Facebook Twitter
చిన్న చిన్న మాటలే....

 

చిన్న చిన్న మాటలే....

 

ఎన్నో మాటలు చెప్పలనుకుంటాను చాలాసార్లు
కానీ ఏమీ చెప్పలేకపోతాను.
కూర మాడి, రుచిపోయిందని నువు మొహం మాడ్చుకున్నపుడు
అరగంట స్టవ్ దగ్గరే ఎందుకు నిలబడలేకపోయానో,
కూర కన్నా ఎక్కువ మాడిన నీ మొహం చూసాకా,
చెప్పలేక పోతాను.

నాతో కలుపుకొని, అత్త మామలతో సహా
ఇంట్లో ఎవరు మంచం పట్టినా సెలవుపెట్టాకా,
పిల్లవాడికి జ్వరం వస్తే, ఈసారి రెండ్రోజులు
నువు సెలవు పెడతావా అని నేనడిగేలోపే,
వెంటనే బాస్ కి ఫొన్ చేసి నాల్గు రోజులు
రానని చెప్పేయని నువు తిరుగులేని ఆర్డర్ వేసినప్పుడూ
ఏదో చెప్పాలనుకుంటాను.

నాతో షాపింగ్ కి వచ్చినపుడు నేనేరుకున్న చీరల్లో,
నాకేది నప్పుతుందో చెప్తావని నీకోసం చూస్తుంటే
నువు దూరంగా ఫోన్ మాట్లాడుకుంటూ,
ఇంకెంత సేపు చేస్తావని చిరాకుగా చూసినప్పుడు
నీతో ఏమీ చెప్పలేకపోతాను.

ఒంట్లో నలతగా ఉండి రాత్రంతా నిద్రపట్టక
లేటుగా లేచాకా, సమయం చాలక నిన్ను సహాయం
అడిగేలోపు, 'నీకు బద్ధకం పెరుగుతోందీమధ్య....'
అన్న నీ మాటలు, చురకల్లా తగిలినప్పుడు
మౌనంగానే ఉండిపోతాను.

అనుకోకుండా వచ్చిన సెలవురోజున
కంప్లీట్ గా రిలాక్స్ అవుదామనుకున్నాకా
అనెక్స్పెక్టెడ్ గా వచ్చిన గెస్ట్స్ ని నువు
భోజనానికి ఉండమని బతిమాలుతున్నపుడు,
నా మౌనంలోని నిస్సహాయత నీక్కనపడనప్పుడూ
నేనేమీ చెప్పలేక పోతాను.

బాధ్యత గల ఉద్యోగినిగా, "లేడీస్ జాబ్" అనే
చులకన టాగ్ ని తట్టుకోలేని నేను,
నన్ను ప్రూవ్ చేస్కోడానికి ఇద్దరి ముగ్గురి పని చేస్తే
అందులో కనపడని ఔచిత్యం, పనితనం
రకరకాల కుంటిసాకులతో పనెగ్గొట్టడంలో నేర్పరులైన ఆడవాళ్ళలో
నీక్కనిపించి వాళ్ళని పొగుడుతున్నపుడూ
నే చెప్పాలనుకున్నది నీకు చెప్పలేను.

ఆఫీస్ లో నా పనిని బాస్ పదిమందిలో మెచ్చుకుంటే
ఆ సంతోషం నీతో పంచుకోవాలనుకున్నపుడు
నువు నీ లేడీ కొలీగ్స్ చీరల సెలక్షన్నో
ఆఫీస్ లో అందరికోసం వండి పట్టుకొచ్చిన వాళ్ళ ఓపికల్నో
మెచ్చుకుంటున్నపుడు కూడా ఎంతో చెప్పాలనుకుంటాను.

అలసిన శరీరంతో, తిండి కన్నా కూడా నిద్రకోసం తపిస్తూ
మంచమ్మీద వాలినప్పుడు, నా శరీరం మీద
పాకే నీ స్పర్శ లోని కాంక్ష బలాన్ని
గ్రహించినా, నా మనసు మొరాయిస్తుంటే,
రొమాన్సంటే బై డీఫాల్ట్ పక్క ఎక్కగానే జరిగే
రొటీన్ ఏక్షన్ కాదని చెప్పాలనిపించినా చెప్పలేకపోతాను.

కొన్ని మాటలకెప్పుడూ ఇంటెండెడ్ మీనింగ్స్ వేరే ఉంటాయి
ఎటువంటి మాటలూ, అర్ధాలూ దూరని జఢపదార్ధాలూ ఉంటాయి
చెప్పుకున్న మాటల్లో ఆడవారికి అర్ధం అయిన విషయాల వల్లనో,
ఆడవాళ్ళు చెప్పని మాటల అర్ధాలు, అపార్ధాలూ లేక పోవడం వల్లనో,
సంసారాలు సాఫీగానే నడుస్తూన్నట్లు ఉంటాయేమో.....

వివాహబంధమనే ఈ ఇంట్లో మూసుకున్న ద్వారం తప్ప కిటికీలుండవు......
అందుకే ఏది ఎలా ఉన్నా, ఇక్కడ ఎక్కడకక్కడ ఫుల్ స్టాప్ లే ఉంటాయి.

............ శారద శివపురపు