
ఎంపీ రాఘవ్ చద్దాపై వేటు వెనుక అసలు కారణాలేంటి?
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి. గతంలో పార్టీకి వెన్నెముకగా, కేజ్రీవాల్‌కు అత్యంత ఆప్తుడిగా ఉన్న రాఘవ్ చద్దాపై ఇప్పుడు పార్టీ నాయకత్వమే విమర్శలు గుప్పించడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ పరిణామాలపై రాఘవ్ చద్దా స్పందిస్తూ.. తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని, ఇది తనను అణచివేసేందుకు జరుగుతున్న కుట్ర అని కొట్టిపారేశారు. రాజకీయ పరిస్థితి : ఆప్ వర్సెస్ రాఘవ్ చద్దారాజ్యసభలో ఆప్ డెప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దాను తొలగించి, ఆయన స్థానంలో అశోక్ మిట్టల్‌ను నియమించడంతో ఈ వివాదం మొదలైంది. అంతేకాకుండా, రాజ్యసభలో పార్టీ కోటా నుంచి చద్దాకు మాట్లాడే అవకాశం ఇవ్వవద్దని పార్టీ సెక్రటేరియట్‌కు లేఖ రాయడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. పంజాబ్ సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించలేదని, ప్రతిపక్షాల వాకౌట్లో పాల్గొనలేదని మరియు ప్రధానమంత్రిపై విమర్శలు చేయడానికి భయపడుతున్నారని పంజాబ్ ఆప్ నాయకులు ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు. దీనికి ప్రతిగా చద్దా ఒక వీడియో విడుదల చేస్తూ, "నేను గాయపడ్డాను, అందుకే మరింత ప్రమాదకరంగా మారాను" అంటూ హెచ్చరించారు. పార్లమెంట్లో తాను లేవనెత్తిన అంశాల ట్రాక్ రికార్డ్ చూడాలని, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాలని ఆయన సవాల్ విసిరారు. తన గొంతు నొక్కడమే లక్ష్యంగా ఈ "స్క్రిప్టెడ్" ప్రచారం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.వ్యూహం మరియు అంతరార్థంఈ పరిణామాల వెనుక లోతైన రాజకీయ వ్యూహాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి పార్టీ నియంత్రణ : 2025 ఢిల్లీ ఎన్నికల తర్వాత పార్టీలో అంతర్గత ప్రక్షాళన జరుగుతున్నట్లు కనిపిస్తోంది. కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నాయకులను పక్కన పెట్టడం ద్వారా పార్టీపై పట్టు సాధించే ప్రయత్నం జరుగుతోంది. క్రమశిక్షణ పేరుతో ప్రక్షాళన: రాఘవ్ చద్దా తన వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీ ఎజెండాను పక్కన పెట్టారని ఆరోపించడం ద్వారా ఆయనను నైతికంగా దెబ్బతీసే వ్యూహం కనిపిస్తోంది. పంజాబ్ సెంటిమెంట్: పంజాబ్ నుంచి ఎన్నికైన ఎంపీగా ఆయన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేదని ఆరోపించడం ద్వారా, పంజాబ్ కేడర్‌లో ఆయనపై వ్యతిరేకత పెంచేలా పార్టీ పావులు కదుపుతోంది.భవిష్యత్తు రాజకీయ ప్రభావంఈ వివాదం ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. రాఘవ్ చద్దా వంటి యువ మరియు విద్యావంతుడైన నాయకుడు పార్టీకి దూరం కావడం జాతీయ స్థాయిలో ఆప్ ఇమేజ్‌కు నష్టం కలిగించవచ్చు. ఇప్పటికే ఆయన తన సోషల్ మీడియా బయో నుంచి 'AAP' పేరును తొలగించడం, ఆయన పార్టీని వీడతారనే ఊహాగానాలకు బలాన్నిస్తోంది. ఒకవేళ చద్దా పార్టీని వీడి బీజేపీలో చేరితే, అది ఆప్‌కు పెద్ద దెబ్బ అవుతుంది. ముఖ్యంగా ఢిల్లీ మరియు పంజాబ్ రాజకీయాల్లో కేజ్రీవాల్ వ్యూహాలను ఎరిగిన నాయకుడు ప్రత్యర్థి పక్షంలో ఉండటం ఆప్‌కు సవాలుగా మారుతుంది. మరోవైపు, పార్టీలో ఉంటూనే తిరుగుబాటు బావుటా ఎగురవేస్తే, అది అంతర్గత కుమ్ములాటలకు దారితీసి కేడర్ మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. ఏది ఏమైనా, "బ్లూ ఐడ్ బాయ్" నుంచి "రెబెల్" గా మారిన చద్దా ఉదంతం భారత రాజకీయాల్లో ఆసక్తికర మలుపుగా మారింది.
Apr 05, 2026
నెల్లూరు నేతలను గాడిన పెడుతున్న చంద్రబాబు!
- నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం దారి తప్పిందని ముఖ్యమంత్రికి అర్ధమైంది - మంత్రి నారాయణ, ఎమ్పీ విపిఆర్‌లకు బాధ్యతల నుంచి విముక్తి - ఉదయగిరి ఎమ్మెల్యేకి తల వాచే చీవాట్లు - సూళ్లూరుపేట నేతలకు పదునైన చురకలు - దేముళ్ల సేవతో సరిపెట్టుకోవద్దని రామనారాయణరెడ్డికి సూచన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా మీద సునిశిత దృష్టి సారించినట్లు అర్థమవుతున్నది. నెల్లూరు జిల్లా సాధారణంగా సామాజిక పరిస్థితుల దృష్ట్యా వైకాపాకు బలమైన స్థావరం. కానీ మొన్నటి ఎన్నికలలో పదికి పది స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నది. అదొక విచిత్రం. అన్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది. అంటే.. తెలుగుదేశం ఎమ్మెల్యేలు లేదా ఎంపీలలోనే తమ భవిష్యత్ మీద నమ్మకం సడలిందన్న మాట. అదేమీ ఒకరు చేసే ఆరోపణ కాదు. కళ్ల ముందు కనిపిస్తున్న సత్యం. దేనివల్ల ఈ పరిస్థితి? 30 నుంచి 75 వేల మెజారిటీతో తెలుగుదేశం ఎమ్మెల్యేలను గెలిపించిన నెల్లూరు జిల్లా ఓటర్లకు అప్పుడే ముఖం మొత్తిందా? పార్టీ మీద లేదా పదవులలో వున్న వారి మీద విరక్తి జనించిందా? అందుకు కారణం ఏమిటి? జిల్లా పరిస్థితి బాగా లేదన్న వార్తలు ముఖ్యమంత్రి చెవికి కూడా చేరినట్లున్నాయి. పడవకు పడిన లేదా పడుతున్న చిల్లుని, చిన్నదిగా వున్నప్పుడే పూడ్చకుంటే, మొత్తం పడవే మునిగిపోతుందన్న ఆలోచనతోనే, నెల్లూరు జిల్లా మీద చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించినట్లున్నారు. ఈ వారంలో రెండు ఊళ్లకు వచ్చారాయన. ఈ రెండు ఊళ్లను ఎంపిక చేసుకోవడంలో ఏదో ఒక పరమార్థం వుందని భావించాలి. మొదట సూళ్లూరుపేట. ఎమ్మెల్యే విజయశ్రీ మీద తనకు సదభిప్రాయం వుందనే సూచన ఇచ్చాడు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎంబిబిఎస్ చదివిన ఉన్నత విద్యావంతురాలిగానే కాకుండా, నిరంతరం నవ్వుముఖంతో కనపడడం విజయశ్రీ విలక్షణత. ఎవరినైనా నవ్వుతోనే పలకరిస్తారు. ఆమె మీద ఆరోపణలు లేవు. అయితే సూళ్లూరుపేట నుంచి మద్రాసు నగరానికి ఎర్ర గులక, ఇసుక ఎవరు దొంగ రవాణా చేస్తున్నారో నాకు తెలుసు, వారీ అక్రమాలు తక్షణమే నిలిపివేయండి అని గట్టిగానే హెచ్చరిక చేశారు. ఎవరికి తగలాలో వారికి ఆ మాటల శూలం బలంగా గుచ్చుకున్నది. గుండె కలుక్కుమన్నది. లక్షల రూపాయల అక్రమ రాబడి ఆగిపోతుందనుకునే బాధే కదా పాపం. పనిలో పనిగా, విజయశ్రీ తండ్రి నెలవల సుబ్రహ్మణ్యానికి కూడా, ఇక నువ్వు రిటైర్ అయితే బాగుంటుందని నవ్వుతూనే సలహా ఇచ్చారు. ఆ మాటలో పరుషత్వం లేకపోవడంతో నెలవల సంతోష పడిపోయాడు. సూళ్లూరుపేట ఎస్సి నియోజకవర్గం కావడం, ఎమ్మెల్యే పసిపిల్ల కావడంతో ముదురు మనుషులు పెత్తనం చలాయిస్తున్నారు. అది కూడా ముఖ్యమంత్రికి సమాచారం అందినట్లుంది. కలెక్టర్, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడట, ఒక్క ఎమ్మెల్యే నుంచి వచ్చే సిఫార్సులు తప్ప ఇతరులెవరి మాటా మీరు వినాల్సిన అవసరం లేదని. ఈ మాటకు కొందరి ముఖాలలో గంటు పడింది. వెంటనే.. వింజమూరు. అక్కడికి రాకముందే స్థానిక పరిస్థితుల మీద సమగ్ర అవగాహన తెచ్చుకున్నట్లున్నారు చంద్రబాబు. ఏకంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మీద చర్నాకోళ ఝుళిపించారు. వాతలు పడేట్లు, మాటలు విసిరారు. రేపటి ఎన్నికలలో రాష్ట్రంలో 175 మంది తెలుగుదేశం అభ్యర్థులు గెలిస్తే, నువ్వు 172 వాడిగా ఉంటావు. ఇంత తక్కువ వ్యవధిలో అంత చెడ్డ పేరు తెచ్చుకోవడం నేను ఎక్కడా చూడలేదు. నీ సొంత సామాజిక వర్గం కూడా నిన్ను సమర్థించడం లేదు. పార్టీ కార్యకర్తలందరూ విసిగిపోయి వున్నారు. తీరు మార్చుకోవడానికి మూడు నెలల గడువు ఇస్తున్నాను, మారితే మర్యాదగా వుంటుంది, లేకుంటే చర్యలు వేరేగా వుంటాయని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఇదేదో గదిలోకి పిలిచి, ఎవరూ వినకుండా హితబోధ చేసి వుంటే గౌరవంగా వుండేది.. కానీ, కార్యకర్తల సమావేశంలో అందరి సమక్షంలో తూర్పార పట్టడం వల్ల, పాపం కాకర్ల సురేష్ నిరుత్తరుడైపోయారు. ఉదయగిరి కార్యకర్తలు మాత్రం పండుగ చేసుకున్నారు. ఇక జిల్లాకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన సవరణలు చేయడానికి ముఖ్యమంత్రి సిద్ధపడినట్లు తెలుస్తున్నది. అందులో ఓం ప్రథమంగా మంత్రి నారాయణకు, ఎమ్పీ విపిఆర్‌కు, మీ పనులు మీరు చేసుకోండి, జిల్లా బాధ్యత వదిలి పెట్టేయండి అని సూచించారట. ఈ సూచన సున్నితంగా, మనసు నొచ్చుకోకుండా ఉందని చెబుతున్నారు. మరి జిల్లా బాధ్యత ఎవరిది? ఆ బరువు మరొక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి భుజాలపై పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పుడూ దేముళ్లు, దేవాలయాలేనా.. అప్పుడప్పుడైనా రాజకీయాలు కూడా చూసుకోవాలి కదా అని సుతారంగా మందలించారని వినికిడి. దానిలో నువ్వే ఈ భారం మోయాలి అనే సూచన వుందని మనం భావించవచ్చు. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో పట్టుజారక ముందే పరిస్థితులు చక్కదిద్దాలనే ఆలోచన ముఖ్యమంత్రి స్థాయిలో కలగడం కార్యకర్తలకు సంతోషం కలిగిస్తున్నది. ఆ మాత్రం రాజకీయ సవరణలు చేపడితే, పదికి పది గెలవకపోయినా, పదికి పది కోల్పోయే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. జమీన్ రైతు సౌజన్యంతో
Apr 04, 2026
మావి‘గన్’ పేలదు.. డీవీ శ్రీనివాస్ విశ్లేషణ
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం అమరావతి రాజధాని అంశం కేంద్ర బిందువుగా మారింది. పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదం పొందుతున్న తరుణంలో, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తెరపైకి తెచ్చిన మావిగన్ కాన్సెప్ట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. సీనియర్ జర్నలిస్ట్ డి.వి. శ్రీనివాస్ విశ్లేషణ ప్రకారం, జగన్ వ్యూహం వెనుక కేవలం రాజకీయ ఉనికిని చాటుకునే ప్రయత్నం మాత్రమే కనిపిస్తోంది. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. అయితే.. అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రైతుల సమస్యలను విస్మరించిన జగన్.. ఇప్పుడు అకస్మాత్తుగా శేషగిరమ్మ వంటి వృద్ధులను కలవడం విమర్శలకు తావిస్తోంది. జగన్ అకస్మాత్తుగా రైతుల పక్షపాతిగా మారడం వెనుక ఒక వ్యూహం ఉందని సీనియర్ జర్నలిస్ట్ డీవీశ్రీనివాస్ అంటున్నారు. అమరావతి ప్రాంతంలో కోల్పోయిన ఓటు బ్యాంకును, కనీసం ఈ మావిగన్ ప్రాంతంలోని పట్టణ ఓటర్లను ఆకర్షించడం ద్వారా దక్కించుకోవాలని ఆయన భావిస్తున్నారు. అయితే.. గతంలో అమరావతి రైతులపై జరిగిన దాడులు, మహిళా రైతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ప్రజలు అంత సులభంగా మర్చిపోలేరని, మరచిపోరనీ డీవీ శ్రీనివాస్ చెబుతున్నారు. అమరావతి నిర్మాణానికి వేల కోట్లు ఖర్చవుతాయని, అది సాధ్యం కాదని ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో అయోమయం సృష్టించడమే వైసీపీ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోందంటున్నారాయన. అమెరికాలో ఒక పోలీసు అధికారి బూటు కాలితో తొక్కడం ఎలాగైతే ఒక ప్రభుత్వం పతనానికి దారితీసిందో, ఏపీలో కూడా రైతు కుటుంబాల పట్ల జరిగిన దుశ్చర్యలే గత ఎన్నికలలో జగన్ ఓటమికి ప్రధాన కారణమని గుర్తు చేసిన డీవీ శ్రీనివాస్.. ఇప్పుడు మావిగన్ పేరుతో ముందుకు రావడం అనేది కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నమే తప్ప, వాస్తవిక అభివృద్ధికి సంబంధించినది కాదని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో అమరావతి నిర్మాణం వేగవంతమైతే, జగన్ ప్రతిపాదించిన మావిగన్ మంత్రం ఫలించే అవకాశమే లేదన్నారాయన. ప్రభుత్వం మానవీయ కోణంలో రైతుల సమస్యలను పరిష్కరిస్తే.. జగన్ ఆరోపణలకు బలం ఉండదు. ఒకవేళ వైసీపీ తన మొండి వైఖరిని వీడకుండా, కేవలం విమర్శలకే పరిమితమైతే, ఉత్తరాంధ్ర మరియు రాయలసీమలో కూడా ఆ పార్టీకి ఉన్న అంతంత మాత్రం పట్టు కూడా సడిలిపోతుందని అన్నారు డీవీ శ్రీనివాస్. రాబోయే ఎన్నికల నాటికి అమరావతి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశంగా మారుతుందని చెప్పారు.
Apr 04, 2026
మావిగన్.. జగన్ ప్రతిపాదనకు అంబటి భజన.. పెరుగుతోందట ప్రజాదరణ
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అధికారికంగా ఖరారు చేస్తూ పార్లమెంట్ చట్ట సవరణకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో వైసీపీ నేతల వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మావిగన్' ప్రతిపాదనను సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతికి ప్రత్యామ్నాయంగా మావిగన్ అంటూ కొత్త ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వస్తున్నప్పటికీ, ఈ ప్రతిపాదన చేసిన జగన్ నెట్టింట ఓ ట్రోలింగ్ మెటీరియల్ గా మారిపోయినప్పటకీ.. వైసీపీ సీనియర్ నాయకుడు, కోఆర్డినేటర్ సజ్జల, మాజీ మంత్రి అంబటి రాంబాబు వంటి వారు మాత్రం మావిగన్ ను భుజాలకెత్తుకున్నారు. వీరిలో అంబటి రాంబాబు ఒక అడుగు ముందుకు వేసి మావిగన్ కు రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతోందని చెప్పుకొచ్చారు. అమరావతి నిర్మాణం అనేది ఎప్పటికీ పూర్తికాని ప్రక్రియ అని, అది ఒక కలగానే మిగిలిపోతుందని ఈ సందర్భంగా అంబటి వ్యాఖ్యానించారు. పార్లమెంట్ లో బిల్లు పాస్ అయితే ఏమౌతుంది.. , భవిష్యత్తులో మా ప్రభుత్వం వచ్చి మళ్లీ సవరణలు చేస్తుందంటూ తన వాచాలత్వాన్ని అంబటి ప్రదర్శించారు. అంబటి వ్యాఖ్యలపై ఒక రాజధాని అమరావతి ప్రాంతంలోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది. అమరావతి రాజధానిగా స్థిరపడిందని మెజారిటీ ప్రజలు భావిస్తుంటే, వైసీపీ మాత్రం రోజుకో మాట, పూటకో ప్రతిపాదనతో ప్రతిష్ఠను మరింత దిగజార్చుకుంటోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. అమరావతికి వ్యతిరేకంగా ప్రజల వద్ద మాట్లాడడానికే ఇబ్బందిగా ఉందని క్యాడర్ ఓ వైపు నెత్తీనోరూ బాబుకుంటుంటే.. ఆ పార్టీ కోఆర్డినేటర్, జగన్ ప్రభుత్వ హయాంలో ముఖ్యసలహాదారు, సకలశాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి మావిగన్ ప్రతిపాదన ప్రతి పల్లెకూ చేరేలా ప్రచారం చేయాలంటూ పిలుపునివ్వడం చూస్తుంటే జనం నుంచి వ్యక్తమౌతున్నఆగ్రహం, క్యాడర్ వ్యతిరేకత వైసీపీయులు చూడకుండా పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతున్నచందంగా వ్యవహరిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.
Apr 04, 2026
అప్పుడు వైసీపీ మంత్రి చేయి చేసుకున్నాడు.. మండలి మాజీ చైర్మన్
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతే అంటూ ప్రవేశపెట్టిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో మంగళగిరిలోని తెలుగుదేశ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఘనంగా వేడుకలు జరిగాయి. ఆ వేడుకలకు హాజరైన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లు సమయంలో జరిగిన పరిణామాలపై స్పందించారు. కెమెరాలు కట్ చేసి చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన తొలిసారి పెదవి విప్పారు. ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు. తన దగ్గర డబ్బు లేదు కాబట్టి బతుకుదెరువు చూపిస్తామని ప్రలోభ పెట్టారని, మండలినే రద్దు చేస్తామని బెదిరించారని నాటి వైసీపీ ఘాతులకాలను వివరించారు. అయినా తనకున్న అధికారంతో మూడు రాజధానుల బిల్లు ఆమోదించలేదని షరీఫ్ సగర్వంగా చెప్పారు. నమాజ్ చేసుకుని అల్లాని ప్రార్థించుకుని 'అల్లా సత్యం వైపు ఉండేటట్లుగా నా కళ్లు తెరువు' అని కోరారన్నారు. ఎన్ని ఒత్తిడిలు ఉన్నా.. బెదిరించినా ధర్మం వైపు నిలబడాలనే అల్లా మాటలకు ఆరోజు కట్టుబడి ఉన్నా. ఆ తర్వాతా తనన న్ను చైర్మన్ స్థానం నుంచి దింపేందుకు అనేక కుట్రలు చేశారని, ఇప్పుడు అమరావతి రాజధానిగా చట్టం చేయడం ఆనందంగా ఉందని నాడు జరిగిన సంఘటనలు గుర్తు చేసుకున్నారు
Apr 03, 2026.webp)
అమరావతిని శాసనంతో నిలబెట్టాం.. చంద్రబాబు
అమరావతిని వైసీపీ నాశనం చేయాలని చూస్తే.. తాము శాసనం చేసి నిలబెట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. అమరావతికి పార్లమెంట్ ఉభయ సభల్లోనూ అమరావతికి చట్టబద్ధత లభించడం ప్రజా విజయమన్నారు. అమరావతిలో శుక్రవారం (ఏప్రిల్ 3) మీడియాతో మాట్లాడిన చంద్రబాబు పార్లమెంటు ఉభయ సభల్లోనూ 35 మంది వరకు ఎంపీలు అమరావతికి మద్దతుగా మాట్లాడారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఆధారంగా గుంటూరు - విజయవాడ మధ్య రాజధాని ఉంటే బాగుంటుందని అందరూ అన్నారని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రం మధ్యలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ ప్రాంతానికి రాజకీయ, సాంస్కృతిక ప్రాధాన్యం ఉందన్నారు. సమృద్ధిగా నీరు, సారవంతమైన భూములు ఉన్నాయన్నారు. ఆనాడు అసెంబ్లీలో వైసీపీ కూడా రాజధానిని సమర్థించిందని... కనీసం 30 వేల ఎకరాలు ఉండాలని జగన్ చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Apr 03, 2026
రాజకీయ నాయకులకు డ్రగ్స్ టెస్టులు తప్పనిసరి చేయాలి!
రాజకీయాలు, అవినీతి, సామాజిక అంశాలపై ప్రముఖ జర్నలిస్ట్, జమీన్రైతు సంపాదకులు డోలేంద్ర ప్రసాద్‌తో కలిసి తెలుగువన్ ఎండి కె. రవిశంకర్ నిర్వహిస్తున్న సంచలనాత్మక చర్చా కార్యక్రమం వాస్తవ వేదిక విజయవంతంగా కొనసాగుతోంది. తాజా సంచికలో తెలుగు రాజకీయాల్లో డ్రగ్స్ ప్రకంపనలపై విస్తృతంగా చర్చించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు. రాజకీయ నేతలు సమాజానికి రోల్ మోడల్స్‌గా ఉండాల్సిన తరుణంలో, వారిపై ఇటువంటి ఆరోపణలు రావడం ఆందోళనకరమన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వాలు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌లను ఏర్పాటు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు ఈ వ్యసనం బారిన పడటం ఆందోళనకరమన్నారు. ఇక రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికి వాడుకుంటున్నాయే తప్ప, మూలాల నుంచి ఈ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేయడం లేదన్నారు. ప్రస్తుతం రాజకీయ నాయకులు, వారి అనుచరులు డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్నప్పుడు, అది మీడియా చర్చలకే పరిమితమవుతోంది తప్ప వారికి కఠినమైన శిక్షలు పడిన దాఖలాలు దాదాపు లేదన్నారు. డ్రగ్స్ మాఫియాను అరికట్టడానికి కేవలం పోలీసు చర్యలు సరిపోవనీ, ఇందులో వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల ప్రమేయం ఉండటం వల్ల డ్రగ్స్ కేసుల విచారణలు తరచుగా నీరుగారిపోతున్నాయని డోలేంద్రప్రసాద్, రవిశంకర్ లు అభిప్రాయపడ్డారు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే.. డ్రగ్స్ వినియోగాన్ని చట్టపరంగా తీవ్రమైన నేరంగా పరిగణించకపోవడం కూడా డ్రగ్స్ వినియోగం నిర్మూళనకు అడ్డంకిగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుత చట్టాల ప్రకారం డ్రగ్స్ అమ్మడం నేరం కానీ, తీసుకోవడం పెద్ద నేరంగా పరిగణించడం లేదనీ, దీనివల్ల నిందితులు సులభంగా బయటపడే అవకాశం ఉందన్నారు. రాజకీయ పార్టీలు ఇప్పుడు ఒక నూతన వ్యూహాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తులను ప్రకటించినట్లే, తాము డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉన్నామని నిరూపించుకోవడానికి డోప్ టెస్ట్' నివేదికలను సమర్పించే నిబంధనను తీసుకురావాలని చెప్పారు. ప్రజా ప్రతినిధులుగా ఉండేవారు ప్రతి ఆరు నెలలకోసారి రక్త పరీక్షలు చేయించుకుని, ఆ నివేదికలను బహిరంగపరచడం ద్వారా పారదర్శకతను పెంచాల్సి ఉందన్నారు. ఇది ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఒక సానుకూల సందేశాన్ని పంపుతుందన్నారు. రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో నైతిక విలువలకు పెద్దపీట వేయాలని రవిశంకర్ పేర్కొన్నారు. డ్రగ్స్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న వారిని రాజకీయాల నుంచి బహిష్కరించడం లేదా ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే రాజకీయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని అభిప్రాయ పడ్డారు. పంజాబ్ రాష్ట్రం ఎదుర్కొన్న 'ఉడ్తా పంజాబ్' వంటి దుస్థితి తెలుగు రాష్ట్రాలకు రాకూడదంటే, రాజకీయ నేతలు స్వచ్ఛందంగా సంస్కరణలకు శ్రీకారం చుట్టాలనీ, రాజకీయాలు కేవలం అధికారం కోసమే కాకుండా, సామాజిక బాధ్యతను నెరవేర్చే వేదికలుగా మారినప్పుడే ఈ డ్రగ్స్ మహమ్మారిని అంతం చేయడం సాధ్యమౌతుందనీ డోలేంద్రప్రసాద్, రవిప్రసాద్ లు పేర్కొన్నారు.
Apr 03, 2026
రాజకీయంగా ఎదుర్కోలేకే.. జగనాయగన్ విడుదలకు బ్రేకులు.. టీవీకే విజయ్ సంచలన ఆరోపణ
తమిళనాట ఎన్నికల వేడి పీక్స్ చేరింది. ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ హీట్ రోహిణీకార్తె ఎండలను తలపింప చేస్తున్నది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ . ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ సంచలన ఆరోపణలు చేశారు. తన తాజా చిత్రం జననాయగన్ విడుదల ఆగడం వెనుక తన రాజకీయ ప్రస్థానాన్ని అడ్డుకునేం కుట్రలు ఉన్నాయన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు. కరూర్ తొక్కిసలాట ఆ బాధితులకు ఏ విధంగా అయితే న్యాయం జరగాలని కోరుకుంటున్నానో.. అలాగే జననాయగన్ విషయంలో తనకు కూడా న్యాయం కావాలని డిమాండ్ చేశారు. కేవలం సినిమా గురించే కాకుండా.. విజయ్ తన ప్రచారంలో ప్రజా సమస్యలపై కూడా గట్టిగా గళం వినిపిస్తున్నారు. దేశవ్యాప్తంగా వేధిస్తున్న ఎల్పీజీ సిలిండర్ల కొరతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన కుటుంబానికి చిన్న ఇబ్బంది కలిగినా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వెంటనే ఢిల్లీకి పయనం అవుతారని, మరి సామాన్యులను ఇబ్బంది పెడుతున్న గ్యాస్ సిలిండర్ల సమస్యను పరిష్కరించడానికి ఎందుకు కేంద్రంతో చర్చలు జరపడం లేదని నిలదీశారు. నటుడిగా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న విజయ్ పొలిటీషియన్ గా ఏ మేరకు సక్సెస్ అవుతారో ఈ ఎన్నికలు తేలుస్తాయని పరిశీలకులు అంటున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన పెరంబూర్ , తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తిరుచ్చి ఈస్ట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే, సినిమా విడుదలకు ఆటంకాలు కల్పించడం ద్వారా తన రాజకీయ మైలేజీని తగ్గించాలని ప్రత్యర్థులు చూస్తున్నారన్న విజయ్ వ్యాఖ్యలు ప్రజలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న ఉత్కంఠ వ్యక్తం అవుతోంది.
Apr 03, 2026.webp)
మావిగన్ వదిలేసి.. కమ్మరావతి అంటారేంటి విజయసాయీ!?
విజయ్ సాయిరెడ్డి మళ్లీ తెరపైకి వచ్చారు. ఇన్నాళ్ల పాటు వ్యవసాయమే నా వ్యాపకం, జీవన పరమార్ధం అంటూ కబుర్లు చెప్పిన విజయసాయిరెడ్డి.. పార్లమెంటు అమారావతి చట్టబద్ధతకు సంబంధించిన బిల్లును ఆమోదించిన వెంటనే సామాజిక మాధ్యమంలో క్యాస్ట్ రిలేటెడ్ పోస్టుతో రంగంలోకి దిగారు. విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటు ఉభయ సభలూ ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లును ఇలా ఆమోదించాయో లేదో అలా ఆయన అమరావతి ని కమ్మరావతి కాకుండా చూసుకోండి ఫస్ట్ అంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ రెండు విషయాలు ప్రముఖంగా ప్రస్తావించాలి. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలోనూ లేరు. అసలు రాజకీయాలలోనే లేరు. వైసీపీకి రాజీనామా చేస్తున్నపుడు విజయసాయి ఇదే చెప్పారు. అన్నీ వదిలేసి తాను వ్యవసాయం చేసుకుంటానన్నారు.. అలాంటి వ్యవ-సాయిరెడ్డి అప్పుడప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేయడం వార్తల్లోకి రావడం తరచూ జరుగుతూనే ఉంది. బేసిగ్గా తాను రాజకీయ పార్టీ పెడతానో లేదో తెలీదుగానీ మీడియా సంస్థనైతే పెడతానని అన్నారు విజయసాయిరెడ్డి. అది కూడా ఎందుకులే.. ఖర్చు దండగ అనుకున్నారో ఏమో.. ఫ్రీగా ఒక ట్వీట్ పడేస్తే పోతుందనే కాడికి వచ్చేశారాయన. నిజంగానే ఆయనకు తెలుగు సమాజం మీద అంతటి ప్రేమాభిమానాలే ఉంటే.. ఆ విధానం వేరుగా ఉండేది. ఇరవై నాలుగ్గంటలూ మీడియాను ఆడిపోసుకునే ఆయన.. ఈ రంగంలోకి దిగి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టేవారు. కానీ ఇప్పటి వరకూ అలాంటిదేదీ చేయకుండా కాసేపు జనసేన అధినేత నాకు ఎప్పటి నుంచో మిత్రుడనడం.. ఇదిగో ఇప్పుడు చూస్తే కమ్మరావతి అంటూ కామెంట్ చేసి.. కులాల కార్చిచ్చు రేపడానికి ప్రయత్నించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. నిజానికి తాను రాజకీయ సన్యాసం చేసినట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్పటికీ ఆయన తన టీం ద్వారా అకౌంట్ సర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జగన్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజయసాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవల జగన్ అర్ధంపర్దం లేకుండా చేసిన మావిగన్ అనే ప్రతిపాదన మీదే. కానీ రేణుక చౌదరి సభలో లేవనెత్తిన కమ్మరావతిని పట్టుకుని.. పోస్టులు పెట్టడం సరికాదంటున్నారు. నిజానికి వీరందరికీ ఎందుకింత కడుపు మంట అంటే, విశాఖ లో అయితే అడిగే వారే ఉండరు. అందుకు వైసీపీ అధికార సమయంలో ఆయన చేసిన భూ దోపిడీయే నిలువెత్తు సాక్షి. అందుకే అందరి అమ్మలాంటి అమరావతిపై ఇలాంటి కామెంట్లు చేసి.. విజయసాయి కడుపు మంట చల్లార్చు కుంటున్నారంటున్నారు. ఏది ఏమైనా విజయసాయి రెడ్డి అటు వాడే కానీ, ఎట్టిపరిస్థితుల్లోనూ ఇటు వాడు కాడన్న మాట మరోమారు నిజమైందనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Apr 03, 2026
వైసీపీని 11 వదలడం లేదుగా.. అమరావతికి పార్లమెంటులో 11 పార్టీలు మద్దతు!
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ అమరావతి బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. అనంతరం ఈ బిల్లును కేంద్రం.. రాష్ట్రపతికి పంపనుంది. ఈ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ విడుదలకానుంది. దీంతో ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి అమల్లోకి రానుంది. ఈ బిల్లు ఆమోదం పొందడంతో.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజ్యసభ చైర్మన్ సి.పి.రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ బిల్లు పాస్ కావడంతో రాజధాని అమరావతిలో సంబరాలు మిన్నంటాయి. అది పక్కన పెడితే.. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి. 17 మంది సభ్యులు చర్చలో పాల్గొన్నారు. అయితే రాజ్యసభలో సైతం ఈ బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి. అలాగే బుధవారం లోక్‌సభలో ఈ బిల్లుపై చర్చ జరిగింది. ఈ చర్చలో కూడా 11 పార్టీలు పాల్గొన్నాయి. అలాగే ఇటీవల ఏపీ అసెంబ్లీలో ఈ బిల్లును ప్రభుత్వం సరిగ్గా 11 గంటల 11 నిమిషాలకు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే అంతకుముందు వైసీపీ కార్యాలయం కోసం పార్లమెంటులో 11 నెంబరు గది కేటాయించారు. దాంతో ఉలిక్కిపడ్డ వైసీపీ ఎంపీలు స్పీకర్ కాళ్లు వేళ్లు పట్టుకుని దాన్ని మార్చుకున్నారు. మొత్తం మీద 11 మంది ఎమ్మెల్యేలున్న జగన్ టీమ్‌ని 11 నంబర్ వదలకుండా వెంటాడుతుండటం సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది.
Apr 02, 2026
రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు.. ఉద్దండరాయుని పాలెంలో చంద్రబాబు
పార్లమెంటు ఉభయ సభల్లోనూ అమరావతి బిల్లు కు ఆమోదం లభించడంతో అమరావతికి చట్టబద్ధత ఇక లాంఛనమే. నేడో రేపో రాష్ట్రపతి సంతకంతో ఇది చట్టరూపం దాలుస్తుంది. ఈ నేపథ్యంలో అమరావతిలో పండుగ వాతావరణం నెలకొంది. గురువారం (ఏప్రిల్ 2) సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు. ఏకైక రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే రోజు వచ్చిందనీ, అలాగే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటును కూడా త్వరలోనే సాకారం చేస్తామని హామీ ఇచ్చారు. ఇక జనసేన నాయకుడు, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే బిల్లు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందడం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ సాధించిన గొప్ప విజయమని కొనియాడారు. ఇక గురువారం (ఏప్రిల్ 2) సాయంత్రం జరిగే సంబరాల్లో జనసేన, బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి.
Apr 02, 2026
అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో నెలకొన్న సుదీర్ఘ అనిశ్చితికి తెరపడింది. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ రూపొందించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026 కు రాజ్యసభ గురువారం (ఏప్రిల్ 2) ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. లోక్‌సభలో ఈ బిల్లు బుధవారం (ఏప్రిల్1) ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాజ్యసభ కూడా ఈ బిల్లకు పచ్చజెండా ఊపడంతో అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత లభించినట్లయింది. ఈ చారిత్రాత్మక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన వెంటనే సభ్యులు హర్షధ్వానాలు చేశారు. జై అమరావతి , జై ఆంధ్రప్రదేశ్ నినాదాలతో సభ మార్మోగింది. ఏపీ ప్రజలకు అద్భుతమైన నూతన రాజధాని నిర్మించుకునే అవకాశం లభించిందని సభాపతి అభినందనలు తెలిపారు. ఈ పరిణామంపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. గడిచిన కొన్నేళ్లుగా రాజధాని విషయంలో సందిగ్ధంలో ఉన్న రైతులకు, ప్రజలకు ఇది పెద్ద ఊరటనిచ్చినట్లయింది. భవిష్యత్తులో అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దబడుతుందని రాష్ట్ర ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొంది గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.
Apr 02, 2026.webp)
అమరావతిపై చర్చ రాజ్యసభలోనూ వైసీపీ వాకౌట్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమరావతి చట్టబద్ధత బిల్లు పై వాడి వేడి చర్చ జరుగుతోంది. లోక్‌సభలో ఇప్పటికే ఈ బిల్లును వ్యతిరేకించిన వైసీపీ రాజ్యసభలో గురువారం (ఏప్రిల్ 2) చర్చ సందర్భంగా కూడా వాకౌట్ చేసింది. సభలో బిల్లుపై చర్చ జరుగుతుండగా వైసీపీ సభ్యులు తమ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. రాజ్యసభలో వైసీపీ పక్ష నేత వైవీ సుబ్బారెడ్డి ఈ సందర్భంగా పార్టీ వైఖరిని స్పష్టం చేశారు. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు. ముఖ్యంగా ఈ బిల్లులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. రాజధాని మౌలిక సదుపాయాల కల్పన కోసమే దాదాపు రూ. 2 లక్షల కోట్లు ఖర్చవుతాయని అంచనాలు చెబుతున్నాయని, ఇప్పటికే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం రూ. 3.40 లక్షల కోట్ల మేర అప్పులు చేసిందని, ఇదే ధోరణి కొనసాగితే భవిష్యత్తులో రాష్ట్ర అప్పులు రూ. 14 లక్షల కోట్లకు చేరుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ఆర్థిక భారాలను దృష్టిలో ఉంచుకునే తాము బిల్లును వ్యతిరేకిస్తున్నామన్నారు.
Apr 02, 2026
అమరావతి రైతులదే ఈ విజయం.. రాజ్యసభలో రేణుకా చౌదరి భావోద్వేగ ప్రసంగం
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై, రాజ్యసభలో గురువారం (ఏప్రిల్ 2)చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఎంపీ రేణుకా చౌదరి ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. అమరావతికి చట్టబద్ధత అమరావతి రైతుల నైతిక విజయంగా అభివర్ణించారు. సుదీర్ఘకాలం పాటు మొక్కవోని దీక్షతో రైతులు చేసిన పోరాటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. రాజధాని ఉద్యమ సమయంలో పాలకులు ప్రయోగించిన అణచివేత చర్యలను ఈ సందర్భంగా రేణుకా చౌదరి గుర్తు చేశారు. మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా రైతులపై పోలీసులు లాఠీచార్జీలు చేసినా, వారు వెనకడుగు వేయకుండా నిలబడ్డారన్న ఆమె, వారి త్యాగాల పునాదులపైనే అమరావతి పునర్నిర్మాణం జరగాలన్నారు. రాష్ట్ర విభజన తర్వాత గత 12 ఏళ్లుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన రేణుకా చౌదరి.. జగన్ సర్కార్ మూడు రాజధానుల విధానం వల్ల రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు తరలిపోయాయి, రాష్ట్ర భవిష్యత్ అంధకారంలో పడిందని విమర్శించారు. కేవలం కాగితాల మీద బిల్లులు పెట్టడం కాకుండా, నిర్దేశిత గడువులోగా అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్నారు. కాగా అమరావతిపై జరిగిన చర్చలో పాల్గొన్న రేణుకా చౌదరి.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకుండా తెలుగు రాష్ట్రాలతో కేంద్రం చెలగాటం ఆడుతోందన్నారు. దుగ్గరాజపట్నం పోర్టు, కడప ఉక్కు కర్మాగారం వంటి కీలక హామీలను పక్కన పెట్టడాన్ని ఎత్తి చూపుతూ విమర్శించారు. మొత్తానికి, అమరావతికి పూర్వ వైభవం రావాలని ఆశిస్తూనే, కేంద్రం తన బాధ్యతను సక్రమంగా నిర్వహించాలన్నారు.
Apr 02, 2026
‘మూడు’ను పట్టుకు వేళాడుతున్న జగన్ రెడ్డి!
వైసీసీ అధినేత జగన్ రెడ్డి ‘మూడు’ పంతం పట్టారా? అంటే అధికారంలో ఉన్నప్పుడూ, ఇప్పుడు అధికారమే కాదు, కనీసం విపక్ష నేత గుర్తింపు కూడా లేకుండా పోయినప్పుడూ కడా ఆయన మూడ్ మూడు మీదే ఉంది. 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టినప్పుడు గతంలో తాను అమరావతికి అసెంబ్లీ వేదికగా సంపూర్ణ మద్దతు ఇచ్చిన విషయాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టి మరీ మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట మొదలెట్టారు. సరే ఆ ఆటలో ఎంత ఘోరంగా పరాజయం పాలయ్యారో 2024 ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడమే తేల్చేసింది. ఇప్పుడు తాజాగా అమరావతికి పార్లమెంటు చట్టబద్ధత కల్పిస్తున్న వేళ ఆయన మరో ‘మూడు’ తో ముందుకు వచ్చారు. సీఎం హోదాలో నాడు అమరావతి శాసన రాజధాని , విశాఖ పరిపాలన రాజధాని , కర్నూలు న్యాయ రాజధాని అంటూ ఓ కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చారు. ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు పడకపోయినా.. అప్పటి వరకూ పరుగెడుతున్న అమరావతి నిర్మాణ పనులను నిలిపివేశారు. అది పక్కన పెడితే అప్పట్లో మూడు రాజధానుల బిల్లును జగన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశం సమర్థవంతంగా అడ్డుకుంది. దాంతో మూడు రాజధానులకు చట్టబద్ధత విషయాన్ని పక్కన పెట్టేసి తన ఇష్టం కనుక మూడు రాజధానులు అనే మూడుముక్కలాటతోనే ఐదేళ్లూ గడిపేశారు. 2024లో ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టిన చందంగా వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదాకు అవసరమైన్ని స్థానాలు కూడా ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా రాజధాని అమరావతిని పట్టాలెక్కించింది. ఓ వైపు పనుల వేగాన్ని పెంచుతూనే.. మరో వైపు ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా అడుగుల వేగం పెంచింది. అమరావతిని ఏపీకి ఏకైక, శాశ్వత రాజధానిగా గుర్తించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో ఓ తీర్మానం ఆమోదించింది. ఆ తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్రం దానికి పార్లమెంటు ఉభయ సభల ఆమోదాన్ని సాధించింది. అయితే ఊరంతటిదీ ఒకదారి.. ఉలిపికట్టెదొక దారి అన్న చంద్రంగా పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదం పొందుతున్న సమయయంలోనే జగన్ తన తాడేపల్లి ప్యాలెస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరో సారి మూడు రాజధానుల మాట ఎత్తారు. అయితే ఈ సారి అమరావతి, కర్నూలు, విశాఖ అని కాకుండా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలిపి రాజధానిగా ఏర్పడాలన్నారు. జగన్ ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ‘మూడు’ను పట్టుకు వేళాడుతున్నారంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. రాజధానిగా అమరావతి అభివృద్ధి అంటే.. దానికి ఆనుకుని ఉన్న మచిలీపట్నం,గుంటూరు, విజయవాడలు వాటంతటవే ఆటోమేటిగ్గా అభివృద్ధి చెందుతాయనడంలో ఇసుమంతైనా అనుమానాలకు ఆస్కారమేలేదు. అయితే జగన్ మాత్రం మూడు మూడంటూనే మచిలీపట్నం, విజయవాడ,గుంటూరుల అభివృద్ధికి మోకాలడ్డుతున్నారు.
Apr 02, 2026
మోడీకి కృతజ్ణతలు తెలిపిన నారా లోకేష్
ఐదుకోట్ల ప్రజల ఆకాంక్ష అయిన అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పూర్తి మెజారిటీతో పార్లమెంటు ఆమోదం లభించడానికి కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ విద్యా-ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీ అసెంబ్లీలో చేసి పంపిన తీర్మానంపై లోక్ సభలో సుధీర్ఘ చర్చ జరిగిన అనంతరం అమరావతి బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. దేశంలో ఉన్న అన్ని పార్టీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు నిలిపి అమరావతి బిల్లుకు చట్టబద్ధత కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీని పార్లమెంటు హాలులో గురువారం (ఏప్రిల్ 2) ఉదయం కలిసిన లోకేష్ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. లోక్ సభలో బిల్లు ఆమోదం పొందిన వెంటనే ఆగమేఘాలపై బుధవారం (ఏప్రిల్ 1) రాత్రి ఢిల్లీ వచ్చిన మంత్రి లోకేష్ కూటమి పార్టీ ఎంపీలను అభినందించారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్ సభ ఆమోదం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడిందని లోకేష్ పేర్కొన్నారు. కాగా ఢిల్లీకి చేరుకున్న మంత్రి నారా లోకేశ్‌కు తెలుగుదేశం ఎంపీలు ఘన స్వాగతం పలికారు. లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా మంత్రి లోకేశ్ వారిని అభినందిస్తూ.. అమరావతి అభివృద్ధి దిశగా ఇది కీలక ముందడుగని పేర్కొన్నారు. నిన్న లోక్ సభలో బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ఉండవల్లిలోని తన నివాసం నుంచి టీవీలో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన లోకేష్ బిల్లు లోక్ సభ ఆమోదం పొందగానే చప్పట్లతో హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే హస్తినకు బయలుదేరిన లోకేష్ గురువారం (ఏప్రిల్ 2) రాజ్యసభలో అమరావతిపై జరిగే చర్చను గ్యాలరీ నుంచి వీక్షించనున్నారు.
Apr 02, 2026
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com



