది పరీక్షలకు పంపారు.

ఈ వృధ్ధుడి మృతికి ఎవ‌రిది నిర్ల‌క్ష్యం. ఇత‌ని ద్వారా ఎంత మందికి క‌రోనా వ్యాపించి వుండ‌వ‌చ్చు. తెలంగాణా ప్ర‌భుత్వం దీన్ని సీరియ‌స్‌గా తీసుకుంటుందా?