English | Telugu
ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ భగ్గు.. బీజేపీ కార్యాలయాల ముట్టడి
Updated : Dec 18, 2025
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చాలన్న మోడీ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడి జరుగుతోంది. అఖిల భారత కాగ్రెస్ కమిటీ పిలుపు మేరకు గురువారం (డిసెంబర్ 18) దేశ వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల మట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. తెలంగాణలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపు నిచ్చారు.
ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆఫీసుల వద్ద డీసీసీల నేతృత్వంలో కాంగ్రెస్ ధర్నాలకు దిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో గాంధీ భవన్, బీజేపీ కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుతో పాటు, నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్రం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను వేధిస్తోందని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
బీజేపీ కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వడంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమ కార్యాలయాలు ముట్టడిస్తామంటే ఊరుకునేది లేదని, ప్రతిఘటిస్తాం, తాటా తీస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు.