English | Telugu

మూడో విడతలోనూ ‘హస్తం’దే పై చేయి!

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో జరిగిన సంగతి తెలిసిందే. మూడు దశల్లోనూ కూడా కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. మూడో దశలో 4,158 స్థానాల్లో ఎన్నికలు జరగగా, 2,286 పంచాయతీల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. మూడు దశల్లో కలిపి 12,726 పంచాయతీలకు ఎన్నికలు జరగగా, కొన్ని మినహా అన్ని స్థానాల్లో ఫలితాలు వచ్చాయి. వీటిలో 7,093 పంచాయతీల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. 3,488 స్థానాలలో విజ యం సాధించి బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచి ఉనికి చాటుకుంది. బీజేపీ 699 స్థానాలలో గెలిచి నామమాత్రపు ప్రభావాన్ని చూపింది.

అదలా ఉంటే మూడో దశలో బుధవారం (డిసెంబర్ 17) మొత్తం 4,159 స్థానాలకుఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారలు 2,286 స్థానాలు గెలుచుకున్నారు. బీఆర్ఎస్ 1,142, బీజేపీ 242, ఇతరుఅు 479 సానాల్లో విజయం సాధించారు. ఇతరుల్లో సీసీఐ మద్దతుదారులు 24 , సీపీఎం 7 స్థానాలలో విజయం సాధించారు. మూడో విడత ఎన్నికల్లో సిద్దపేట మినహా మిగిలి30 జిల్లల్లోనూ కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగింది.

కాగా, పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల తర్వాత అత్యధిక స్థానాలు దక్కించుకున్నది స్వతంత్రులే. స్వతంత్రులే సుమారుగా 10శాతం సీట్లను గెలుచుకున్నారు. అయితే అలా గెలిచిన వారిలో 80 శాతం మంది కాంగ్రె‌స్ రెబల్సే కావడం గమనార్హం. పంచాయతీ ఎన్నికలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులూ ఈ ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి పనిచేయడం సత్ఫలితాలను ఇచ్చింది.

మూడో విడత పంచాయతీ పోలింగ్ లోనూ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. మూడో విడతలో 85.77 శాతం పోలింగ్‌ నమోదైంది. రెండో విడతతో పోలిస్తే ఇది 0.9 శాతం తక్కువ. కాగా మూడు విడతలూ కలిసి మొత్తం 85.30 శాతం ఓటింగ్ నమోదైంది. చివరి మూడో విడతలో యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 92. 56 శాతం ఓటింగ్ జరగగా, నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా 76.45 శాతం పోలింగ్‌ జరిగింది. ఇలా ఉండగా నూతనంగా ఎన్నికైక సర్పంచ్ లు ఈ నెల 22న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముందుగా ప్రకటించిన మేరకు డిసెంబర్ 20న ముహూర్తం మంచిగా లేదంటూ ఎన్నికైన సర్పంచ్ లు తెలపడంతో ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ఈ నెల 22కు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.20న ముహూర్తం సరిగా లేదని కొత్తగా ఎన్నికైన సర్పంచులు,వార్డు సభ్యులు కోరడంతో ప్రభుత్వం తేదీని మార్చినట్లు తెలిపింది.