Facebook Twitter
మేమింతే (కవిత)

 

మేమింతే (కవిత)

 

కూటి కోసం లేలేత బాల్యం కటిక చాకిరి చేస్తూ...

కమిలిపోయిన రక్తపు చేతుల్లో మొహం దాచుకొని

కన్నీరొలికించటం మనకు కొత్తేమీ కాదు...

రోజూ ఎక్కడోచోట చూస్తూనే ఉంటాం...

అయితే మనకేంటండి...

మన పిల్లలు ఏ.సి కారుల్లో స్కూల్ కి వెళ్తారు...

ఉదయాన్నే శాండ్విచ్లు

మధ్యాహ్నం వాళ్ళు తిన్నా తినకపోయినా నాలుగైదు రకాలతో భోజనం...

సాయత్రం పిజ్జాలు, బర్గర్లూనూ...

ఇంటికొచ్చి మరీ ట్యూషన్లు చెప్పే ఉపాధ్యాయులునూ ...

మన పిల్లలైతే సుఖంగా ఉన్నారు అది చాలండి మనకు...

భలే తృప్తికరమైన జీవితాలు సుమీ!

 

రోడ్డు మీద ఎవడికివాడే సినిమాల్లో రౌడీల్లా ఫీలయిపోయి...

కత్తులతో నరుక్కోవడాలు, రేపులు చేయడాలు...

అది మనం నిజంగానే సినిమా చూస్తున్నట్టు మస్తు ఇంట్రెస్టింగ్గా చూస్తాం...

ఇంకా కొంత మందిమి అయితే మరింత క్యూరియాసిటీతో...

వీడియోలు తీసి యూట్యూబ్లో అప్లోడ్ కూడా చేస్తాం...

మళ్ళీ మనమే అన్యాయం అమానుషం అంటూ పోస్ట్లు పెడతాం...

ఎంత గొప్ప సామాజిక సేవో కదా!

వియ్ ఆర్ వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఇన్ ది సొసైటీ యు నో...

 

పెళ్ళాంతో షికార్లు చేస్తూ

పక్కింటావిడ గురించి ఆలోచనలు...

నేను శ్రీరామచంద్రున్ని సుమీ!

(పాపం సీతమ్మను అడవులకు పంపినందుకు ఆయనకు పాపం చుట్టుకుందేమో... ప్రతీ వాడు ఆయన పేరు వాడేస్కోవటమే... )

మరేమో మావి చాలా పవిత్రమైన జీవితాలండి....

 

కష్టపడి చదివించి, ఉద్యోగం వచ్చాక, పెళ్లి చేసేంత వరకే తల్లితండ్రులతో పని...

ఆ తర్వాత పెళ్ళాం, పిల్లలు, ఉద్యోగాలు...

ఇంకా ఆ ముసలి వాళ్లకు సేవ చేస్తూ కూర్చుంటే మా జీవితం ఏమైపోనూ...

కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి...

అపుడు వాళ్ళు కూడా ఇలాగే అనుకుంటే మీ పరిస్థితి ఏంటి అంటారా?

ఎవరండీ అది యెదవ ఫిలాసఫీలు మాట్లాడేది?

అపుడు అది వాళ్ళ భాద్యత...

ఇపుడు మాకిది బరువు...

మేమేదో పాపం చేసినట్లు మాట్లాడతారేం...

సంవత్సరానికోసారి ఉన్నారో, లేదో చూసొస్తున్నాంగా...

మావెంత రెస్పాన్సిబుల్ బతుకులో మీకేం తెలుసు...

మేమింత గిరిగీసుకొని ఎవరిని కష్టపెట్టకుండా

బతికేస్తుంటే మమ్మల్నే ఆడిపోస్కున్టారేం...

....సరిత భూపతి