English | Telugu

కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ తీసేయగలరా?!

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పు విషయంలో కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్ర ఆగ్రహం, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గ్రామీణ భారతం ఆకలితో అలమటించేలా కేంద్రంలోని మోడీ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటోందంటూ దుమ్మెత్తి పోస్తున్నాయి. కేంద్రం ఈ పథకంలో ఉన్న లోపాలనుసవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది.

అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది. పేదలకు ఉపాధి కల్పించే బాధ్యత నుంచి వైదొలగుతోందని దుమ్మెత్తి పోస్తున్నది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బీజేపీకి ఓ సవాల్ విసిరారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగిస్తున్నారు సరే.. భారత కరెన్సీ నోట్ల మీద నుంచి గాంధీ బోమ్మను తొలగించగలరా? అని చాలెంజ్ చేశారు. బీజేపీ ప్రమాదకరమైన ఆట ఆడుతోందనీ, దేశ సమగ్రత, సామరస్యానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నదని డికే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.