Facebook Twitter
జీవితం విలువ

 

 

ఏకాకిలా వచ్చాను..
లక్ష కుసుమార్చన కోసం పూలు ఏరుతున్నట్టు
త్వరత్వరగా కొన్ని ఆనందాల్ని ఏరి మూటగట్టుకోవాలనుకుంటాను
ఆ తొందరలో కొన్ని పూలు నలిగిపోయినట్టు
అన్ని ఆనందాల్నేగాక కొన్ని దు:ఖాల్ని కూడా మూటగట్టుకుంటాను

గమ్యం కోసం పయనిస్తూ ఉంటాను...
ఎదురుపడిన కొందరు ఆత్మీయులను
చీమల బారులా నాతో పాటు కలుపుకుంటాను..
నా త్రోవలో నాతో పాటే నడిచే బంధాలు కొన్ని ...
మధ్యలో వేరే చీమల బారులో కలిసిపోయే బంధాలు కొన్ని..

చెట్టులా కొన్ని భాద్యతలు నెత్తిన వేసుకుంటాను...
పూలు విరబూసి గమ్యం చేరుకునే విజయాలు కొన్ని...
నేను మోయలేక ఎండి రాలిపోయే పుష్పాలు (భాద్యతలు) కొన్ని ...

నేను సాయం చేస్తే నీరు పోసి పెంచిన మొక్కలా
తిరిగి ఆక్సిజన్ ఇచ్చి ఋణం తీర్చుకునేలా ఉండే బంధాలు కొన్ని...
యూస్ అండ్ త్రో వస్తువులా వాడి విదిలించుకునే బంధాలు కొన్ని ...

కానీ నేనేమీ ఉపయోగపడనని తెలిసినపుడు
చివరగా కాయాన్ని మోయాలని ఉబలాటపడే
ఆ నలుగురే ఇన్ని ఏళ్ళు నేను ఎంత కీర్తిని
సంపాదించాను అనే దానికి నిదర్శనం ....

పుట్టినపుడు ఏకాకినే
పోయేటపుడు ఏకాకినే
మద్యలో నేను అల్లుకున్న పూల పొదరిల్లు
ఎంతగా పరిమళిస్తుందో
ఎదుటి వారి హృదయాలను దోచుకుంటుందో
అదే నేను సద్వినియోగపరచుకున్న నా జీవితపు విలువ .......

- సరిత భూపతి